logo

గుణపాఠం నేర్వాల్సిందే!

ఒడిశా రాష్ట్రంలోని బాలసోర్‌ జిల్లాలో జరిగిన ప్రమాదం నుంచి గుణపాఠాలు నేర్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లా పరిధిలో నిత్యం రద్దీగా ఉండే బల్లార్ష- కాజీపేట రైల్వే మార్గంలో భద్రత చర్యలు సమీక్షించాల్సిన అవసరం ఉంది.

Published : 04 Jun 2023 03:07 IST

మూడో రైల్వేలైను పనుల వేళ అప్రమత్తత అవసరం

వంజీరి వద్ద జరుగుతున్న మూడో రైల్వే లైన్‌ కల్వర్టు పనులు

కాగజ్‌నగర్‌, న్యూస్‌టుడే: ఒడిశా రాష్ట్రంలోని బాలసోర్‌ జిల్లాలో జరిగిన ప్రమాదం నుంచి గుణపాఠాలు నేర్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లా పరిధిలో నిత్యం రద్దీగా ఉండే బల్లార్ష- కాజీపేట రైల్వే మార్గంలో భద్రత చర్యలు సమీక్షించాల్సిన అవసరం ఉంది. సిగ్నల్స్‌లో ఎలాంటి లోపాలు, మూడో రైల్వేలైన్‌ పనుల్లో భాగంగా కల్వర్టుల వద్ద జరుగుతున్న నిర్మాణాలపై అప్రమత్తంగా ఉండేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

గతంలో కాగజ్‌నగర్‌ డివిజన్‌ పరిధిలోని పలు రైలు ప్రమాదాలు జరిగాయి. తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదంలో పెద్దఎత్తున ప్రాణనష్టం సంభవించగా.. మిగతా ప్రమాదాల్లో రైల్వేశాఖకు తీరని నష్టం జరిగింది. ప్రస్తుతం బల్లార్ష- కాజీపేట వరకు 226 కిలోమీటర్ల వరకు మూడో రైల్వేలైను పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా కాగజ్‌నగర్‌ రైల్వేస్టేషన్‌ పరిధిలోని వంజీరి రైల్వే గేటు స్థానంలో రూ.6 కోట్ల వ్యయంతో అండర్‌బ్రిడ్జి పనులు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

గతంలో జరిగిన ఘటనలు

* బల్లార్ష- కాజీపేట మార్గంలో కాగజ్‌నగర్‌ పెద్దవాగు సమీపంలోని రాళ్లపేట రైల్వేస్టేషన్‌ వద్ద 1981 సంవత్సరంలో తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పింది. ఆ ఘటనలో దాదాపు వందకుపైగానే ప్రయాణికులు మృతిచెందారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు.

* 1992 సంవత్సరంలో సిర్పూర్‌(టి)- బల్లార్ష రైల్వేస్టేషన్‌ మధ్యలోని రైల్వే కల్వర్టును మావోయిస్టులు బాంబుతో పేల్చడంతో దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. ఆ రైలులో అప్పటి నెల్లూరు ఎంపీ పసుల చెంచలయ్య(కాంగ్రెస్‌) ప్రయాణిస్తున్నారు. త్రుటిలో ఆయనకు ప్రాణాపాయం తప్పింది. పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి.

* 1999లో కురిసిన భారీ వర్షాలకు రెబ్బెన రైల్వేస్టేషన్‌ సమీపంలోని వాగుపై రైల్వే వంతెన ఒక పిల్లర్‌ కొట్టుకుపోగా.. కాగజ్‌నగర్‌- హైదరాబాద్‌ భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఆ సమయంలో వారంరోజుల పాటు రైలు రాకపోకలు నిలిచిపోయాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని