logo

పరిశ్రమల ఖిల్లాగా ఉమ్మడి జిల్లా

సమైక్య రాష్ట్రంలో వలసల జిల్లాగా ఉన్న పాలమూరు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక పరిశ్రమల ఖిల్లాగా మారుతోందని రాష్ట్ర మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

Published : 07 Jun 2023 04:03 IST

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవంలో మాట్లాడుతున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌ అర్బన్‌, న్యూస్‌టుడే : సమైక్య రాష్ట్రంలో వలసల జిల్లాగా ఉన్న పాలమూరు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక పరిశ్రమల ఖిల్లాగా మారుతోందని రాష్ట్ర మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. మహబూబ్‌నగర్‌లో మంగళవారం నిర్వహించిన తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవంలో మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. టీఎస్‌ ఐపాస్‌ ద్వారా సింగిల్‌ విండో విధానంలో పరిశ్రమలకు అనుమతిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణని పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో మూసివేసిన పరిశ్రమలన్నీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తిరిగి ప్రారంభమయ్యాయని తెలిపారు. పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ సహకారంతో మహబూబ్‌నగర్‌కు దేశంలోనే అతి పెద్దదైన అమర రాజా లిథియం గిగా బ్యాటరీల ప్యాక్టరీ తీసుకొచ్చామన్నారు. దీని వల్ల 10వేల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. త్వరలో మరిన్ని పరిశ్రమలు తీసుకొస్తామన్నారు. గడిచిన 9 ఏళ్లల్లో మహబూబ్‌నగర్‌ జిల్లాలో 758 సూక్ష్మ, 15 చిన్న తరహా, 23 భారీ, 3 మెగా పరిశ్రమలు జిల్లాలో ఏర్పాటుచేశామన్నారు. టీఎస్‌ ఐపాస్‌, టీ-ఐడియా, టీ-ఫ్రైడ్‌, తెలంగాణ నూతన పారిశ్రామిక విధానంతో యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. కలెక్టర్‌ జి.రవినాయక్‌ మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఎంతో కృషిచేస్తున్నారని తెలిపారు. పాలమూరులో అపారమైన వనరులు ఉన్నాయన్నారు. సూక్ష్మ, చిన్న, భారీ తరహా పరిశ్రమల్లో రాణిస్తున్న వారిని ఈ సందర్భంగా మంత్రి, కలెక్టర్‌ సన్మానించారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజరు బాబూరావు, గనులు, భూగర్భ శాఖ ఏడీ విజయ్‌కుమార్‌, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకుడు వెంకటేశ్‌, ఎన్‌ఐసీ డీఐవో ఎం.ఎస్‌.మూర్తి, లీడ్‌బ్యాంక్‌ మేనేజరు కల్వ భాస్కర్‌, కార్మికశాఖ ఉప కమిషనర్‌ చంద్రశేఖర్‌గౌడ్‌, పారిశ్రామిక వేత్తలు, అధికారులు, బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు