logo

దేశానికే ధాన్యాగారంగా తెలంగాణ

దేశంలోనే అత్యధికంగా వరి, చిరుధాన్యాలు పండిస్తున్న తెలంగాణ ధాన్యాగారంగా మారిందని రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. మహబూబ్‌నగర్‌ మండలం కోడూరు రైతువేదిక వద్ద శనివారం ఏర్పాటుచేసిన రైతు దినోత్సవంలో మంత్రి పాల్గొన్నారు.

Published : 04 Jun 2023 03:29 IST

రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

కోడూరులో కస్తూర్బా విద్యాలయాన్ని ప్రారంభిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, చిత్రంలో కలెక్టర్‌ జి.రవినాయక్‌, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ రాజేశ్వర్‌గౌడ్‌, ఎంపీపీ సుధాశ్రీ

మహబూబ్‌నగర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే : దేశంలోనే అత్యధికంగా వరి, చిరుధాన్యాలు పండిస్తున్న తెలంగాణ ధాన్యాగారంగా మారిందని రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. మహబూబ్‌నగర్‌ మండలం కోడూరు రైతువేదిక వద్ద శనివారం ఏర్పాటుచేసిన రైతు దినోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. అంతకు ముందు కోడూరు వద్ద రూ.35 లక్షల వ్యయంతో నిర్మించిన కస్తూర్బా పాఠశాల, చౌదర్‌పల్లిలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీరోడ్డు, తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని మంత్రి ప్రారంభించారు. తర్వాత రైతువేదిక వద్ద ఏర్పాటు చేసిన వేడుకలో రైతులను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ రైతుబిడ్డ కావడంతో రాష్ట్రం ఏర్పడగానే వ్యవసాయ రంగంపై దృష్టి సారించారని, సాగునీటి వనరులను సమకూర్చి ఉచిత విద్యుత్తు, రైతుబంధు పథకం అందించారని గుర్తుచేశారు. తెలంగాణలో వ్యవసాయరంగం మునుపెన్నడూ లేనంతగా వృద్ధి చెందిందని, ప్రతి సీజన్‌లో రికార్డు స్థాయిలో దిగుబడి వస్తోందని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సాగునీరు, విద్యుత్తు సరఫరా లేక చెరువులు ఎండిపోయి వ్యవసాయ రంగం కుదేలైందని, రైతులు వలసలు వెళ్లేవారని గుర్తుచేశారు. రైతులు నేడు రెండు పంటలు పండిస్తూ గౌరవంగా జీవిస్తున్నారని పేర్కొన్నారు. జడ్పీ ఛైర్‌పర్సన్‌ స్వర్ణసుధాకర్‌ మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. జిల్లా కలెక్టర్‌ జి.రవినాయక్‌ మాట్లాడుతూ రైతు దినోత్సవంలో భాగంగా జిల్లాలో 86 రైతు వేదికల్లో రైతు దినోత్సవం నిర్వహించినట్లు చెప్పారు. జిల్లాలో గతంలో 2.18 లక్షలు మాత్రమే సాగు విస్తీర్ణం ఉండగా 97వేల ఎకరాలు అదనంగా సాగులోకి వచ్చాందన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ రాజేశ్వర్‌గౌడ్‌, ఎంపీపీ సుధాశ్రీ, వైస్‌ ఎంపీపీ అనిత, సింగిల్‌ విండో ఛైర్మన్‌ రాజేశ్వర్‌రెడ్డి, రైతుబంధు సమితి బాధ్యుడు దేవేందర్‌రెడ్డి, సర్పంచులు శ్రీకాంత్‌గౌడ్‌, శంకరమ్మ, భారాస నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని