logo

ఎన్నాళ్లీ దారిద్య్రం?

అసంపూర్తిగా వదిలేసిన రోడ్లతో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గర్భిణులు, బాలింతలు, వృద్దులు పడే వేదన వర్ణణాతీతం బీటీ నిర్మాణాలకు అయిదేళ్ల క్రితం నిధులు మంజూరు కావడంతో సంబరపడ్డ ప్రజలకు నిరాశే మిగిలింది.

Published : 07 Jun 2023 04:03 IST

ధన్వాడ నుంచి పాతపల్లికి వెళ్లే రహదారి

ధన్వాడ, న్యూస్‌టుడే : అసంపూర్తిగా వదిలేసిన రోడ్లతో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గర్భిణులు, బాలింతలు, వృద్దులు పడే వేదన వర్ణణాతీతం బీటీ నిర్మాణాలకు అయిదేళ్ల క్రితం నిధులు మంజూరు కావడంతో సంబరపడ్డ ప్రజలకు నిరాశే మిగిలింది. అధికారులు పట్టించుకోకపోవడం వినియోగదారులకు ఆందోళన కలిగిస్తోంది.

* ధన్వాడ నుంచి పాతపల్లి గ్రామానికి వెళ్లే రహదారి అడుగడునా గుంతలు పడింది. పదే పదే విన్నవించగా ఏడాది కిందట మరమ్మతులతో కూడిన తారు నిర్మాణానికి రూ. 65 లక్షలు మంజూరయ్యాయి. ఇంతవరకు గుత్తేదారు ఎంపిక కార్యక్రమం పూర్తి కాలేదు. పలుమార్లు గుత్తేదారు నియామకానికి టెండర్‌ ఆహ్వనించినా పాల్గొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.  అధికారులే పనులు చేపట్టి పూర్తి చేయాలని గ్రామస్థులు కోరుతున్నా స్పందన లేదు. చదువకోడానికి నిత్యం వందల మంది పిల్లలు బిజ్వార్‌, కొత్తపల్లి, పాతపల్లి నుంచి ఈ రహదారి మీదుగానే రావాల్సి ఉంది. వర్షాకాలంలో కాలినడకన రావడమూ కష్టమేనన్న అభిప్రాయాన్ని విద్యార్థులతో పాటు ఆయా గ్రామస్థులు వ్యక్తం చేస్తున్నారు

* హన్మన్‌పల్లి నుంచి ఏడు కిలోమీటర్ల దూరాన ఉన్న ఆకుమర్రిండాకు 2018లో ప్రభుత్వం రూ. 2.19 కోట్ల నిధులతో తారురోడ్డును మంజూరు చేసింది. అదే ఏడాది పనులు చేపట్టగా కంకర పనులు పూర్తి అయ్యేదాకా మిన్నకుండిన రైతులు ఆ తర్వాత పొలాల గుండా రోడ్డు వేస్తున్నారంటూ అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా కోర్టుకు వెళ్లారు. దీంతో అర్ధాంతరంగా పనులు నిలిచాయి. గ్రామ పెద్దలు జోక్యం చేసుకొని కోర్టుకెళ్లిన రైతులతో మాట్లాడి పిటిషన్‌ను వాపసు తీసుకునేలా కృషి చేశారు. ఆ తర్వాత మిగతా పనులు చేపట్టేందుకు గుత్తేదారు ఎంతకూ ముందుకు రాలేదు. దీంతో టెండర్‌ను రద్దు పర్చిన అధికారులు కొత్త గుత్తేదారుతో పనులు చేయిస్తామని కాలం గడుపుతున్నారు.

* కిష్టాపూర్‌ నుంచి గోటూర్‌ గ్రామానికి రోడ్డును బీటీగా మార్చేందుకు 2018లో పంచాయతీరాజ్‌ శాఖ రూ.1.83 కోట్ల నిధులను కేటాయించింది. అదే ఏడాది పనుల్ని చేపట్టిన గుత్తేదారు మొదట్లో కొంతమేర రోడ్డు వెడల్పు చేశారు. కొంత కాలం తర్వాత మిగతా రోడ్డు వెడల్పు పనులు చేపట్టారు. కల్వర్టులు నిర్మించారు. కొన్ని నెలల కిందట కంకర పనులు మొదలెట్టారు. కంకర లభ్యం కావడంలేదంటూ అసంపూర్తిగా వదిలేశాడు. ప్రస్తుతం ఈ దారి మీదుగా వెళ్లాలంటే నరకం అనుభవించాల్సిందేనన్న భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది.

* కిష్టాపూర్‌ నుంచి ముడుగుల మల్లయ్య తండా వరకు ఉన్న పదకొండు కిలోమీటర్ల రహదారిని తారుగా మార్చేందుకు పంచాయతీరాజ్‌ శాఖ 2018 ఏడాదిలో రూ. 4.60 కోట్ల నిధులను కేటాయించింది. అదే ఏడాది పనులకు శంకుస్థాపన నిర్వహించగా, గుత్తేదారు రోడ్డు వెడల్పు, కల్వర్టుల నిర్మాణ పనులను అసంపూర్తిగా వదిలేసి పత్తాలేకుండా పోయారు. పలుమార్లు నోటీసులు అందజేసినా స్పందన లేదు. ఏడాది దాటినా కొత్త గుత్తేదారు నియామక ప్రక్రియను పూర్తి చేయలేదు. పనులు అసంపూర్తిగా వదిలేయడంతో పనులు చేపట్టక ముందే రహదారి బాగుండేదన్న అభిప్రాయం పలు తండావాసులు వ్యక్తం చేస్తున్నారు. రాబోయే వర్షాకాలంలో రాకపోకలకు మరింత ఇబ్బందిగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ముడుగుల మల్లయ్య తండాకు వెళ్లే దారి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని