logo

విద్యాలయాలు సరే.. గురువులేరీ?

ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. విద్యాలయాలు బాగుపడి.. పిల్లల ఎన్‌రోల్‌మెంట్‌ గణనీయంగా పెరుగుతున్నా..

Published : 09 Jun 2023 04:04 IST

ఖాళీలు భర్తీ కాక.. విద్యా వాలంటీర్లు లేక.. 
ప్రభుత్వ పాఠశాలల్లో గాడి తప్పుతున్న బోధన

గద్వాల ప్రభుత్వ బాలుర పాఠశాలలో విద్యార్థులు సంఖ్య ఇలా (పాతచిత్రం)

గద్వాల న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. విద్యాలయాలు బాగుపడి.. పిల్లల ఎన్‌రోల్‌మెంట్‌ గణనీయంగా పెరుగుతున్నా.. పాఠాలు బోధించేవారులేక లక్ష్యం గాడి తప్పుతోంది. ఉమ్మడి జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత నెలకొంది. విద్యాశాఖ నిబంధనల మేరకు ఆయా పాఠశాలల్లో సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులు ఉండాలి. డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఈసారి కూడా చర్యలు చేపట్టలేదు. గతంలో పాఠశాలల్లో ఈ లోటు కనిపించకుండా విద్యావలంటీర్లతో  నెట్టుకొచ్చేది. కాని ఈసారి దానికి కూడా ప్రభుత్వం ఉద్వాసన పలకడంతో సర్కారు బడుల్లో బోధన అంతంత మాత్రంగానే సాగుతోంది.  ప్రభుత్వం విద్యాభివృద్ధి, అక్షరాస్యత పెంపు కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 3,177 పాఠశాలలుండగా 13,485 మంది ఉపాధ్యాయులున్నారు. 1,968 పోస్టులు ఖాళీలున్నాయి.

ఆ జిల్లాల్లోనే అధికంగా..: అక్షరాస్యత, ఉత్తీర్ణతా శాతంలో వెనకబాటులో ఉన్న జిల్లాల్లోనే ఖాళీల సంఖ్య ఎక్కవగా ఉంది. జోగులాంబ గద్వాల జిల్లాలో 317 వరకు ఖాళీలున్నాయి. ధరూరు మండలం ఆల్వాల్‌పాడు ఉన్నత పాఠశాలలో 280 వరకు విద్యార్థులుండగా ఇద్దరే ఉపాధ్యాయులున్నారు. ఎస్‌జీటీలను అదనంగా డిప్యూటేషన్‌పై ఏర్పాటు చేసి పాఠాలు బోధిస్తున్నారు. ధరూరు ఉన్నత పాఠశాలలో 1,150 మంది విద్యార్థులుండగా 21 మంది ఉపాధ్యాయులున్నారు. అక్షరాస్యతలో వెనకబడిన గట్టు మండలం హిందువాసి ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేరు. ప్రతి 35 మంది విద్యార్థులకు ఒక బోధకుడు ఉండాలి. కొన్ని ఉన్నత పాఠశాలల్లో 50మంది విద్యార్థులకు ఒక బోధకుడు ఉంటున్నారు. ఉమ్మడి జిల్లాలోని చాలా పాఠశాలల్లో ఈ పరిస్థితి నెలకొంది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో బడిబాట ఇప్పటికే మొదలైంది. కాని బడికొచ్చే పిల్లలకు పాఠాలు చెప్పే గురువుల ఖాళీ పోస్టుల భర్తీ కావడంలేదు. కనీసం విద్యావలంటీర్ల నియామకానికి ప్రభుత్వం అనుమతిచ్చినా కొంత వరకు విద్యాప్రమాణాలు మెరుగుపడే అవకాశం ఉంటుంది.

మౌలిక వసతుల కల్పనకు..

విద్యాలయాల్లో పూర్తి స్థాయి వసతులు కల్పించటం కోసం ‘మన ఊరు-మన బడి’తోపాటు అనేక విధాలుగా ప్రభుత్వం నిధులు వెచ్చిస్తోంది. సర్కారు పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం కూడా ప్రవేశ పెట్టింది. ఈసారి 3వ తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఆంగ్లం బోధన ఉంటుంది. అయితే పాఠాలు చెప్పే గురవులు లేని పరిస్థితి నెలకొంటోంది. ప్రాథమికలో ఎలా ఉన్నా ఉన్నత విద్యకు తొలిమెట్టులాంటి ఉన్నత పాఠశాలల్లోనే ఈ లోటు కనిపిస్తోంది. ప్రభుత్వం ఉపాధ్యాయ ఖాళీల భర్తీ ప్రక్రియ నానాటికీ ఆలస్యం చేసుకుంటూ వస్తోందనే విమర్శ ఉంది. ఎప్పుడు వరకు పూర్తవుతుందనే దానిపై ప్రభుత్వం, విద్యాశాఖ వద్ద స్పష్టత లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని