లస్కర్ల నియామకానికి అడుగులు
నీటి పొదుపు పాటిస్తే.. ఆయకట్టు పెరుగుతుందని గుర్తించిన ప్రభుత్వం రెవెన్యూ శాఖలోని గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్‌ఏలు)ను క్రమబద్ధీకరించి వారిని నీటిపారుదల శాఖకు బదలాయించాని నిర్ణయించింది.
నెట్టెంపాడు ఉపకాల్వలో పారుతున్న నీరు
గద్వాల, న్యూస్‌టుడే: నీటి పొదుపు పాటిస్తే.. ఆయకట్టు పెరుగుతుందని గుర్తించిన ప్రభుత్వం రెవెన్యూ శాఖలోని గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్‌ఏలు)ను క్రమబద్ధీకరించి వారిని నీటిపారుదల శాఖకు బదలాయించాని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జోగులాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా ఉన్న వీఆర్‌ఏలను నీటిపారుదల శాఖకు బదలాయించనున్నారు. సాగునీటి శాఖలో డివిజన్లు, సర్కిళ్ల వారీగా అవసరమైన సిబ్బంది సంఖ్యను గుర్తించి వివరాలు ఇవ్వాలని ఇప్పటికే ఈఎన్‌సీ నుంచి సూచనప్రాయంగా జిల్లా సాగునీటి శాఖ అధికారులకు ఆదేశాలు వచ్చినట్లు సమాచారం.
త్వరలో నిర్ణయం వెలువడే అవకాశం
జిల్లాలో నెట్టెంపాడు, జూరాల, ఆర్డీఎస్, ప్రాజెక్టులున్నాయి. వీటి పరిధిలో మొత్తం 3.27 లక్షల ఎకరాల వరకు సాగు ఆయకట్టు ఉంది. పూర్తి స్థాయిలో నీటిని చివరి ఆయకట్టు వరకు ఇవ్వలేని పరిస్థితి ఉంది. డిస్ట్రిబ్యూటరీల వద్ద నీటి వృథా, ఆధునికీకరణ లేక కాల్వలు శిథిలావస్థకు చేరటం, నీటిని ఆయకట్టుకు వదిలే క్రమంలో అవసరం కంటే రైతులు ఎక్కువగా నీటిని తూముల నుంచి తరలించుకోవటం వంటి సమస్యలతో ఏటా చివరి ఆయకట్టుకు కటకట ఏర్పడుతోంది. చెరువుల కింద అదే పరిస్థితి ఉంది. ప్రధాన చెరువుల తూముల నుంచి పంటలకు నీటి విడుదల పర్యవేక్షణకు సిబ్బంది లేక రైతులు ఇష్టానుసారంగా వృథా చేస్తున్నారు. వీటిని అరికట్టేందుకు ప్రతి 50 ఎకరాలకు పైగా ఉన్న ప్రతి పది చెరువులకు ఒక లస్కర్‌ను నియమించాలని ప్రభుత్వం యోచిస్తోంది. పునర్‌వ్యవస్థీకరణపై త్వరలోనే నిర్ణయం వెలువడే అవకాశం ఉందని సాగునీటి శాఖ వర్గాలు తెలిపాయి.
జిల్లాలో 440 మంది వీఆర్‌ఏలు
జోగులాంబ గద్వాల జిల్లాలో 440 మంది వరకు వీఆర్‌ఏలు ఉన్నారు. వారిలో కొంత మంది ఉన్నత విద్య అభ్యసించిన వారు ఉన్నారు. సాగునీటి శాఖ అవసరాల మేరకు ఇంటర్‌లోపు విద్యాభ్యాసం చేసిన వీఆర్‌ఏలను గుర్తించి సాగునీటిశాఖకు బదలాయించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. జోగులాంబ జిల్లాలో ఇంటర్ లోపు చదివిన వీఆర్‌ఏలు 288 మంది వరకు ఉన్నట్లు అధికారిక సమాచారం. మిగిలిన వారిని ఇతర శాఖలకు జూనియర్ అస్టిటెంట్ క్యాడర్‌కు బదలాయించే అవకాశం ఉంది.
ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం: జిల్లా ప్రాజెక్టుల పరిధిలో అవసరం ఉన్న లస్కర్లు, హెల్పర్ సిబ్బంది నియామక ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టుల వారీగా అవసరమున్న సిబ్బంది వివరాలు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం. జిల్లాలోని ప్రాజెక్టుల పరిధిలో 194 మంది లస్కర్, 85 మంది హెల్పర్‌లు అవసరం ఉంది.
శ్రీనివాసరావు, జిల్లా ప్రాజెక్టుల ఎస్‌ఈ, జోగులాంబ గద్వాల జిల్లా
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.