logo

టెంకాయ కొడితే సరిపోదు

పెరుగుతున్న జనాభా అవసరాలు, పట్టణీకరణలో భాగంగా చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. నిధులు మంజూరైనా గుత్తేదారుల అలసత్వం

Published : 03 Jun 2023 04:28 IST

మద్దూరులో రోడ్డు వెడల్పు పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి హరీశ్‌రావు (పాత చిత్రం)

న్యూస్‌టుడే-మద్దూరు   : పెరుగుతున్న జనాభా అవసరాలు, పట్టణీకరణలో భాగంగా చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. నిధులు మంజూరైనా గుత్తేదారుల అలసత్వం, అధికారుల నిర్లక్ష్యంతో పనులు ముందుకు సాగటం లేదు. జిల్లాలోని మద్దూరు, దామరగిద్ద, కోస్గి మండల కేంద్రాల్లో చేపట్టిన రోడ్డు విస్తరణ పనుల తీరిది. మద్దూరు రోడ్డుకు నిధులు మంజూరై టెండర్‌ పూర్తయినా గుత్తేదారుల అలసత్యంతో పనులు ముందుకు సాగటం లేదు. పట్టణంలోని కోస్గి రోడ్డులో సినిమా టాకీస్‌ నుంచి పాతబస్టాండ్‌ మీదిగా నారాయణపేట రోడ్డు అధ్వానంగా ఉంది. ఖాజీపూర్‌ చౌరస్తా వరకు రోడ్డు వెడల్పు చేయడానికి రూ.4.57కోట్లు మంజూరయ్యాయి. గత ఏడాది జూన్‌ 16న మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌లు శంకుస్థాపన చేశారు. ఏడాది గడిచినా టెండర్‌ వేసిన గుత్తేదారుడు ముందుకు రాకపోవటంతో పనులు ప్రారంభం కావటం లేదు. మద్దూరు పట్టణం రోజు రోజుకూ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది.
చుట్టూ సుమారు 70 గ్రామాల ప్రజలు అవసరాల నిమిత్తం పట్టణానికి వచ్చి వెళ్తున్నారు. వందల సంఖ్యలో ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలు వచ్చి వెళ్తున్నా సరిపడా రహదారుల సౌకర్యం లేక ఇబ్బందులు తప్పటం లేదు. ప్రధాన రహదారి ఇరుకుగా ఉండటంతో పాత బస్టాండ్‌లో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతోంది. రోడ్డుకు ఇరువైపులా పండ్ల, పూల, కూరగాయల వ్యాపారస్తులు రోడ్డుపైనే దుకాణాలను ఏర్పాటు చేసుకున్నారు. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటం, రోడ్డుకు ఇరువైపులా వ్యాపార కేంద్రాలు ఉండటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. మండల కేంద్రం దామరగిద్దలో  రూ.రెండు కోట్ల వ్యయంతో చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. రోడ్డుపై కంకర వేసి వదిలేయటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కోస్గి మండల కేంద్రంలో పరిగి-హైదరాబాద్‌ రోడ్డు విస్తరణ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. ఇటీవల రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇళ్లను కూల్చివేశారు. పనులు నత్తనడకన కొససాగటంతో పట్టణ వాసులతో పాటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

గుత్తేదారులపై ఒత్తిడి తెస్తాం

మద్దూరులో రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించడానికి గుత్తేదారునిపై ఒత్తిడి తెస్తామని ఆర్‌ఆండ్‌బీ ఈఈ రాములు తెలిపారు. ఇతర పనుల్లో గుత్తేదారునికి బిల్లులు రాకపోవటంతో మద్దూరులో పనులు జాప్యం చేస్తున్నారన్నారు. దామరగిద్దలో రోడ్డు విస్తరణ పనులు గుత్తేదారుడితో పూర్తి చేయిస్తామని ఈఈ కేవీఎన్‌ స్వామి తెలిపారు. కోస్గిలో కొందరు కోర్టుకు వెళ్లటంతో పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆర్‌ఆండ్‌బీ ఏఈ శ్వేత తెలిపారు. మధ్యేమార్గంగా పరిష్కారం కనుగొంటామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు