logo

ఓటరు జాబితా వడపోత!

ఎన్నికల నేపథ్యంలో తప్పుల్లేని ఓటరు జాబితా సిద్ధం చేసేందుకు ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఇంటింటికి వెళ్లి ఓట్ల పరిశీలన, కొత్తగా ఓటు నమోదుకు దరఖాస్తుల స్వీకరణ, మార్పులు, చేర్పులు ప్రారంభించింది.

Published : 07 Jun 2023 04:03 IST

అలంపూర్‌లో ఇంటింటి సర్వే చేస్తున్న సిబ్బంది

గద్వాల కలెక్టరేట్‌, అలంపూర్‌, న్యూస్‌టుడే : ఎన్నికల నేపథ్యంలో తప్పుల్లేని ఓటరు జాబితా సిద్ధం చేసేందుకు ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఇంటింటికి వెళ్లి ఓట్ల పరిశీలన, కొత్తగా ఓటు నమోదుకు దరఖాస్తుల స్వీకరణ, మార్పులు, చేర్పులు ప్రారంభించింది. జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో మే 25 నుంచి అధికారులు ఇంటింటి పరిశీలనకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. అక్టోబర్‌ ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండే యువత ఓటరుగా పేర్లను నమోదు చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. అర్హులైన వారి నుంచి ఫారం 6 స్వీకరిస్తున్నారు. రెండు చోట్ల ఓటు కలిగిన వారిని గుర్తించి ఒకే చోట ఓటు హక్కు ఉండేలా చూడటంతో పాటు, ఓకే ఇంటి నంబర్‌పై ఆరుగురు కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉండే వారి వివరాలను సేకరిస్తున్నారు. ఆయా పోలింగ్‌ కేంద్రాల పరిధిలో మృతి చెందిన, ఆ ప్రాంతం నుంచి శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించే ప్రక్రియ చేపట్టారు. ఈకార్యక్రమం ఈనెల 23వ తేదీ వరకు కొనసాగనుంది.

ఆరు ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు ఉన్న ఇళ్ల తనిఖీ : ఇకే ఇంటి నంబరుపై ఆరు అంత కంటే ఎక్కువ ఓటర్లు నమోదైన ఇళ్లను మరో సారి క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలని ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లతో జరగిన సమీక్ష సమావేశంలో ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మండలాల వారీగా ఆరు కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న ఇళ్లను గుర్తించి వాటి జాబితాను తయారు చేశారు. ఒకే ఇంటిపై పదుల సంఖ్యలో ఓటర్ల ఉన్న ఇళ్లను బీఎల్‌వోలు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ఇంటి నంబరు తప్పుగా నమోదు చేశారా? వాస్తవంగా అంత మంది ఓటర్లు ఉన్నారా? అనే అంశాలను పరిశీలించి నమోదు చేస్తున్నారు.

* జిల్లాలో గద్వాల నియోజకవర్గంలో 5 మండలాల్లోని 303 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో 2,34,633 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలోని ఆయా మండలాల పరిధిలో 5,844 ఇళ్లలో ఆరుగురి కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు. అలంపూర్‌ నియోజకవర్గంలోని 7 మండలాల్లోని 289 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో 2,22,568 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలోని ఆయా మండలాల పరిధిలో 6,780 ఇళ్లలో ఆరుగురి కంటే ఎక్కువ మంది ఓటర్లు నమోదై ఉన్నారు. వీరి వివరాలను క్షేత్రస్థాయిలో బీఎల్‌వోలు తనిఖీలు చేస్తున్నారు.

అక్టోబరు 4న తుది జాబితా

ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఓటరు జాబితాలో మార్పులు, చేర్పుల ప్రక్రియను జులై 25 నుంచి 31వ తేదీ వరకు చేపట్టనున్నారు. ఆగస్టు రెండో తేదీన ముసాయిదా జాబితా విడుదల చేస్తారు. 2వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఓటరు జాబితాపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. సెప్టెంబరు 22వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించి జాబితాలో సవరణ చేస్తారు. తుది ఓటర్ల జాబితాను అక్టోబరు 4న విడుదల చేస్తారు. ఈ మెత్తం ప్రక్రియను జిల్లాలో ఆర్డీవో రాములు పర్యవేక్షిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని