logo

ప్రసూతికి ప్రభుత్వ ఆసుపత్రులకే!

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతి సేవలు క్రమంగా పెరుగుతున్నాయి. గతంలో ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళ్లి రూ.వేలల్లో ఖర్చు చేసి ప్రసూతి సేవలు పొందేవారు.

Published : 21 Sep 2023 03:33 IST

70 శాతానికి పైగా మహిళల సద్వినియోగం
ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో తగ్గుతున్న కాన్పులు

దేవరకద్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బాలింతతో మాట్లాడుతున్న మహబూబ్‌నగర్‌ జిల్లా వైద్యాధికారి డా.కృష్ణ

న్యూస్‌టుడే, పాలమూరు: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతి సేవలు క్రమంగా పెరుగుతున్నాయి. గతంలో ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళ్లి రూ.వేలల్లో ఖర్చు చేసి ప్రసూతి సేవలు పొందేవారు. ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పైసా ఖర్చు లేకుండా మెరుగైన ప్రసూతి సేవలు అందిస్తుండటంతో సద్వినియోగం చేసుకుంటున్నారు. అన్ని ఆసుపత్రుల్లో వైద్యులను నియమించడం, సరిపడా ఔషధాలు, సిబ్బంది, సదుపాయాలను సమకూర్చడంతో సేవలు మెరుగుపడ్డాయి. ఫలితంగా జిల్లా కేంద్రాల్లోని ఆసుపత్రులపై భారం తగ్గింది. క్లిష్టమైన కేసులు మాత్రమే జనరల్‌ ఆసుపత్రులకు వస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతి సేవలు పొందిన వారికి కేసీఆర్‌ కిట్‌తో పాటు ప్రోత్సాహక నగదు కూడా ఇస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో టిఫా స్కానింగ్‌ సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి. గర్భం దాల్చిన మహిళ తన కడుపుతో ఉన్న శిశువు అవయవాలు సరిగ్గా అభివృద్ధి చెందాయో లేదో పరీక్షల ద్వారా తెలుసుకునే అవకాశం కలిగింది. అన్ని రకాల రక్త పరీక్షలు తెలంగాణ డయాగ్నోస్టిక్‌ కేంద్రం ద్వారా ఉచితంగా చేస్తున్నారు. ఇలా చాలా రకాల అనుకూల పరిస్థితులు ఉండటంతో పేద, మధ్య తరగతి కుటుంబాల మహిళల్లో ఎక్కువ మంది ప్రభుత్వ ఆసుపత్రులకే వస్తున్నారు. ప్రసూతి సేవలకు రూ.30వేలకు పైగా ఫీజులు వసూలు చేస్తుండటంతో ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళ్లటం లేదు.

13వ స్థానంలో గద్వాల జిల్లా..

రాష్ట్రంలో ఎక్కువ కాన్పులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో, తక్కువ ప్రసవాలు ప్రైవేట్‌ దవాఖానాల్లో జరుగుతున్న జిల్లాల్లో వరంగల్‌ మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో హనుమకొండ, మూడో స్థానంలో జగిత్యాల జిల్లాలు నిలిచాయి. ఉమ్మడి జిల్లాలోని జోగులాంబ గద్వాల జిల్లా రాష్ట్రంలోనే 13వ స్థానంలో నిలిచింది. 22వ స్థానంలో నాగర్‌కర్నూల్‌, 25వ స్థానంలో నారాయణపేట, 26వ స్థానంలో వనపర్తి, 27వ స్థానంలో మహబూబ్‌నగర్‌ జిల్లా ఉన్నాయి. ఈ ఏడాది జులై, ఆగస్టు నెలల్లో నమోదైన ప్రసవాల గణాంకాల ఆధారంగా వీటి పనితీరును నిర్ధారణ చేశారు. ఉదాహరణకు మహబూబ్‌నగర్‌ జిల్లాలో జులైలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 1,088 మందికి కాన్పులు చేయగా, ప్రైవేటు ఆసుపత్రుల్లో 303 మందికి ప్రసవాలు నమోదయ్యాయి. ఆగస్టులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 1,044 కాన్పులు చేయగా, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో 276 కాన్పులు జరిగాయి.


ప్రసవానికి ఆసుపత్రికి వచ్చేలా అవగాహన
- డా.కృష్ణ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, మహబూబ్‌నగర్‌

ప్రభుత్వ ఆదేశాలు అమలుచేస్తూ ఇంటి వద్ద ప్రసవాలను పూర్తిగా నివారించాం. ప్రసూతికి ప్రతి ఒక్కరూ ఆసుపత్రికి వచ్చేలా అవగాహన కల్పిస్తున్నాం. జనరల్‌ ఆసుపత్రులతో పాటు ఇతర అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో ఎక్కువ కాన్పులు జరుగుతున్నాయి. వైద్య కళాశాలలు అందుబాటులోకి వచ్చాక ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే మెరుగైన సేవలు అందుతున్నాయి. ఫలితంగా ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని