logo

చేపల విందు... భలే పసందు

మాంసాహార ప్రియులు చికెన్‌, మటన్‌ తిని బోరు అనిపించిన సమయంలో వారి దృష్టి చేపల మీదకు వెళ్తుంది.  చేపలతో పులుసు, కూర, వేపుడు, ప్రాన్స్‌ బిర్యాని, చేప పకోడి, ఫిష్‌ కట్లెట్‌, ఫింగర్‌, అపోలో ఫిష్‌ వేపుడు,

Published : 09 Jun 2023 03:53 IST

చేపల వంటకాల ప్రదర్శనలో వేపుడు చేస్తున్న మహిళ

న్యూస్‌టుడే- నారాయణపేట పట్టణం : మాంసాహార ప్రియులు చికెన్‌, మటన్‌ తిని బోరు అనిపించిన సమయంలో వారి దృష్టి చేపల మీదకు వెళ్తుంది.  చేపలతో పులుసు, కూర, వేపుడు, ప్రాన్స్‌ బిర్యాని, చేప పకోడి, ఫిష్‌ కట్లెట్‌, ఫింగర్‌, అపోలో ఫిష్‌ వేపుడు, పచ్చడి సహా పలు వంటకాలు చేసుకోవచ్చు.  చదువుతుంటేనే నోరు ఉరుతుంది కదూ... ఒక్కసారి రుచి చూస్తే  మళ్లీ  తినాలనిపిస్తుంది. రాష్ట్ర అవరతణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలోని గ్రామాల్లో ఊరూరా చెరువుల పండగ ఘనంగా జరుపుకుంటున్నారు. అదే సమయంలో జిల్లా కేంద్రాల్లో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఆహారపండగను గురువారం మొదలుపెట్టారు.  శుక్ర, శనివారాల్లో ఇది కొనసాగనుంది.  ప్రజలకు చేపలతో చేసిన వివిధ వంటకాలను పరిచయం చేయనున్నారు.  

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో జూరాల, సంగంబండ, భీమా ప్రాజెక్టులతోపాటు చెరువులలో ఏటా చేప పిల్లలను ఉచితంగా వదులుతున్నారు.  అవి పెద్దయ్యాక మత్స్యకారులు పట్టుకుని విక్రయించుకుని లబ్ధిపొందుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చెరువులలో చేప పిల్లలను వదిలి మత్స్యకార కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటోంది. మార్కెటింగ్‌ చేయడానికి వాహనాలను సైతం అందించింది. రాయితీ పథకాలు అమలు చేస్తోంది. చెరువులు, జలాశయాలలో చేపలను వివిధ ప్రాంతాలకు తరలించి విక్రంచుకుని ఆర్థికంగా లబ్ధిపొందుతున్నారు.  

ఆహార పండగ

మార్కెట్‌లో మాంసం ధరలు పెరగడంతో ఆరోగ్యానికి మేలు చేసే చేపల ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని భావించారు.  స్థానిక మార్కెట్‌లో డిమాండ్‌ పెరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. మత్స్యకారులకు లబ్ధి చేకూరే విధంగా ఫిష్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తే స్థానిక ప్రజలకు చేపల వంటకాలపై ఆసక్తి పెరుగుతుందనేది ప్రభుత్వ యోచన. వంటకాలలో అనుభవం కలిగిన మహిళలు, పురుషులతో దుఖాణాలు ఏర్పాటు చేశారు.

ఆరోగ్యానికి మేలు

చేపలు మంచి పోషకాహారం. వీటిని ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి ఎంతో మేలు. చేపలతో అనేక రాకల వంటకాలు చేసే అవకాశం ఉంటుంది. ఫిష్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌తో మత్స్యకార కుటుంబాలకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం అమలు చేస్తోంది.  

రాణాప్రతాప్‌, మత్స్యశాఖ అధికారి, నారాయణపేట.

నారాయణపేటలో సిద్ధం చేసిన చేపల వంటకాలు 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని