తొమ్మిదేళ్లలోనే అన్ని రంగాల్లో ప్రగతి
తొమ్మిదేళ్ల వ్యవధిలోనే జిల్లా అన్ని రంగాల్లో ప్రగతి సాధించామని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడల శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
సమైక్యతా దినోత్సవంలో మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్
కలెక్టరేట్‌లో జెండా ఆవిష్కరిస్తున్న మంత్రి చిత్రంలో కలెక్టర్, ఎస్పీ, నేతలు
మహబూబ్‌నగర్ కలెక్టరేట్, న్యూస్‌టుడే : తొమ్మిదేళ్ల వ్యవధిలోనే జిల్లా అన్ని రంగాల్లో ప్రగతి సాధించామని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడల శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కలెక్టరేట్‌లో వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధులను సత్కరించారు. అనంతరం పలు విద్యాసంస్థల చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉచిత విద్యుత్తు, ఇతర సంక్షేమ పథకాల వల్ల వ్యవసాయ రంగం ఎంతో మెరుగుపడిందని తెలిపారు. కరవును శాశ్వతంగా తొలగించేందుకు చేపట్టిన పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారని గుర్తుచేశారు. కర్వెన రిజర్వాయరుతో సాగునీటిని తీసుకువచ్చి జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. గతంలో 2.18 లక్షల ఎకరాలు ఉన్న సాగు 9ఏళ్లల్లో 3.50 లక్షలకు పెరిగిందన్నారు. రూ.330 కోట్లతో 441 పంచాయతీలను అభివృద్ధి చేశామన్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద జిల్లాలో 30,771 మందికి రూ.283 కోట్ల సాయం అందించామన్నారు. మిషన్ భగీరథ ద్వారా 906 గ్రామీణ ఆవాసాలకు తాగునీటిని అందిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో రూ. 279 కోట్లతో డబుల్ బెడ్రూమ్ 9,300 ఇళ్లు నిర్మించామన్నారు. జిల్లాలో గతంలో 79వేల పింఛన్లు ఉండేవని, తెలంగాణ వచ్చాక 1.04 లక్షల మందికి ఆసరా పింఛన్లు ఇస్తున్నామని చెప్పారు. దివిటిపల్లి ఐటీ టవర్‌లో 15వేల మందికి ప్రత్యక్షంగా, మరో 5వేల మందికి పరోక్షంగా ఉద్యోగాలు కల్పించామని వెల్లడించారు. భూత్పూరు - మహబూబ్‌నగర్ - చించోలి వరకు 60 కి.మీ.ల రహదారి పనులకు రూ.393 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. ఆరోగ్య సంరక్షణలో భాగంగా పాత కలెక్టరేట్ స్థానంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తున్నామన్నారు. మన ఊరు - మన బడి కింద జిల్లాలో 291 పాఠశాలలను ఎంపిక చేసి రూ.149 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని వివరించారు. జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానం ఆధునికీకరణ, ఎంవీఎస్ కళాశాలలో ఇండోర్ మైదానం, పోతులమడుగులో మినీ మైదానం పనులు చేపడుతున్నామన్నారు. ఉద్యోగ మేళా నిర్వహించి 2,388 మందికి ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. దళితబంధు, బీసీబంధు, మైనారిటీ బంధు, మహిళలకు రుణాలు అందిస్తున్నామని తెలిపారు. పురపాలికకు 9 ఏళ్లలో రూ.217 కోట్లు మంజూరు చేశామన్నారు. జడ్పీ ఛైర్‌పర్సన్ స్వర్ణ సుధాకర్, కలెక్టర్ జి.రవి నాయక్, ఎస్పీ కె.నరసింహ, ఎమ్మెల్యే వెంకటేశ్వర్‌రెడ్డి, జడ్పీ వైస్ ఛైర్మన్ యాదయ్య, రైతుబంధు సమితి అధ్యక్షుడు గోపాల్‌యాదవ్, పుర ఛైర్మన్ నర్సింహులు, అదనపు కలెక్టర్లు మోహన్‌రావు, యాదయ్య, ఏఎస్పీ రాములు, డీఆర్వో రవికుమార్, ఆర్డీవో అనిల్‌కుమార్, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.
ప్రసంగిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్, వేదికపై ఎస్పీ నరసింహ, కలెక్టర్ రవినాయక్, జడ్పీ ఛైర్‌పర్సన్ స్వర్ణ సుధాకర్..
మహబూబ్‌నగర్ విద్యార్థినుల ప్రదర్శన
జడ్చర్ల గిరిజన గురుకుల విద్యార్థినుల నృత్యం
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
బావిలో పైపులు.. బాధలకు తార్కాణాలు!
-
‘Bharat Dal’ brand: రాయితీపై శనగపప్పు.. ‘భారత్ దాల్’ కిలో రూ.60కే..
-
Art of Living: ‘ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు’.. ఆకట్టుకున్న నృత్య ప్రదర్శనలు
-
Congress: కళాశాల విద్యార్థులకు ఉచితంగా ఇంటర్నెట్!
-
Adilabad: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుల వాన