logo

హరితహారానికి సమాయత్తం

వర్షాలు ప్రారంభమైన వెంటనే జిల్లా కేంద్రం మహబూబ్‌నగర్‌లో హరితహారం కింద మొక్కలు నాటేందుకు పురపాలిక సిద్ధమైంది. ఇప్పటి వరకు 8 విడతలుగా నిర్వహించిన హరితహారంలో ఆశించిన స్థాయిలో మొక్కలు నాటి ఫలితాలు పొందిన పురపాలిక ఇప్పుడు 9వ విడతలో రికార్డు స్థాయిలో నాటేందుకు ముందుకు వెళ్తోంది.

Published : 07 Jun 2023 04:03 IST

పురపాలిక 16 నర్సరీల్లో 6.30 లక్షల మొక్కల పెంపకం
న్యూస్‌టుడే, పాలమూరు పురపాలకం

బృందావన్‌కాలనీ నర్సరీలో మొక్కలకు నీరు పడుతున్న పుర కమిషనర్‌ ప్రదీప్‌కుమార్‌

వర్షాలు ప్రారంభమైన వెంటనే జిల్లా కేంద్రం మహబూబ్‌నగర్‌లో హరితహారం కింద మొక్కలు నాటేందుకు పురపాలిక సిద్ధమైంది. ఇప్పటి వరకు 8 విడతలుగా నిర్వహించిన హరితహారంలో ఆశించిన స్థాయిలో మొక్కలు నాటి ఫలితాలు పొందిన పురపాలిక ఇప్పుడు 9వ విడతలో రికార్డు స్థాయిలో నాటేందుకు ముందుకు వెళ్తోంది. 7వ విడతలో ఇతర ప్రాంతాల నుంచి మొక్కలు దిగుమతి చేసుకొని నాటించినా.. 8వ విడత కోసం పట్టణంలోనే నర్సరీలు ఏర్పాటు చేయించింది. 9వ విడత కోసం నర్సరీల్లో సెంట్రల్‌ మీడియన్‌, ఎవెన్యూ, ఎడ్జ్‌ మల్టీ లేయర్‌లలో నాటేందుకు నీడ, పండ్లను ఇచ్చే మొక్కలు పెంచింది. వర్షాలు కురిసిన వెంటనే హరితహారంలో ఎక్కడికక్కడ పండగ వాతావరణంలో మొక్కలు నాటేందుకు యంత్రాంగాన్ని సిద్ధం చేసింది.

రూ.75 లక్షలు.. 16 నర్సరీలు.. : 9వ విడత హరితహారం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన గ్రీన్‌ బడ్జెట్‌ కింద పురపాలిక రూ. 75 లక్షలు ఖర్చు చేసింది. పట్టణంలోని ఏడు ప్రాంతాల్లో 16 నర్సరీలు ఏర్పాటు చేశారు. ఒక్కో నర్సరీలో 30వేల నుంచి 50వేల చొప్పున మొత్తం 6.30 లక్షల మొక్కలు పెంచారు. ఈ దఫా మొక్కలు పెంచే ప్లాస్టిక్‌ సంచుల పరిమాణం కూడా పెంచారు. 8వ విడతలో 4/8, 5/9 పరిమాణంలోని కవర్లు ఉపయోగించగా ఈసారి 6/8 పరిమాణంలో ఉండేవి వాడుతున్నారు. గత అనుభవాలు, విమర్శలను దృష్టిలో ఉంచుకొని ఈసారి నర్సరీల్లో విత్తనాలు, స్టంట్లు నాటేందుకు ఎర్రమట్టి, ఒండ్రుమట్టి, పశువుల ఎరువు ఉపయోగించారు. మొక్కలు రెండు నుంచి నాలుగు అడుగుల వరకు ఎత్తు పెరిగాయి.

నాటే మొక్కలు ఇవే..: పనస, నేరేడు, చైనాబాదం, గోరింటాకు, నందివర్ధనం, జాతి గులాబీ, మల్లె, హిబికన్‌, నిరియుం, సన్నజాజి, మనీ ప్లాంట్‌, నిమ్మ, సపోట, జాక్‌ఫ్రూట్‌, ఉసిరి, దానిమ్మ, బొప్పాయి, అలవేర, మామిడి, మందారం, టెకొమా, బౌగన్‌విల్లా, కరివేపాకు, రెడ్‌ ఆలకిప్తా, మెడిసిన్‌ ప్లాంట్‌, కానుగ, రావి, వేప, కానుగ, ఫెల్టోఫాం, తబూబియా, రోసియా, స్పథోడియా, గుల్‌మోరా, మహాగని, కదంబ తదితర మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. వీటిని జూన్‌, జులై, ఆగస్టు మాసాల్లో నాటనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని