logo

143 జీహెచ్‌ఎంలకు స్థాన చలనం

ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న జీహెచ్‌ఎంల బదిలీల ప్రక్రియ ముగిసింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 351 జీహెచ్‌ఎంల ఖాళీలు ఏర్పడగా వాటిలో 143 మందిని బదిలీల ద్వారా నియమించారు.

Published : 21 Sep 2023 03:57 IST

మిగిలిన ఖాళీలు 208
పదోన్నతుల ద్వారా భర్తీకి అవకాశం

అచ్చంపేటలో నిర్వహించిన సమావేశంలో జీహెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు

అచ్చంపేట, న్యూస్‌టుడే : ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న జీహెచ్‌ఎంల బదిలీల ప్రక్రియ ముగిసింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 351 జీహెచ్‌ఎంల ఖాళీలు ఏర్పడగా వాటిలో 143 మందిని బదిలీల ద్వారా నియమించారు. ఇంకా 208 ఖాళీలు ఉండగా వాటిని స్కూల్‌ అసిస్టెంట్లలో సీనియర్లకు పదోన్నతులు కల్పించడం ద్వారా భర్తీ చేయనున్నారు. జీహెచ్‌ఎంల పోస్టులను జోనల్‌ పోస్టులుగా గుర్తించడంతో బదిలీల్లో ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న వారిలో చాలా మంది రంగారెడ్డి జిల్లాకు బదిలీపై వెళ్లారు. ఇంకా ఎక్కువ సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి. మరో రెండు రోజుల్లో సీనియర్‌ ఎస్‌ఏలకు జీహెచ్‌ఎంలుగా పదోన్నతులు కల్పించనున్నారు. పదోన్నతుల తరువాత పూర్తి స్థాయిలో ఖాళీలు భర్తీ అయ్యే అవకాశం ఉంది.

మల్టీ జోన్‌-2లో ఉమ్మడి జిల్లా..

జీహెచ్‌ఎంల పోస్టులను జోనల్‌ స్థాయి పోస్టుగా గుర్తించారు. రాష్ట్రంలోని 33 జిల్లాలను రెండు జోన్లుగా విభజించారు. మల్టీ జోన్‌-1లో 20 జిల్లాలు ఉండగా మల్టీ జోన్‌-2లో 13 జిల్లాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాను రెండో జోన్‌లో చేర్చారు. జీహెచ్‌ఎంల బదిలీల సందర్భంగా అనుకూలమైన జిల్లాలకు ఆప్షన్లు ఇవ్వడంతో అత్యధికులు రంగారెడ్డి జిల్లాకు బదిలీ అయ్యారు. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో 351 జీహెచ్‌ఎంల ఖాళీలు ఏర్పడగా కేవలం 143 మాత్రమే బదిలీల్లో భర్తీ అయ్యాయి. ఉమ్మడి జిల్లాలో మహబూబ్‌నగర్‌లో మాత్రమే ఎక్కువ మంది జీహెచ్‌ఎంలు బదిలీని కోరుకున్నారు. మొత్తం 81 ఖాళీలు ఉండగా బదిలీల్లో 70 భర్తీ కాగా ప్రస్తుతం 11 ఖాళీలు మాత్రమే మిగిలాయి. నారాయణపేట జిల్లాలో 51 ఖాళీలు ఉండగా బదిలీల్లో కేవలం నలుగురు మాత్రమే ఆ జిల్లాను ఎంపిక చేసుకున్నారు. దాంతో అత్యధికంగా 47 ఖాళీలు మిగిలాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 93 ఖాళీలు ఉండగా 21 మంది మాత్రమే బదిలీల్లో ఈ జిల్లాను ఎంపిక చేసుకోగా అత్యధికంగా ఇంకా 72 ఖాళీలు మిగిలి ఉన్నాయి. వనపర్తి జిల్లాలో 69 ఖాళీలు ఉండగా బదిలీల్లో 20 భర్తీ కాగా ఇంకా 49 ఖాళీలు మిగిలి ఉన్నాయి. మల్టీ జోన్‌-2లో ఉన్న పది జిల్లాల్లో ఆసక్తి ఉన్న జిల్లాను ఎంపిక చేసుకునే అవకాశం కల్పించారు. ప్రస్తుతం మిగిలిన 208 ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీ చేయనున్నారు. పదోన్నతుల్లో కూడా జోన్‌ పరిధిలోని ఆసక్తి ఉన్న జిల్లాను ఎస్‌ఏలు ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంది. బదిలీ అయిన జీహెచ్‌ఎంలు ఇప్పటికే కొత్త స్థానాల్లో చేరారు.


వేతనాల చెల్లింపులకు ఇబ్బందులు లేకుండా చర్యలు..

బదిలీల్లో కొందరు జీహెచ్‌ఎంలు కొత్త స్థానాలకు వెళ్లడంతో ప్రస్తుతం ఆ పాఠశాల, సముదాయం పరిధిలోని ఉపాధ్యాయులకు వేతనాలు అందించడంలో జాప్యం చోటు చేసుకునే అవకాశం ఉంది. దీంతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న హెచ్‌ఎంలు డీడీవోలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సముదాయ పాఠశాల హెచ్‌ఎంలు దాని పరిధిలోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయుల వేతనాలను చెల్లించాల్సి ఉంటుంది. పదోన్నతుల ద్వారా కొత్త జీహెచ్‌ఎంలు వచ్చే లోపున ఆ పాఠశాలల్లోని సీనియర్‌ స్కూల్‌ అసిస్టెంట్లకు అదనపు బాధ్యతలు అప్పగించనున్నారు. డ్రాయింగ్‌, డిస్బర్సల్‌ ఆఫీసర్‌ (డీడీవోలు)గా బాధ్యతలు చేపట్టి వేతనాల చెల్లింపునకు ఇబ్బందులు ఎదురు కాకుండా చర్యలు తీసుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని