logo

తెలంగాణ దేశానికే ఆదర్శం

తెలంగాణలో ఉన్నది నూటికి నూరుపాళ్లు రైతు రాజ్యమని, ఇది దేశానికే ఆదర్శంగా నిలిచిందని నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం తిమ్మాజిపేటలో నిర్వహించిన రైతు దినోత్సవ వేడుకల్లో పాల్గొని మాట్లాడారు.

Published : 04 Jun 2023 03:29 IST

తిమ్మాజిపేట రైతు వేదికలో మాట్లాడుతున్న  నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి

తిమ్మాజిపేట, న్యూస్‌టుడే : తెలంగాణలో ఉన్నది నూటికి నూరుపాళ్లు రైతు రాజ్యమని, ఇది దేశానికే ఆదర్శంగా నిలిచిందని నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం తిమ్మాజిపేటలో నిర్వహించిన రైతు దినోత్సవ వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. రైతు బంధు, బీమా వంటి పథకాలు కేంద్ర పాలకుల కళ్లు తెరిపించాయన్నారు. తెలంగాణాలో పంటల సిరులు కురిపించేలా చేసిన ఘనత కేసీఆర్‌ ప్రభుత్వానిదేనన్నారు.  పాత, కొత్త రోజులను గుర్తుచేసుకోవాలని రైతులను కోరారు. అంతకుముందు తిమ్మాజిపేటలో ఎడ్ల బండ్లతో ఊరేగింపు చేపట్టారు. అనంతరం రైతులతో కలిసి ఎమ్మెల్యే సహపంక్తి భోజనం చేశారు. పోతిరెడ్డిపల్లి, గుమ్మకొండ, మారేపల్లి గ్రామాల రైతు వేదికల్లో కార్యక్రమాలు నిర్వహించారు. ఎంపీపీ రవీందర్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యులు దయాకర్‌రెడ్డి, సర్పంచులు గోపిగౌడ్‌, హర్యానాయక్‌, హుని, ఎంపీటీసీ సభ్యురాలు లీలావతి, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.

వ్యవసాయానికి అండగా భారాస ప్రభుత్వం

నాగర్‌కర్నూల్‌ : వ్యవసాయానికి భారాస ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని నల్లవెల్లి గ్రామంలో రైతు దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఎడ్ల బండ్లతో  ఊరేగింపు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తొమ్మిదేళ్లలో రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అన్నారు. రైతుకు పెట్టుబడి కింద ఎకరానికి రూ.10వేలు సాయం చేయటం, రైతు బీమా అందిస్తుందన్నారు. కేసీఆర్‌ రైతు పక్షపాతిగా ఉంటు రైతులకు అండగా ఉంటున్నారని తెలిపారు. రైతు వేదికల నిర్మాణం, ఏఈవోల నియామకం, రైతులకు కరెంటు కోతలు లేకుండా చేయటం, 24 గంటల పాటు ఉచిత కరెంటును అమలు చేస్తున్నారన్నారు. గతంలో వ్యవసాయం దండగ అని చెప్పిన రోజుల నుంచి ఇప్పుడు పండుగ వాతవరణం తీసుకొచ్చారన్నారు. కేఎల్‌ఐతో నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గంలో బీడు బీములు సస్యశ్యామలం అయ్యాయన్నారు.

అచ్చంపేట న్యూటౌన్‌ : రైతుల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు అన్నారు. రాష్ట్ర దశాబ్ది వేడుకల్లో భాగంగా శనివారం మండల వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతు వేదికలో రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పల్కపల్లిలో రూ.70 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణానికి విప్‌ గువ్వల భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఎద్దుల బండిపై ఊరేగింపులో పాల్గొన్నారు. అనంతరం రైతు వేదిక భవనాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. ప్రభుత్వం రైతును రాజును చేయాలనే సంకల్పంతో రైతుబంధు, రాయితీ పై ఎరువులు, విత్తనాలను అందజేస్తోందన్నారు. పుర ఛైర్మన్‌ నర్సింహగౌడ్‌, మార్కెట్‌ ఛైర్మన్‌ అరుణ, ఎంపీపీ అరుణ, ఎడిఎ చంద్రశేఖర్‌, ఎవో కృష్ణయ్య, నేతలు మనోహర్‌, రాజేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని