logo

అరకొర వర్షాలు.. అడుగంటిన జలాలు

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వర్షాలు నిరాశాజనకంగా కురవడంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి.

Updated : 18 Sep 2023 06:56 IST

ఆగస్టు నెలలో 75 శాతం లోటు వర్షపాతం
నాలుగు మండలాల్లో ప్రమాద ఘంటికలు

వనపర్తి : చిట్యాలలో బోరు నీటిని పరిశీలిస్తున్న భూగర్భ జలవనరుల అధికారి యుగేందర్‌

న్యూస్‌టుడే, పాలమూరు: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వర్షాలు నిరాశాజనకంగా కురవడంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. గతేడాది ఆగస్టులో అన్ని జిల్లాల్లో భూఉపరితలానికి అతి సమీపంలో ఉన్న భూగర్భ జలాలు, ఈసారి ఆగస్టులో కొంత లోపలికి వెళ్లిపోయాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఏడాది సాధారణ వర్షపాతం 643.2 మి.మీ.లు కాగా ఆగస్టులో 126.9 మి.మీ.ల వర్షం కురవాలి. కేవలం 29.5 మి.మీ.ల వర్షం కురిసింది. ఫలితంగా 76 శాతం లోటు వర్షపాతం నమోదైంది. జులై నెలలో వర్షాలు బాగానే కురిసినా ఆగస్టులో మాత్రం వర్షపాతం అంతగా నమోదు కాలేదు. సెప్టెంబరులో మొదటి వారంలో మోస్తరు వర్షాలు కురిశాయి. వర్షాలు వ్యవసాయానికి పనికి వచ్చేలా కురవడం లేదు. వర్షాలు విస్తారంగా కురిస్తేనే భూగర్భంలోకి నీరు ఇంకుతుంది. భూగర్భ జలమట్టం పెరుగుతుంది. లోటు వర్షపాతంతో వ్యవసాయ బోర్లలో నీటి లభ్యత తగ్గి రైతులు పంటలకు నీటి తడులు అందించేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. చాలా ప్రాంతాల్లోని చెరువులు, వాగులు, కుంటలు నీటి నిల్వ తగ్గిపోతోంది. ఈనెలలో వర్షాలు పెద్దగా కురవలేదు. జులైలో అనుకున్న దానికంటే ఎక్కువ వర్షం నమోదై భూగర్భ జలాలు పెరగకపోతే ఇప్పటికే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మరింత ఇబ్బందికర పరిస్థితి నెలకొనేది.

అన్ని జిల్లాల్లో ఒకే పరిస్థితి.. : ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఒకేరకమైన పరిస్థితి నెలకొంది. భూగర్భ జల వనరుల శాఖ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 175  ఫిజియోమీటర్‌ కేంద్రాలు ఏర్పాటు చేసింది. వాటి ద్వారా భూగర్భ జలాలు కొలుస్తోంది. నాలుగు మండలాల్లో 20 మీటర్ల కంటే లోతులోకి జలాలు పడిపోయాయి. ఆ ప్రాంతాల్లో ప్రమాద ఘంటికలు మోగనున్నాయి. భూగర్భ జలమట్టం 20 మీటర్ల కంటే ఎక్కువ లోతులోకి వెళ్తే అక్కడి బోర్లకు నీరందటం కష్టమని భూగర్భ జల వనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. అమ్రాబాద్‌ మండలంలో 23.91 మీటర్లు, పదరలో 22.83 మీటర్లు, ఉండవెల్లిలో 20.40 మీటర్లు, ఉప్పునుంతలలో 20.06 మీటర్ల లోతులో నీరు ఉంది. కేటీదొడ్డి మండలంలో 18.69 మీటర్లు, నవాబ్‌పేటలో 18.52 మీటర్లు, గండీడ్‌లో 18.17 మీటర్లు, కల్వకుర్తిలో 17.81 మీటర్లు, ధన్వాడలో 17.40 మీటర్లు, జడ్చర్లలో 17.04 మీటర్లు, హన్వాడలో 16.03 మీటర్ల లోతులో జలాలు ఉన్నాయి. వర్షాలు సరిగ్గా కురవకపోతే భూగర్భ జలాలు మరింతగా పడిపోయే ప్రమాదముంది.

ఈ నెలలో వానలు కురవకపోతే ఇబ్బందే : ఏటా సెప్టెంబర్‌లో ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఈసారి కూడా ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆశించిన మేరకు వర్షాలు కురవకపోతే ఇబ్బందులు తప్పవు. ఇప్పటికే ఖరీఫ్‌ కాలంలో ఆశించిన మేరకు వర్షాలు కురవలేదు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎక్కువ సాగు భూగర్భ జలాలపైనే ఆధారపడి ఉంది. బోర్లకు ఆశించిన మేరకు నీరు అందాలంటే వర్షాలు బాగా కురవాలి. భూగర్భ జలాలను వృథా చేయకుండా రైతులు పొదుపుగా వాడుకోవాలి.  

రాజేంద్రకుమార్‌, సహాయ సంచాలకుడు, మహబూబ్‌నగర్‌ భూగర్భ జల వనరుల శాఖ

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని