logo

బయట తిండితో జాగ్రత్త!

ఏ పని చేసినా జానెడు పొట్టకోసమే అంటుంటాం. ఆకలి తీర్చుకోవడానికైనా.. జీవించడానికైనా.. జిహ్వ చాపల్యం తీర్చుకోవడానికైనా ఆహారం తీసుకుంటాం.

Updated : 07 Jun 2023 04:10 IST

కరుచే కాదు.. శుచి, నాణ్యతా ముఖ్యమే
న్యూస్‌టుడే, పాలమూరు

ఏ పని చేసినా జానెడు పొట్టకోసమే అంటుంటాం. ఆకలి తీర్చుకోవడానికైనా.. జీవించడానికైనా.. జిహ్వ చాపల్యం తీర్చుకోవడానికైనా ఆహారం తీసుకుంటాం. అలాగని ఏది పడితే తింటే మొదటికే మోసం అవుతుంది.. అనేక వ్యాధుల బారినపడి ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ప్రస్తుతం ఉరుకులు, పరుగుల జీవనంలో చాలామంది హోటళ్లల్లోనే టిఫిన్లు తింటున్నారు. దూర ప్రాంతాలకు వెళ్తూ ఉద్యోగాలు చేసేవాళ్లకు హోటల్‌ భోజనాలు తప్పటం లేదు. కొందరు వారాంతాల్లో ప్రత్యేక వంటలు తినేందుకు కుటుంబంతో సహా హోటళ్లకు వెళ్తున్నారు. ఇక విద్యార్థులు, యువతీ యువకులు ఎక్కువగా బేకరీ ఆహార పదార్థాలు తింటున్నారు. చాలా వరకు బయటి తిండి నాసిరకం పదార్థాలతోనే తయారవుతోంది. ఏమీ ఆలోచించకుండా బయట తిండే తినుకుంటూ వెళ్తే ఆరోగ్య ప్రమాదంలో పడిపోయే పరిస్థితి వస్తుంది. ‘ప్రపంచ సురక్షిత ఆహార దినోత్సవం’ నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ కథనం.

తినుబండారాలపై మక్కువ

మిఠాయిలు, చిరుతిండ్లపై ప్రజలు మక్కువ చూపిస్తారు. కొనుగోలు చేసేటప్పుడు తాజావేనా.. ఎక్కువ రోజులు నిల్వ చేసినవా.. ఈగలు, దోమలు వాలుతున్నాయా.. దుమ్ము పడుతోందా? అనేది కూడా పట్టించుకోవటం లేదు. కొనుగోలు చేసి తీనేస్తున్నారు. కొందరు తీసుకొచ్చి చాలా రోజులు ఫ్రిజ్‌లో దాచుకుంటూ తింటున్నారు. ఇది చేయటం వల్ల ఫంగస్‌ వచ్చే అవకాశం ఉంటుంది. మిఠాయిలు, చిరుతండ్లు ఎక్కువగా అమ్ముడయ్యే, నాణ్యత పాటించే దుకాణాల్లోనే కొనుగోలు చేయాలి.

హోటళ్లలో నిల్వ  మాంసం

హోటళ్లల్లో అమ్ముడుపోని ఆహారాన్ని, చేపలు, చికెన్‌, మటన్‌, కూరలను చాలా రోజుల పాటు ఫ్రిజ్‌లలో నిల్వ చేస్తున్నారు. ఇలాంటి ఆహారంపై ఫంగస్‌, బ్యాక్టీరియా ఏర్పడుతాయి. నిల్వ పదార్థంగా గుర్తించనివిధంగా మసాలాలు వాడుతున్నారు. వీటిని తిన్నవారు అనారోగ్యం బారినపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఆహార తనిఖీ అధికారుల కొరత ఉండటం, పురపాలికలు తనిఖీలు చేపట్టకపోవటంతో హోటళ్లలో ఆహారం నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. హోటళ్లలో మాంసాహార భోజనం చేసేవాళ్లు జాగ్రత్త తీసుకోవాలి.

గప్‌చిప్స్‌తో ప్రమాదం.. : ఎక్కువ మంది ఆహార ప్రియులకు గప్‌చిప్‌, పానీపూరీ, కట్‌లెట్‌ వంటివి ఇష్టం. విక్రయదారుల్లో చాలామంది నాణ్యత, పరిశుభ్రత పాటించటం లేదు. శుద్ధజలం వాడటం లేదు. రుచి కోసం కలిపే పదార్థాలు అనారోగ్యాన్ని దెబ్బతిస్తున్నాయి. అయినా పట్టణాల్లో ఎగబడి తింటున్నారు. ఇలాంటి చోట్ల గప్‌చిప్‌లు వంటివి తినటం వల్ల లివర్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. జీర్ణకోశ వ్యాధులు వస్తున్నాయి. పచ్చకామెర్లకు కూడా కారణమవుతున్నాయి. పిల్లలు వాంతులు, విరోచనాలతో పాటు టైఫాయిడ్‌ జ్వరం బారినపడే ప్రమాదముంది.

బేకరీ పదార్థాలపై దృష్టేదీ? : బ్రెడ్‌, కేకులు, బన్నులు, ఫిజ్జా, బర్గర్‌, చికెన్‌ రోల్స్‌ వంటి బేకరీ ఆహార పదార్థాలు తెప్పించుకుంటున్నారు. చాలా ఉత్పత్తులపై కాలపరిమితి తేదీలు ఉండటం లేదు. చాలామంది తేదీలను చూడకుండానే కొనుగోలు చేస్తున్నారు. గడువు తీరిన ఉత్పత్తులు తింటే వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యంగా వివాహాల క్యాటరింగ్‌ గుత్తేదారులు ఎవరికీ తెలియని పేర్లతో ఉండే నాణ్యత లేని ఐస్‌క్రీమ్‌లు సరఫరా చేస్తున్నారు. వాటిని తింటే ఇబ్బందులు పడక తప్పదు.

ఇంట్లో ఆహారమే ఉత్తమం.. : ఇంట్లో వండుకున్న ఆహార పదార్థాలే అన్నింటి కన్నా ఉత్తమం. హోటళ్లు, బేకరీల్లో నాణ్యత, శుభ్రత పాటించటం లేదు. ఎక్కువగా బయడి తిండి తినటం వల్ల అనేక వ్యాధులను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. ముఖ్యంగా టిఫిన్‌ సెంటర్లలో కాగిన నూనెను మళ్లీ మళ్లీ వాడుతూ వడలు, పూరీలు, బోండాలు, బజ్జీలు తయారు చేస్తారు. వీటిని క్రమం తప్పకుండా తింటే క్యాన్సర్‌ వచ్చే ప్రమాదముంది. ఇంట్లోనే టిఫిన్లను ఎక్కువ పోషకాలు, రుచిగా ఉండేలా భిన్నంగా చేసుకోవచ్చు. ఇడ్లీలను క్యారెట్‌ కలిపి తయారు చేసుకోవచ్చు. కూరగాయలు వేసుకొని ఉప్మా చేసుకోవచ్చు. కుటుంబ ఆరోగ్యం కోసం ఇంటి భోజనానికే ప్రాధాన్యం ఇవ్వాలి.

శైలజ, ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి పోషకాహార నిపుణురాలు, మహబూబ్‌నగర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని