logo

దారి మళ్లిన బస్సు.. తప్పని తిప్పలు

ఆదాయం కోసం తాపత్రయపడే ఆర్టీసీ కొన్ని రూట్లను వదిలేసి నష్టపోతోంది. ప్రైవేటు బస్సులు నడిచే రూట్లలో గతంలో మట్టి దారులే ఉండేవి. రోజూ ప్రైవేటు బస్సులు టాప్‌ సర్వీస్‌తో నడిచేవి.

Published : 07 Jun 2023 04:03 IST

న్యూస్‌టుడే, గోపాలపేట

ఆదాయం కోసం తాపత్రయపడే ఆర్టీసీ కొన్ని రూట్లను వదిలేసి నష్టపోతోంది. ప్రైవేటు బస్సులు నడిచే రూట్లలో గతంలో మట్టి దారులే ఉండేవి. రోజూ ప్రైవేటు బస్సులు టాప్‌ సర్వీస్‌తో నడిచేవి. ఇప్పుడు అలాంటి రూట్లను వదిలేసిన ఆర్టీసీ ఆదాయాన్ని కోల్పోతోంది. వనపర్తి నుంచి గోపాల్‌పేట, పొలికెపాడు, తూడుకుర్తి, తల్పునూరు, రేవల్లి, నాగపూరు, బండరావిపాకుల, తీగలపల్లి మీదుగా ప్రైవేటు బస్సు పెద్దకొత్తపల్లి వరకు నడిచేది. ఎన్నో గ్రామాలను కలుపుతూ వెళ్లే ఈ రహదారిపై ఆర్టీసీ బస్సులను నడిపితే లాభాలు వస్తాయని గతంలో ‘ఈనాడు’లో వార్త ప్రచురితమైంది. స్పందించిన ఆర్టీసీ ఆ రూట్లలో బస్సులను నడిపింది. ప్రజలకు సౌకర్యంగా ఉండడంతోపాటు ఆర్టీసీకి లాభాలూ వచ్చాయి. కాలక్రమేణా రోడ్డు బాగా లేదనే సాకుతో నిలిపేశారు. దీంతో ఆ దారుల్లో ఆటోలే ఎక్కువగా తిరుగుతున్నాయి. బస్సులు తిరగని కారణంగా విద్యార్థులు, వ్యాపారులు, ఉద్యోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పాసులు తీసుకున్నా బస్సులు తిరగని కారణంగా డబ్బులు వృథా అని విద్యార్థులు వాపోతున్నారు.

విద్యార్థులకు కాలి నడకే..

ఆర్టీసీ బస్సులు తిరగని కారణంగా గోపాల్‌పేట, వనపర్తి, నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్‌కు వెళ్లి చదువుకునే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల నుంచి మొదట గోపాల్‌పేటకు కాలినడకన, ఆటోల్లో వస్తున్నారు. ఇక్కణ్నుంచి బస్సుల్లో వెళుతున్నారు. మండల పరిధిలోని పొలికెపాడు, చాకల్‌పల్లి, చెన్నూరు, మున్ననూరు, జయన్నతిరుమలాపురానికి బస్సులు తిరగడం లేదు. వీరంతా వీలునుబట్టి కాలినడకన లేదంటే ఆటోల్లో కళాశాలలు, పాఠశాలలకు వెళుతున్నారు. పది, ఇంటర్‌ పరీక్షల సమయంలో విద్యార్థులు రోజూ 5- 8 కి.మీ. దూరం కాలినడకన ప్రయాణించారు. అలిసిపోయిన విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తారని అధికారులు ఆలోచించడం లేదు.

* ఇటీవల గోపాల్‌పేటకు వచ్చిన నాగర్‌కర్నూలు డీఎం ధరమ్‌సింగ్‌ దృష్టికి ‘న్యూస్‌టుడే’ ఈ రూటు విషయాన్ని తీసుకెళ్లగా.. ఆయన సమాధానం దాటవేసి మాట్లాడారు. విద్యార్థులు బస్‌పాసులు తీసుకుంటే ఆయా గ్రామాలకు బస్సులను నడిపేందుకు ఆలోచిస్తామన్నారు. ఆర్టీసీకి ఆదాయాన్ని తెచ్చిపెట్టే రూట్లను గాలికి వదిలేసి ప్రధాన రోడ్లపై మాత్రమే 10, 15, 20 నిమిషాల కొకటి చొప్పున నడుపుతున్నారు. గతంలో ఆర్టీసీ బస్సులు తిరిగిన రూట్లను గుర్తించి మళ్లీ బస్సులను నడిపేందుకు అధికారులు కృషి చేయాల్సిన అవసరముంది. దీంతో ప్రజలకు సౌకర్యంతోపాటు ఆర్టీసీకి ఆదాయమూ సమకూరుతుంది.

చెన్నూరు నుంచి గోపాల్‌పేటలో పరీక్షలు రాయడానికి కాలినడకన వెళుతున్న విద్యార్థులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని