logo

సంపద సృష్టించే అన్నదాతను గౌరవించాలి

ఎక్కువగా కష్టపడేది, సంపదను సృష్టించేది అన్నదాత అని.. అందరికంటే ఎక్కువగా వారినే గౌరవించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం జిల్లా కేంద్రం శివారు నాగవరం రైతు వేదికలో ‘రైతు దినోత్సవాన్ని’ ఘనంగా నిర్వహించారు.

Published : 04 Jun 2023 03:29 IST

రైతు దినోత్సవంలో మంత్రి నిరంజన్‌రెడ్డి

ఎడ్లబండిపై నాగారం రైతు వేదిక వద్దకు ఊరేగింపుగా వెళ్తున్న మంత్రి నిరంజన్‌రెడ్డి, కలెక్టరు తేజస్‌ నంద్లాల్‌ పవార్‌

వనపర్తి, న్యూస్‌టుడే : ఎక్కువగా కష్టపడేది, సంపదను సృష్టించేది అన్నదాత అని.. అందరికంటే ఎక్కువగా వారినే గౌరవించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం జిల్లా కేంద్రం శివారు నాగవరం రైతు వేదికలో ‘రైతు దినోత్సవాన్ని’ ఘనంగా నిర్వహించారు. మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వ్యవసాయాన్ని సంప్రదాయంగా కాకుండా పరిశ్రమగా గుర్తించి, ప్రపంచ పోకడలనెరిగి పండించిందే నిజమైన వ్యవసాయం, ఉపాధి అన్నారు. దేశంలో వ్యవసాయం పండగైందని, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుని ఆదాయ మార్గాలను పెంచుకుంటూ లాభసాటి పంటలు పండించుకోవాలని సూచించారు. ప్రపంచంలో అన్నిచోట్ల అన్ని పంటలు పండవని, ఒక్కో నేలలో ఒక్కో రకమైన పంటలు పండిస్తారని అన్నారు. ఈ దేశం, ప్రపంచ అవసరాలకు అనుగుణంగా ఆహార ఉత్పత్తులను అందించే వనరులు తెలంగాణలో ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం పప్పుల ధరలు పెరిగిపోయాయని, నిల్వలు నిండుకున్నాయని.. అందుకు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా దేశాల నుంచి పప్పులను దిగుమతి చేసుకోవడమే కారణమన్నారు. మనకు కావాల్సిన పంటలు వేసుకోవడం మీద దృష్టి పెట్టి లాభసాటి వ్యవసాయం చేస్తే అది తెలివైన పనిగా ఆయన పేర్కొన్నారు. తాను బతికినంత కాలం అన్నదాతల క్షేమానికి తొలి ప్రాధాన్యమిస్తానని చెప్పారు. స్వభావరీత్యా వ్యవసాయాన్ని ప్రేమించే తనకు వ్యవసాయ శాఖ మంత్రి పదవి లభించడం అదృష్టంగా భావిస్తానని పేర్కొన్నారు. కలెక్టర్‌ తేజస్‌ నంద్లాల్‌ పవార్‌ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం పలు పథకాలను ప్రవేశపెట్టిందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రసాయనాలు కాకుండా సేంద్రియ ఎరువులతో వ్యవసాయం చేసి సమాజానికి మంచి ఉత్పత్తులను అందించాలని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్‌ సాయిచంద్‌, జిల్లా పరిషత్తు ఛైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి, పురపాలక సంఘం అధ్యక్షుడు గట్టు యాదవ్‌, ఉపాధ్యక్షుడు వాకిటి శ్రీధర్‌, అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌, వనపర్తి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ రమేష్‌గౌడ్‌, వ్యవసాయ, ఉద్యాన, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఎడ్లబండ్ల ఊరేగింపు..

జిల్లా కేంద్రం శివారులోని ఆర్‌టీవో కార్యాలయం నుంచి నాగారం రైతు వేదిక వరకు ఎడ్ల బండ్లతో ఊరేగింపు నిర్వహించారు. మంత్రి నిరంజన్‌రెడ్డి, కలెక్టర్‌ తేజస్‌ నంద్లాల్‌ పవార్‌, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్‌ సాయిచంద్‌ ఎడ్లబండిపై రైతు ఉత్సవానికి వచ్చారు. ఊరేగింపులో మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. సభ అనంతరం రైతులతో కలిసి మంత్రి, అధికారులు సహపంక్తి భోజనం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని