logo

మురుగు కాల్వల నిర్మాణంలో నాణ్యతాలోపం

పట్టణంలో రూ.కోట్లు వెచ్చించి చేపట్టిన మురుగు కాల్వల నిర్మాణాల్లో నాణ్యత లోపిస్తోంది. ఓ వైపు నిర్మిస్తుండగా మరో వైపు అవి కూలిపోతున్నాయి.

Published : 09 Jun 2023 03:53 IST

విరిగిపడుతున్న పలకలు
అక్కడక్కడా పగుళ్లు

నాణ్యతాలోపం.. దిగబడిన వాహనం

పెబ్బేరు, న్యూస్‌టుడే: పట్టణంలో రూ.కోట్లు వెచ్చించి చేపట్టిన మురుగు కాల్వల నిర్మాణాల్లో నాణ్యత లోపిస్తోంది. ఓ వైపు నిర్మిస్తుండగా మరో వైపు అవి కూలిపోతున్నాయి. ప్రధాన రహదారుల నుంచి కాలనీలకు తిరిగే రోడ్ల వద్ద కాల్వలపై వేసిన పలకలు చిన్న వాహనాలు వెళ్లినా కూలిపడుతున్నాయంటే నాణ్యత ఏమాత్రమో అర్థం చేసుకోవచ్చు. పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో నిర్మాణ పనులు చేసే గుత్తేదారు ఆడిందే ఆట.. పాడిందే పాటగా తయారైందంటూ పట్టణ ప్రజలు వాపోతున్నారు. పనుల తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యతా అధికారులు తనిఖీ చేసి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

నిర్మాణాలకు నిధులు ఇలా..: పట్టణంలో రోడ్డు విస్తరణలో భాగంగా ప్రధాన రహదారికి ఇరువైపులా మురుగు కాల్వల నిర్మాణ పనులు చేపట్టారు. పోచమ్మ గుడి నుంచి పీజీపీ కార్యాలయం దాటి చౌడేశ్వరి ఆలయం వరకు డివైడర్‌కు ఇరువైపులా 2.3 కిలోమీటర్లు బీటీతో విస్తరణ, ఇరువైపులా మురుగు కాల్వలు నిర్మించడానికి తెలంగాణ అర్బన్‌ ఫైనాన్స్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టీయుఎఫ్‌ఐడీసీ) నుంచి రూ.11 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.7 కోట్లతో రోడ్డు విస్తరణలో భాగంగా ఒక్కో వైపు 8 మీటర్ల చొప్పున రెండు వైపులా 16 మీటర్లు విస్తరణతో బీటీ నిర్మించాలి. మరో రూ.4 కోట్లతో ఇదే రోడ్డుకు ఇరువైపులా 2.3 కిలోమీటర్ల దూరం పెద్ద మురుగు కాల్వలు నిర్మించాలి. పనులు కొన్ని నెలలుగా సాగుతున్నాయి. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో అక్కడక్కడా పగుళ్లు వస్తున్నాయి. ఉన్నతస్థాయి అధికారులు స్పందించి తనిఖీలు చేయాలని పట్టణవాసులు కోరుతున్నారు.

చర్యలు తీసుకుంటున్నాం: పనులు నాణ్యంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. నాణ్యతా అధికారులు తనిఖీలు చేసిన తర్వాతనే గుత్తేదారుకు బిల్లుల చెల్లింపులు జరుగుతాయి.

రమేష్‌ నాయుడు, పురపాలిక ఏఈ, పెబ్బేరు

నీటిని తోడకుండానే సిమెంటు వేస్తున్న వైనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని