logo

రైతులు సమ్మతిస్తేనే సాగునీరు

నల్లమల ప్రాంతంలోని చివరి ఆయకట్టుకు సాగునీరందించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిపాదించిన శ్రీ ఉమామహేశ్వర, చెన్నకేశవ ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వం ఇటీవల రూ.1,534 కోట్లను కేటాయించింది.

Published : 04 Jun 2023 03:29 IST

చంద్రసాగర్‌ చెరువు (పాత చిత్రం)

అచ్చంపేట న్యూటౌన్‌, న్యూస్‌టుడే : నల్లమల ప్రాంతంలోని చివరి ఆయకట్టుకు సాగునీరందించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిపాదించిన శ్రీ ఉమామహేశ్వర, చెన్నకేశవ ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వం ఇటీవల రూ.1,534 కోట్లను కేటాయించింది. పాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది. నిధులు మంజూరైనా.. ఆయా ప్రాజెక్టుల నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు రైతులు ససేమిరా అంటుండటంతో సందిగ్ధం నెలకొంది.

గ్రామసభల బహిష్కరణతో.. : అచ్చంపేట మండలంలోని పులిజాల, హాజీపూర్‌, ఉప్పునుంతల మండలంలోని పిరట్వానిపల్లి, రాయిచెడి గ్రామాల్లో ఇటీవల భూ సేకరణ కోసం ఏర్పాటు చేసిన గ్రామ సభలను రైతులు బహిష్కరించిన సంఘటనలు ఉన్నాయి. హాజీపూర్‌లో ఏర్పాటు చేసిన గ్రామ సభకు రైతులు ఒక్కరు కూడా హాజరు కాకపోవడంతో భూసేకరణ అధికారులు వెనుదిరిగి వెళ్లిపోయారు. మార్కెట్‌ ధరలో కనీసం 50 శాతం ధర చెల్లించినా భూములిస్తామని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జలాశయాలు, కాల్వల ఏర్పాటుకు రైతులు సహకరించి భూములిస్తే సాగునీటి ప్రాజెక్టులను సత్వరమే నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని నీటి పారుదల శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

నీటి తరలింపు ఇలా.. : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నుంచి ఏదుల జలాశయం నింపి 22.750 కిలో మీటర్ల గ్రావిటి పైప్‌లైన్‌ ద్వారా లింగాల మండలంలోని జీనుగుపల్లి పంప్‌హౌస్‌కు 2 మోటార్ల ద్వారా రోజుకు ఒక టీఎంసీ నీటిని తరలించేలా ప్రణాళికను సిద్ధం చేశారు. జీనుగుపల్లి పంప్‌హౌస్‌ నుంచి 2.57 టీఎంసీల నీటిని బల్మూర్‌ మండలంలోని మైలారం శివారులో నిర్మించనున్న శ్రీ ఉమామహేశ్వర జలాశయానికి తరలిస్తారు. ఆయా ప్రాజెక్టుల నుంచి సాగునీరు వస్తే లింగాల, బల్మూర్‌ మండలాల్లోని గ్రామాలు సాగునీటితో సస్యశ్యామలం కానున్నాయి. శ్రీ ఉమామహేశ్వర జలాశయం నుంచి కాలువ ద్వారా అచ్చంపేట మండలంలోని చంద్రసాగర్‌ చెరువుకు 0.300 టీఎంసీల నీటిని నింపనున్నారు. చంద్రసాగర్‌ నుంచి ఎత్తిపోతల సాయంతో అమ్రాబాద్‌ మండలంలోని మన్ననూర్‌లో నిర్మించనున్న చెన్నకేశవ జలాశయానికి 1.410 టీఎంసీల నీటిని తరలించి పదర మండలంలోని మద్దిమడుగు ఆయకట్టుకు సాగునీటిని అందించనున్నారు. ప్యాకేజీ నంబర్‌ 30 ప్రకారం అచ్చంపేట మండలంలోని పులిజాల వద్ద నిలిచిపోయిన కేఎల్‌ఐ కాల్వను 15 కిలోమీటర్ల మేర పొడిగించేందుకు ప్రభుత్వం 2021 ఆగస్టులో రూ. 107.20 కోట్లు మంజూరు చేసింది. 2022 ఏప్రిల్‌ 6న కేఎల్‌ఐ కాల్వ పనులు చేపట్టేందుకు శంకుస్థాపన చేశారు. పనులు పూర్తయితే ఉప్పునుంతల, అచ్చంపేట, అమ్రాబాద్‌, పదర మండలాలకు పూర్తి స్థాయిలో సాగు నీరందనుంది.

సగం ధర చెల్లించినా భూమి ఇస్తా..  :  పులిజాల శివారులో నాకున్న 12 గుంటల భూమి కాల్వ పొడిగింపులో పోతుందని రెవెన్యూ అధికారులు చెప్పారు. గ్రామ శివారులో ఎకరాకు రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ధర పలుకుతోంది. ప్రభుత్వం ఇచ్చే పరిహారంతో వేరే చోట మళ్లీ భూమిని కొనలేను. మార్కెట్‌ ధరలో సగం డబ్బులిచ్చినా భూమి ఇస్తా..

ఆవుల మధుసూదన్‌, రైతు (పులిజాల)

స్వచ్ఛందంగా ముందుకొచ్చేలా అవగాహన కల్పిస్తా..  : కేఎల్‌ఐ కాల్వ పొడిగింపుతో రైతులందరికీ సాగునీరందుతుంది. భూములు కోల్పోతున్న రైతులు  సహకరించేలా వారితో ప్రత్యేకంగా మాట్లాడుతాను. భూసేకరణ చట్టం ప్రకారం రైతులందరికీ న్యాయం చేస్తాం.  దళితబంధు, కార్పొరేషన్‌ రుణాలు, ట్రాక్టర్ల పంపిణీ వంటి ప్రత్యేక పథకాల్లో ప్రాధాన్యం ఇస్తాను. గతంలో కొల్లాపూర్‌, పెద్దకొత్తపల్లి, నాగర్‌కర్నూల్‌ ప్రాంత రైతులు త్యాగాలు చేయకుంటే కింద ఉన్న తెల్కపల్లి, కల్వకుర్తి, ఉప్పునుంతల, లింగాల, బల్మూర్‌, వంగూర్‌ మండలాల్లోని వ్యవసాయ భూములకు నీళ్లు వచ్చేవా..? రైతుల కాళ్లు మొక్కి అయినా భూ సేకరణకు ఒప్పిస్తాను. ప్రభుత్వం అమలు చేస్తున్న రిజిస్ట్రేషన్‌ విలువ ప్రకారం చెల్లించి పులిజాల, హాజీపూర్‌, నడింపల్లి గ్రామాల్లోని రైతులను ఆదుకుంటాను. ప్రాజెక్టు ఏర్పాటుకు సహకరించే రైతులందరికీ అండగా ఉంటాను.

గువ్వల బాల్‌రాజు, ప్రభుత్వ విప్‌, శాసనసభ్యులు అచ్చంపేట

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని