logo

అదే తీరు.. అధినేతలు వేరు

యాదృచ్ఛికమో.. కాకతాళీయమో.. కానీ.. ఉమ్మడి రాష్ట్రంలో సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (ఎంజీకేఎల్‌ఐ), తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఒకే నెలలో ఒకే తేదీన ఒక పంపుతో ప్రారంభించడం విశేషం.

Updated : 18 Sep 2023 06:55 IST

రేగుమాన్‌గడ్డ వేదికగా సెప్టెంబర్‌ 16నే ప్రారంభోత్సవాలు

2012లో కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రారంభించిన మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులోని ఎల్లూరు పంపుహౌస్‌ నుంచి నీళ్ల ఎత్తిపోత

కొల్లాపూర్‌, న్యూస్‌టుడే : యాదృచ్ఛికమో.. కాకతాళీయమో.. కానీ.. ఉమ్మడి రాష్ట్రంలో సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (ఎంజీకేఎల్‌ఐ), తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఒకే నెలలో ఒకే తేదీన ఒక పంపుతో ప్రారంభించడం విశేషం. సాగు, తాగునీటి ప్రాజెక్టులకు రేగుమాన్‌గడ్డ తీరంలోని నిల్వ ఉండే శ్రీశైలం తిరుగుజలాలే ఆధారమవడంతో 11 ఏళ్ల తర్వాత కరవు నేల పాలమూరు గడ్డపై కృష్ణమ్మ మళ్లీ పరుగులిడింది. 2012 సెప్టెంబర్‌ 16న ఎంజీకేఎల్‌ఐ పథకంలో ఉమ్మడి రాష్ట్ర సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఎల్లూరు పంపుహౌస్‌లో ఒక మోటారుతో నీటి ఎత్తిపోత ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో నార్లాపూర్‌ పంపుహౌస్‌లో 2023 సెప్టెంబర్‌ 16న శనివారం సీఎం కేసీఆర్‌ ఒక మోటారుతో నీటి ఎత్తిపోత ప్రారంభించారు. ఈ రెండు కార్యక్రమాలకు నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం ఎల్లూరు గ్రామ పరిధిలోని రేగుమాన్‌గడ్డ తీరం వేదికైంది. వారాలు తప్ప ప్రారంభించిన నెల, తేదీలు ఒకటే కావడం విశేషం. దశాబ్దం తర్వాత ప్రపంచంలోనే భారీ ప్రాజెక్టు పాలమూరు-రంగారెడ్డి పథకంలో 145 మెగావాట్ల మోటారుతో మళ్లీ నీటి ఎత్తిపోతలతో కృష్ణమ్మ పరుగులు పెట్టడం ఆసక్తి కలిగించింది.

  • రేగుమాన్‌గడ్డ తీరంలోనే సాగు, తాగునీటి ప్రాజెక్టులు శ్రీశైలం జలవిద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణంతో 1981-82 నుంచి పూర్వ ఎల్లూరు గ్రామపంచాయతీ పరిధిలోని రేగుమాన్‌గడ్డ తీరంలో శ్రీశైలం తిరుగుజలాలు నిల్వ ఉంటున్నాయి. కృష్ణానది ప్రవాహం ఉండే కోతిగుండు ప్రాంతం నుంచి రేగుమాన్‌గడ్డ తీరంలోకి 5 కిలోమీటర్ల మేర తిరుగుజలాలు విస్తరించాయి. కృష్ణానదిపై ఉన్న శ్రీశైలం జలాశయ గరిష్ఠ నీటి నిల్వ (ఎఫ్‌ఆర్‌ఎల్‌) 269.75 మీటర్లకు రాగానే వరద నీటిని ఎత్తిపోసుకునేలా రేగుమాన్‌గడ్డ తీరంలోని తిరుగుజలాల వద్ద మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (కేఎల్‌ఐ), పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు.

నేడు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో.. : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎల్లూరు రేగుమాన్‌గడ్డ తీరంలో శ్రీశైలం తిరుగుజలాల ఆధారంగా 2015లో భారాస ప్రభుత్వం చేపట్టింది. 12.30 లక్షల ఎకరాలకు సాగు, తాగునీరందించడం కోసం ఈ పథకం నిర్మాణం చేశారు. మొదటి ప్యాకేజీ నార్లాపూర్‌ పంపుహౌస్‌లో సెప్టెంబర్‌ 16న ఒక పంపుతో సీఎం కేసీఆర్‌ నీళ్ల ఎత్తిపోత ప్రారంభించారు.

సీఎం కేసీఆర్‌ ప్రారంభించిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నార్లాపూర్‌ పంపుహౌస్‌ నుంచి అంజనగిరి జలాశయంలోకి నీళ్ల ఎత్తిపోత

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని