logo

పోషణ లేని మాసం

అంగన్వాడీ సిబ్బంది సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సంఘం గౌరవాధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, అధ్యక్షురాలు శశికళ డిమాండ్‌ చేశారు.

Updated : 21 Sep 2023 05:47 IST

అంగన్‌వాడీల సమ్మె ప్రభావం
గర్భిణులు, పిల్లలకు అందని ఆహారం

గడిమున్కన్‌పల్లిలో అంగన్వాడీ కేంద్రం తెరవకుండా అడ్డుకుంటుకున్న దృశ్యం

న్యూస్‌టుడే- నారాయణపేట పట్టణం, మక్తల్‌ గ్రామీణం: చిన్నారులు, గర్భిణులకు పౌష్టికాహారం అందించాలని ఏటా పోషణ మాసం నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది ఎలాంటి పోషణా లేకుండా పోయింది. తమ సర్వీసును క్రమబద్ధీకరించాలని, కనీస వేతనం చెల్లించడంతోపాటు సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీలు కొన్ని రోజులుగా నిరవధిక సమ్మె చేపట్టారు. ఫలితంగా చిన్నారులకు పౌష్టికాహారం అందటం లేదు. కొన్నిచోట్ల తాళాలు పగలగొట్టి స్థానిక అధికారులకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. కేంద్రాలను బలవంతంగా తెరవవద్దని సిబ్బంది, నాయకులు అడ్డుకుంటున్నారు. ఈ పరిస్థితిలో అంగన్వాడీలపై ఆధారపడే బీదాబిక్కీ పిల్లలు, గర్భిణులు సరైన తిండిలేక అవస్థలు పడుతున్నారు.

జిల్లాలోని 13 మండలాలు మూడు ప్రాజెక్టుల పరిధిలో విస్తరించి ఉన్నాయి. 704 అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి బరువు తక్కువగా ఉన్నవారు, పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నవారి గుర్తింపు, ఆహార పంపిణీ, అవగాహన కార్యక్రమాలు నిలిచిపోయాయి. చాలా గ్రామాల్లో అధికారులు స్థానిక కార్యదర్శులు, ఇతర సిబ్బందికి ఆహార పంపిణీ బాధ్యతలను బదలాయించారు. వారంతా ఇతర కార్యక్రమాలు, వ్యాపకాలతో అంగన్వాడీలను అంతగా పట్టించుకోవడం లేదు.

  • అంగన్వాడీ టీచర్లు బీఎల్‌వోలుగా ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టేవారు. సమ్మె ప్రభావం ఓటరు నమోదుపై కూడా పడుతోంది.
  • నారాయణపేట జిల్లా కేంద్రం, ఊట్కూరు, పులిమామిడి సిబ్బంది సమ్మెలో పాల్గొనడం లేదు.
  • దామరగిద్ద మండలం గడిమున్కన్‌పల్లిలో కేంద్రం తెరిచి పోషకాహారం అందించాలని నిర్ణయించినా టీచర్లు, సహాయకులకు మద్దతుగా సీపీఎం నాయకులు. మాజీ వైస్‌ ఎంపీపీ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ అడ్డుకున్నారు. కేంద్రం తాళం పగలగొట్టకుండా అధికారులతో వాగ్వాదానికి దిగారు.  బైరంకొండ, ధన్వాడల్లోనూ ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి.
  • మక్తల్‌ పురపాలికలో 26 కేంద్రాలు, జక్లేర్‌ పరిధిలో 17, మంథన్‌గోడ్‌ సెక్టారులో 20, కర్ని ప్రాంతంలో 23 మొత్తం 88 అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటికి కొత్తగా వచ్చిన స్టాక్‌ను సూపర్‌వైజర్ల ద్వారా చేరవేశారు. తాళాలు విరగ్గొట్టి పంచాయతీలకు బాధ్యతలు అప్పగించినా అనుకున్న విధంగా పంపిణీ సాగడం లేదు.
  • మద్దూరు ప్రాజెక్టు పరిధిలో 207 అంగన్వాడీ కేంద్రాలు కొన్ని రోజుల క్రితం వరకు సీడీపీవో వివాదంతో తెరుచుకోలేదు. ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని భావిస్తే అంగన్వాడీల నిరవధిక సమ్మెతో మళ్లీ మూతపడ్డాయి.

జిల్లాలో కేంద్రాలు

మొత్తం అంగన్వాడీ కేంద్రాలు : 704
ప్రాజెక్టులు 03
గర్భిణులు 5,209
బాలింతలు 4,423
7 నెలలు-03 ఏళ్ల చిన్నారులు 21,505
3 - 6 ఏళ్ల చిన్నారులు 13,452
తక్కువ బరువు ఉన్నవారు 409
పౌష్టికాహారంలోపం బాధితులు 664


కలెక్టరేట్‌ ముట్టడించిన అంగన్వాడీలు

బుధవారం కలెక్టరేట్ గేటు ముందు అంగన్వాడీల ధర్నా

నారాయణపేట(పాతబస్టాండ్‌), న్యూస్‌టుడే : అంగన్వాడీ సిబ్బంది సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సంఘం గౌరవాధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, అధ్యక్షురాలు శశికళ డిమాండ్‌ చేశారు. తమ సమ్మె శిబిరమైన పేట పురపార్కు నుంచి కలెక్టరేట్కు బుధవారం ర్యాలీగా వెళ్లి ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో గేటు ముందు నినాదాలు చేశారు. రాజ్యాంగబద్ధంగా సమ్మె చేస్తుంటే అంగన్వాడీ కేంద్రాలపై రాళ్ల దాడులు చేస్తున్నారని, బాధ్యులపై కేసులు నమోదు చేయాలన్నారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌కు అందించారు. ఆందోళనకారులను పోలీసులు స్టేషన్‌కు తరలించి విడుదల చేశారు. కార్యక్రమంలో బలరాం, గోవిందరాజు, మంజూల, వసంత, రాధ తదితరులు పాల్గొన్నారు.


ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం

 వేణుగోపాల్‌, డీడబ్ల్యూవో, నారాయణపేట.

జిల్లాలో అంగన్వాడీ టీచర్లు, సహాయకులు సమ్మెలో ఉన్నందున సేవలకు ఎలాంటి అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం. ఇంటికి సరకులు చేరవేస్తాం. చిన్నారులు ప్రీ స్కూల్‌ విద్యకు దూరం కాకుండా టీ-శాట్‌లో కార్యక్రమాలను తల్లిదండ్రులకు పంపించాం. డిజిటల్‌ నమూనాలో పిల్లలకు విద్యను అందిస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని