logo

పొగ మానేస్తే కోటీశ్వరులే

రూ.217 కోట్లు(నెలకు).. ఈ డబ్బంతా పొదుపు, పెట్టుబడిలో జమచేస్తే వేలాది కుటుంబాల్లో ఎంతో వెలుగు. విలువైన ఆరోగ్యం మన సొంతం... ఆలోచించండి..

Updated : 07 Jun 2023 05:19 IST

న్యూస్‌టుడే-అచ్చంపేట, నారాయణపేట

ఉమ్మడి జిల్లాలో సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల వ్యాపారం : రూ.217 కోట్లు(నెలకు).. ఈ డబ్బంతా పొదుపు, పెట్టుబడిలో జమచేస్తే వేలాది కుటుంబాల్లో ఎంతో వెలుగు. విలువైన ఆరోగ్యం మన సొంతం... ఆలోచించండి..

* గ్లోబల్‌ అడల్ట్‌ టొబాకో సర్వే (జీఏటీఎస్‌) ప్రకారం 2016-17లో రాష్ట్రంలో 25.9 శాతం మంది పురుషులు, 9.8 శాతం మంది మహిళలు పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తున్నట్లు తేలింది. ఆ తరువాత 2019-20లో నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌) ప్రకారం పురుషులు 22.3 శాతం, మహిళలు 5.6 శాతం పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తున్నట్లు గుర్తించింది.

* ఉమ్మడి పాలమూరు జిల్లా జనాభా 35.17 లక్షలు కాగా వారిలో పురుషులు 17.78 లక్షలు, మహిళలు 17.39 లక్షల మంది ఉన్నారు. పురుషుల్లో సుమారు 3,96,390 మంది, మహిళల్లో 97,429 మంది పొగాకు ఉత్పత్తులు వాడుతున్నారు. పురుషుల్లో పది శాతం మంది 39,639 మంది ఛైన్‌స్మోకర్లు ఉన్నట్లు అంచనా. సాధారణ స్మోకర్లు 3,56,751 మంది వరకు ఉంటారని అంచనా. సుమారు 97,429 మంది మహిళలు పొగ తాగుతున్నారు.

అమ్మకానికి దుకాణంలో ఉంచిన సిగరెట్‌ డబ్బాలు

తెలుసుకోండి...

అసంక్రమిత వ్యాధుల నివారణ విభాగం ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో పొగ మాన్పించడానికి కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి జిల్లాకు ప్రోగ్రాం అధికారి ఉంటారు. వీరిని సంప్రదించవచ్చు. ప్రధాన  ప్రభుత్వ ఆస్పత్రులు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో వ్యసన విముక్తి కేంద్రాలు ఉన్నాయి. గట్టి సంకల్పంతో పొగ మానితే జీవితాలు బాగుపడతాయి.

మెల్లమెల్లగా ప్రభావం

పొగ తాగడం వల్ల ప్రభావం ఒకేసారి కాకుండా మెల్లిమెల్లిగా చూపుతుంది. దంతాల ఎనామిల్‌ దెబ్బతింటుంది. ముక్కులో ఉండే నరాలు కూడా దెబ్బతింటాయి. ఊపిరితిత్తుల వ్యాధులు వస్తాయి. ఊపరితిత్తుల్లో ఉండే వెంట్రుకవాసి నిర్మాణాలు నాశనమవుతాయి. ఇవి క్షీణించడం వల్ల ఊపరితిత్తుల పనితీరు దెబ్బతిటుంది. విషపూరితమైన కార్బన్‌  మోనాక్సైడ్‌ రక్తంలోకి చేరి అవయవాలను దెబ్బతీస్తుంది. సిగరెట్ తాగిన కొన్ని సెకండ్లలోనే నికోటిన్‌ మెదడును చేరుతుంది. డీఎన్‌ఏలో మార్పులు జరిగి క్యాన్సర్‌లు వచ్చే అవకాశం ఉంటుంది. అందరికీ ఒకే రకరమైన ఛాతి సమస్యలు వస్తాయి.

డా.తారాసింగ్‌, డా.సౌభాగ్యలక్ష్మి,  అచ్చంపేట, నారాయణపేట


చిన్నప్పటి అలవాటుతో ఇబ్బంది పడ్డాను

వ్యవసాయ పనులు చేస్తున్నప్పుడు చిన్న వయసులోనే ధూమపానం అలవాటైంది. దాదాపు 20 ఏళ్లుగా సిగెరెట్లు కాల్చడంతో ఆరోగ్యం బాగా దెబ్బతింది. పదేళ్ల క్రితం డాక్టర్‌ దగ్గరకు వెళ్తే  ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నాయన్నారు అతికష్టం మీద మానేశాను. ఆరోగ్యం కాస్త కుదుటపడింది.సిగరెట్లు కాల్చడం వల్ల డబ్బు, ఆరోగ్యం కోల్పోతామన్నది యువత గ్రహించాలి.

మల్‌రెడ్డిగౌడ, హిందూపూర్‌


మానేశాక మార్పు గమనించారు

కొత్తలో ఏదో సరదా కోసం కాల్చడం మొదలెడితే  అది కాస్త అలవాటుగా మారిపోయింది.దృఢంగా ఉండే నేను బలహీనపడుతున్నట్లు గ్రహించాను. ఇలాగే కాలుస్తూ పోతే ఊపిరితిత్తులు పోతాయని డాక్టర్లు చెప్పారు  ఏడాది క్రితం మానేశాక .ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉన్నాను. నన్ను చూసిన తెలిసిన వాళ్లు, బంధువులు ఏదో మార్పు వచ్చింది అంటుంటే ఆనందంగా ఉంది.

గోపిచంద్‌, నారాయణపేట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని