logo

బడి తెరిచే రోజే పాఠ్యపుస్తకాలు

సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థులకు తొలి రోజు పాఠ్య పుస్తకాలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.  ఏప్రిల్‌ నుంచి పాఠ్య పుస్తకాల పంపడం మొదలెట్టింది.

Published : 09 Jun 2023 03:53 IST

న్యూస్‌టుడే, నారాయణపేట పట్టణం : సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థులకు తొలి రోజు పాఠ్య పుస్తకాలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.  ఏప్రిల్‌ నుంచి పాఠ్య పుస్తకాల పంపడం మొదలెట్టింది.

ఇప్పటి వరకు 73 శాతం పుస్తకాలను జిల్లాకు సరఫరా చేయగా గోదాంలో భద్రపరిచారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రారంభించడంతో రెండు విడతలుగా పంపిణీ చేస్తున్నారు. పుస్తకాల ముద్రణలో ఆలస్యం కావడంతో గత ఏడాది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. 2023-24 విద్యా సంవత్సరంలో సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు విద్యాశాఖ అధికారులు ముందస్తుగా పంపిణీ చేయాలని ప్రణాళిక సిద్ధం చేశారు.  మండలాలకు పుస్తకాలను తరలించడానికి జిల్లా విద్యాశాఖ అధికారుల ఏర్పాట్లు చేస్తున్నారు.

ఫలితాలపై ప్రభావం పడకుండా...

గతంలో  పాఠశాలలకు సకాలంలో పుస్తకాలు రాకపోవడంతో ఉత్తీర్ణత శాతంపై ప్రభావం పడేది. ఈ సమస్యను అధిగమించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఏడాది ఆంగ్లమాధ్యమం పుస్తకాలు ఆక్టోబరు, నవంబరు వరకు సరఫరా అవుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి రాకుడదని 2023 - 24 విద్యా సంవత్సరానికి విడతలవారీగా ఆర్టీసీ కార్గో ద్వారా తరలిస్తున్నారు.  పక్కదారి పట్టకుండా వాటి వివరాలను నమోదు చేసుకుని, గోదాంలో భద్రపరిచారు.

ఆంగ్లమాధ్యమం పుస్తకాల్లో ఒక వైపు తెలుగు, మరోవైపు ఆంగ్లంలో పాఠ్యాంశాలను ముద్రిస్తున్నారు.  ఉచిత పుస్తకాలు పక్కదారి పట్టకుండా క్యూఆర్‌ కోడ్‌ ఉంటుంది. ఈసారి అన్నీ వరుస సంఖ్యను ముద్రించారు. ఎన్ని చర్యలు చేపట్టినా ప్రభుత్వం అందించే పాఠ్యపుస్తకాలు ప్రైవేటు పాఠశాలల్లో దర్శనం ఇస్తుంటాయి.  బహిరంగ మార్కెట్‌లో ధరలు రూ. వందల్లో ఉండటంతో తెలిసినవారి ద్వారా బయటి విద్యార్థులు పొందుతున్నారు.  ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ కొత్త విధానం ఏ మేరకు సత్ఫలితాలు ఇస్తుందో చూడాలి.

నారాయణపేటకు పుస్తకాలు తీసుకువచ్చిన ఆర్టీసీ కార్గో వాహనం


జిల్లాలో మొత్తం  పాఠశాలలు  514

మొత్తం విద్యార్థుల సంఖ్య  72,493

అవసరమైన పాఠ్యపుస్తకాలు  3,96,459

వచ్చినవి 2,90,559

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని