logo

టైరే కదా అని వదిలేస్తే...

కర్ణాటకలోని కొప్పళ జిల్లా కుష్టిగి తాలుకా కలికేరి వద్ద గత నెల 28న ఓ కుటుంబం ప్రయాణిస్తున్న కారు టైరు పేలి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టిన సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృత్యువాత పడ్డారు..

Updated : 04 Jun 2023 05:30 IST

న్యూస్‌టుడే-పాలమూరు, కోస్గి న్యూటౌన్‌: కర్ణాటకలోని కొప్పళ జిల్లా కుష్టిగి తాలుకా కలికేరి వద్ద గత నెల 28న ఓ కుటుంబం ప్రయాణిస్తున్న కారు టైరు పేలి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టిన సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృత్యువాత పడ్డారు..వాహనాల టైర్ల నాణ్యత ఎంత ముఖ్యమో ఈ సంఘటన చెబుతోంది. మన ఉమ్మడి జిల్లాలోనూ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చోదకులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

తస్మాత్‌ జాగ్రత్త

* వాహనాలకు ఉండే టైర్లను నిరంతరం పర్యవేక్షించాలి. ఎక్కువ లేదా తక్కువ గాలితో నింపవద్దు

* సాధారణంగా కార్ల ముందు భాగాన ఉన్న టైర్లలో 32, వెనుక ఉన్న టైర్లలో 36 వరకు గాలిని ఉంచాలి.

* కంపెనీకి చెందిన గాలి మోటార్ల ద్వారానే నింపుకోవడం శ్రేయస్కరం. కొన్ని ప్రాంతాల్లో గాలిని నింపే ట్యాంకులు నాసిరకంగా ఉండటంతో వాటి ముళ్లు సక్రమంగా చూపించడం లేదు. . దీంతో గాలి ఎక్కువై ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.

* టైర్లు గట్టిపడినా, అందులో నెర్రెలు వచ్చినా, ఇనుప వైర్లు బయటకు తేలినా వెంటనే మార్చేయాలి.

* టైర్లను రీబటన్‌ చేసి వాడవద్దు. ఎందుకంటే అరిగిన టైర్లను తిరిగి బటన్‌ వచ్చేలా చేయడంతో వాటి సామర్థ్యం దెబ్బతింటుంది.

* పంక్చర్‌ అయిన టైర్లను బాగుచేసి కారుకు ముందు వాడొద్దు. వాటిని వెనుక వైపు వాడాలి. ఎందుకంటే స్టీరింగ్‌కు ముందున్న టైర్లే ఆధారం. ముందు టైర్లు పేలిపోయినప్పుడు స్టీరింగ్‌ను అదుపు చేయలేం. ఎటువైపు టైరు పగిలితే అటు వైపు దూసుకొని వాహనం వెళుతుంది.

* సాధారణంగా 40 వేల కిలోమీటర్ల వరకు టైర్లు సమర్థంగా పని చేస్తాయి. ఆ తరువాత కూడా వాహనాన్ని నడపవచ్చు. కానీ వాటిపై పర్యవేక్షణ మాత్రం ఉండాలి..

* వేసవి కాలంలో ఎక్కువ వేగంగా వెళ్లరాదు. రోడ్డు వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటి ప్రభావం టైర్లపై పడుతుంది. గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతోనే వెళితే ప్రయాణం సాఫీగా సాగుతుంది.

* వాహనాన్ని నడిపేటప్పుడు ఎక్కువసార్లు బ్రేక్‌ వేస్తే డ్రమ్ము వేడెక్కి ఆ ప్రభావం డిస్క్‌పై పడుతుంది. తద్వారా టైర్లు పగలడానికి అవకాశం ఉంటుంది.

* అరిగిన టైర్లను వాడితే రోడ్డుపై పట్టు ఉండదు. వర్షాకాలంలో రహదారి నీటితో తడిసి ఉన్నప్పుడు బ్రేకు వేస్తే వాహనం ఆగదు. ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది.

* సుదూరం వెళ్లేవారు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రయాణించడం శ్రేయస్కరం. ఎక్కువ దూరం ప్రయాణిస్తే టైర్లు వేడెక్కి విస్పోటానికి గురయ్యే అవకాశాలు ఎక్కువ.

* 150 నుంచి 200 కిలోమీటర్ల దూరం ప్రయాణం తర్వాత కాస్త విరామం ఇవ్వడం శ్రేయస్కరం.

పొడవైన జాతీయ రహదారి...

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి ప్రధానంగా రెండు జాతీయ రహదారులు వెళ్తున్నాయి. హైదరాబాద్‌ -బెంగళూరు 45వ జాతీయ రహదారి పొడవైనది.. నిత్యం 35వేల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఎక్కువ ప్రమాదాలు టైర్లు పగిలిపోయినవి ఉంటున్నాయి. జడ్చర్ల, భూత్పూర్‌, అడ్డాకుల, కొత్తకోట, పేబ్బేరు, ఎర్రవల్లి కూడలి, ఇటిక్యాల, అలంపూర్‌ తదితర ప్రాంతాల పరిధిలోని జాతీయ రహదారిపై ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.

మన వద్ద  మచ్చుకు కొన్ని...

* ఈ ఏడాది ఏప్రిల్‌ 16న గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం మునగాల సమీపంలో జాతీయ రహదారిపై హైదరాబాద్‌ నుంచి కర్నూల్‌ వైపు ప్రయాణిస్తున్న కారు వెనుక టైరు పగిలి పోయింది. వాహనం అదుపు తప్పి పక్కనే ఉన్న గుంతలో పడిపోయింది. అందులో ప్రయాణిస్తున్న కర్నూలు జిల్లా ఆలూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించింది.

* గత నెల 15న మహబూబ్‌నగర్‌ సమీపంలోని అప్పన్నపల్లి శివారులో హైదరాబాద్‌ నుంచి మహబూబ్‌నగర్‌కు నిమ్మకాయల లోడుతో వస్తున్న డీసీఎం వాహనం వెనుక టైరు పగిలిపోయింది. వాహనం బోల్తా పడింది. అందులో ఉన్న డీసీఎం డ్రైవరు, క్లీనరు గాయపడ్డారు.

టైరు అని  తేలిగ్గా చూడొద్దు : వాహన చోదకులు అన్నీ పట్టించుకుంటారు. కానీ టైర్ల విషయంలో అంత సీరియస్‌గా ఉండరు. ఈ మధ్య ఘటనలు అన్నీ టైర్లతో సంభవించేవే. టైర్ల నాణ్యతపై నిపుణుల సూచనలు పాటిస్తూ ఉంటే ప్రయాణం సాఫీగా సాగిపోతోంది. టైర్ల వేడిని తగ్గించేందుకు ఈ మధ్య కాలంలో హైడ్రోజన్‌ ఫిల్లింగ్‌ కేంద్రాలు వెలిశాయి. ఈ వాయువు నింపడం ద్వారా సుదూరం ప్రయాణించే వాహనాల టైర్లు వేెడెక్కవు.  

దివిటి నరేష్‌ కుమార్‌, వాహన మెకానిక్‌, మహబూబ్‌నగర్‌

 


కోస్గి మండలం సర్జఖాన్‌పేట్‌లో టైరు చీలి కారు బోల్తా (పాతచిత్రం)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని