logo

పాలమూరు బంగారు తునక

పాలమూరులో గంజి కేంద్రాలు పోయాయని, పంటల ధాన్యం కొనుగోలు కేంద్రాలొచ్చాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఒకప్పుడు ముంబయి బస్సులకు కేంద్రంగా పాలమూరు జిల్లా ఉండేదని, ఎక్కడ చూసినా గంజి కేంద్రాలే కనిపించేవన్నారు.

Published : 07 Jun 2023 04:03 IST

గంజి కేంద్రాలు పోయి.. ధాన్యం కేంద్రాలొచ్చాయి
నాగర్‌కర్నూల్‌ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌
ఈనాడు, మహబూబ్‌నగర్‌- నాగర్‌కర్నూల్‌, కందనూలు, న్యూస్‌టుడే:

సభకు హాజరైన ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న సీఎం కేసీఆర్‌

పాలమూరులో గంజి కేంద్రాలు పోయాయని, పంటల ధాన్యం కొనుగోలు కేంద్రాలొచ్చాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఒకప్పుడు ముంబయి బస్సులకు కేంద్రంగా పాలమూరు జిల్లా ఉండేదని, ఎక్కడ చూసినా గంజి కేంద్రాలే కనిపించేవన్నారు. జలాశయాలకు నీరొస్తే  పొలాలన్నీ పచ్చబడి పాలమూరు బంగారు తునక అవుతుందన్నారు.  నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం సుడిగాలి పర్యటన చేశారు. భారాస జిల్లా పార్టీ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం, నూతన కలెక్టరేట్‌ భవనాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. తెలంగాణ వచ్చిన తర్వాత మొదట మహబూబ్న్‌గర్‌కు, తర్వాత వనపర్తికి వైద్య కళాశాలలొచ్చాయన్నారు. తర్వాత నాగర్‌కర్నూల్‌కు ప్రత్యేక సందర్భంలో వైద్య కళాశాలను మంజూరు చేసినట్లు చెప్పారు. ఐదు జిల్లాలకు వైద్య కళాశాలలు వస్తాయని ఎవరైనా ఊహించారా? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ఫలితం ఇదేనన్నారు.తెలంగాణ ఏర్పాటు వల్లే నాగర్‌కర్నూల్‌ జిల్లా అయ్యిందన్నారు. కొత్తగా ఏర్పాటైన కలెక్టరేట్‌, ఎసీ కార్యాలయాల వద్ద లైట్ల వెలుగులో పలువురు సెల్పీ దిగుతూ ఉన్న ఫొటోలు తన దృష్టికి వచ్చాయన్నారు. గతంలో ఈ జిల్లాలో పని చేసిన మంత్రులు కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదన్నారు. ఇప్పుడు మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీరు వస్తుందన్నారు. కాకతీయ రాజులు 75 చెరువులు, కుంటలు తవ్వరని, వాటన్నింటిని గతంలోనే ధ్వంసం చేశారన్నారు. మిషన్‌ కాకతీయ ద్వారా ఈ జిల్లాలో చెరువులను పునరుద్ధరించినట్లు చెప్పారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా పాలెం, వట్టెం, కేసరి సముద్రం చెరువులు ఎంతో బాగుపడ్డాయన్నారు. కేసరి సముద్రం చెరువును ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేసి బుద్ధుడి విగ్రహాన్ని కూడా నెలకొల్పినట్లు చెప్పారు. ఒకప్పుడు దుందుభి చెరువు ఎండిపోయి ఉండేదని, ఇప్పుడు చెక్‌ డ్యామ్‌లతో జలకళ సంతరించుకుందన్నారు. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేసినట్లు చెప్పారు. 20లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు వివరించారు. అచ్చంపేటలో రూ.2వేల కోట్లతో ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. మిషన్‌ కాకతీయ ద్వారా బోరుబావులు కళకళలాడుతున్నాయన్నారు. ఉద్యమం సమయంలో నాలుగైదు చోట్ల పాలమూరు పరిస్థితి చూసి కన్నీరు వచ్చేదని, ఇప్పుడు అభివృద్ధి చూస్తే సంతోషంగా ఉందన్నారు. మహబూబ్‌నగర్‌లో 64 మండలాలను 76గా చేసుకున్నామన్నారు. రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు 15 ఉంటే ఇప్పుడు 85కు చేరుకున్నాయన్నారు.

తెలంగాణ తల్లికి సీఎం పుష్పాభిషేకం

వంద శాతం పూర్తి చేస్తాం..: నూతన కలెక్టరేట్‌లో అధికారుల సమావేశంలో సీఎం మాట్లాడారు. దేశంలో ఏ పల్లెలు తెలంగాణ గ్రామాలకు సాటిరావన్నారు. ఏ సమాజమైనా ప్రగతి సాధించిందంటే మాతాశిశు మరణాల తగ్గుదల, తలసరి ఆదాయం, తలసరి విద్యుత్తు వినియోగం చూస్తామన్నారు. వీటన్నింటిలో చాలామెరుగ్గా ఉన్నామన్నారు. ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు.. తెలంగాణ చిరునవ్వులు చిందించేలా పని చేయాలన్నారు. గతంలో మహబూబ్‌నగర్‌లో ఎటు చూసినా ఎండిపోయిన చెరువులే కనిపించేవన్నారు. ఇక్కడి చెరువులను చూసి గోరటి వెంకన్న అనేక కవితలు రాశారని గుర్తు చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో అడవులు కూడా పలుచబడిపోయి కనిపించేవన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 100 శాతం పూర్తి చేస్తామన్నారు. మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, నిరంజన్‌రెడ్డి, మహమ్మద్‌అలీ, ప్రశాంత్‌రెడ్డి, ఎంపీˆలు  శ్రీనివాస్‌రెడ్డి, రాములు, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, డా.లక్ష్మారెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, జైపాల్‌యాదవ్‌, హర్షవర్దన్‌రెడ్డి, బాలరాజు, రామ్మోహన్‌రెడ్డి, అబ్రహం, కృష్ణమోహన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు నారాయణరెడ్డి, దామోదర్‌రెడ్డి, చల్లా వెంకట్రామిరెడ్డి, గోరటి వెంకన్న, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

కలెక్టరేట్‌ వద్ద రిబ్బన్‌ కత్తిరిస్తున్న ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ గణపతిరెడ్డి

కార్యాలయాల ప్రారంభం ఇలా..

నాగర్‌కర్నూల్‌, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు హెలీప్యాడ్‌లో కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా బస్సులో భారాస కార్యాలయానికి వెళ్లారు. అక్కడ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజును కుర్చిలో కుర్చోబెట్టారు. శాలువ కప్పి సన్మానించారు. అక్కడ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డితోపాటు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి పరిసరాలను పరిశీలించారు. అక్కడి నుంచి ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఎస్పీ మనోహర్‌ను కుర్చీలో కుర్చోబెట్టి శాలువా కప్పారు. అనంతరం కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అక్కడ కార్యాలయాన్ని ప్రారంభించి లోపలికి వెళ్తుండగా ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ గణపతిరెడ్డిని పిలిచి ఆయనతో రిబ్బన్‌ కట్‌ చేయించారు. జిల్లా వాసి కావడంతో ఆయనతో ఇలా చేయించారు. కలెక్టర్‌ ఛాంబర్‌లో కలెక్టర్‌ ఉదయ్‌కుమార్‌ను మూడుసార్లు లేపి కుర్చోబెట్టారు. కలెక్టర్‌కు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సర్వమత ప్రార్థనలు చేయించారు. కలెక్టరేట్‌ను చక్కగా నిర్మించిన రోడ్డు భవనాల శాఖ అధికారులను శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించారు. సీఎం కేసీఆర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, మంత్రులు నిరంజన్‌రెడ్డి, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, డీజీపీ అంజన్‌కుమార్‌లకు కలెక్టర్‌ ఉదయ్‌కుమార్‌ శాలువాలు కప్పి సన్మానం చేశారు. అనంతరం కలెక్టరేట్‌ ఎదుట సీఎం కేసీఆర్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు గ్రూపు ఫొటో దిగారు.

* రైతుల కష్టాలు తెలిసిన కేసీఆర్‌ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి ప్రతి ఎకరాని సస్యశ్యామలం చేయడానికి కృషి చేస్తున్నారని విప్‌ గువ్వల బాలరాజు అన్నారు. సభలో ఆయన మాట్లాడుతూ ఓటుకు నోటుకు కేసులో జైలుకెళ్లి ఈ ప్రాంత పరువు తీసిన వ్యక్తి ఇప్పుడు బహిరంగ వేదికలపై సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అచ్చంపేట నియోజకవర్గ రైతులకు సాగునీరందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.30 వేల కోట్ల నిధులు కేటాయించి పరిపాలన అనుమతులు మంజూరు చేసిందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోవడానికి కార్యకర్తలు, నాయకులు సమర్థంగా పని చేయాలన్నారు.

* ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి దేశంలోని ప్రజలు తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తున్నారని  ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. భవిష్యత్తు తరాలకు మెరుగైన పరిపాలన అందించాలనే లక్ష్యంతో సీఎం కలెక్టరేట్‌, ఎస్పీ  కార్యాలయాల నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. గతంలో ఈ ప్రాంతంలో రాజకీయ పదవులు అనుభవించిన నాయకులు అభివృద్ధి పనులు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు.

కలెక్టర్‌ ఛాంబర్‌లో ఉదయ్‌కుమార్‌ను, ఎస్పీ కార్యాలయంలో మనోహర్‌ను కుర్చీల్లో కుర్చోబెడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌, చిత్రంలో  మంత్రులు మహమూద్‌ అలీ, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ప్రశాంత్‌రెడ్డి, సీఎస్‌ శాంతకుమారి, డీజీపీ అంజనీకుమార్‌, ఎంపీ రాములు, విప్‌ బాలరాజు, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, జనార్దన్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, హర్షవర్దన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని