logo

చదివిందొకటి.. చెప్పేది మరోటి!

ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత కేటీదొడ్డి మండలంలో ఇర్కిచేడు ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులు వీరు. సుమారు 40 మంది ఉన్నారు.

Updated : 21 Sep 2023 05:51 IST

ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత కేటీదొడ్డి మండలంలో ఇర్కిచేడు ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులు వీరు. సుమారు 40 మంది ఉన్నారు. మొత్తం పాఠశాలలో అన్ని తరగతులకు కలిపి 300 మంది విద్యార్థులున్నారు. ఈ పాఠశాలలో కీలకమైన భౌతిక ర¢సాయనశాస్త్రం, గణిత ఉపాధ్యాయులులేరు. దీంతో విద్యార్థులు బోధన పరంగా నష్టపోతున్నారు. మరి.. వీరు పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు ఎలా సాధించగలుగుతారు. ఇలాంటి పరిస్థితి జిల్లా వ్యాప్తంగా 25 పాఠశాలల్లో ఉంది

కేటీదొడ్డి, ధరూరు, న్యూస్‌టుడే: ప్రాథమిక పాఠశాలల్లో సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులు లేకున్నా ఇబ్బంది ఉండదు. కానీ 6 నుంచి పదో తరగతి వరకు మాత్రం కచ్చితంగా సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులు ఉంటేనే విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఉంటుంది. మంచి ఫలితాలూ సాధ్యమవుతాయి. ప్రభుత్వం విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠశాలలను అప్‌గ్రేడ్‌ చేస్తూ వస్తోంది. కానీ అప్‌గ్రేడ్‌ అయిన పాఠశాలలకు సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ మాత్రం చేపట్టడంలేదు. 2014లో ఉన్నత పాఠశాలల్లో ఈ ప్రక్రియ చేపట్టిందే తప్ప తర్వాత దాని ఊసే లేని పరిస్థితి ఉంది. ఈ క్రమంలో అప్‌గ్రేడ్‌ అయిన పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్‌ ప్రమాదంలో పడబోతోంది. దీని ఫలితంగా బోధనలో లోపాల వల్ల ఉత్తమ ఫలితాలు పొందలేని పరిస్థితి ఆ పాఠశాలల విద్యార్థులది. పాఠశాల పంపిస్తున్న మాటేకాని విద్యార్థులకు మంచి చదువు అందడం లేదని తల్లిదండ్రులు మదనపడుతున్నారు.

జిల్లాలో 25 పాఠశాలల్లో..: జోగులాంబ జిల్లాలో కొన్ని ఉన్నత, ఉన్నతీకరణ పొందిన 25 పాఠశాలల్లో ఇదే పరిస్థితి ఉంది. ఉన్న సబ్జెక్టు ఉపాధ్యాయులు, స్కూల్‌ అస్టిటెంట్లు వారికి సంబంధంలేని సబ్జెక్టులు కూడా బోధించాల్సి వస్తోంది. కేటీదొడ్డి మండలంలో ఇర్కిచేడు, ధరూరు మండలం అల్వాల్‌పాడు, గార్లపాడు, మన్నాపురం, కొత్తపాలెం పాఠశాలల్లోను అదే పరిస్థితి. గద్వాల్‌ మండలంలో జమ్మిచేడు, అయిజ మండలంలో ఉత్తనూరు ఇలా జిల్లాలో దాదాపు 25 పాఠశాలల్లో 70 వరకు సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులు లేని పరిస్థితి జిల్లాలో ఉన్నట్లు విద్యాశాఖ లెక్కల ప్రకారం తెలుస్తోంది. కేటీదొడ్డి, కుచినేర్ల పాఠశాలలను ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి ఉన్నత పాఠశాలలుగా అప్‌గ్రేడ్‌ చేశారు. రెండు పాఠశాలల్లో స్కూల్‌ అసిస్టెంట్లు భౌతిక, రసాయనశాస్త్ర ఉపాధ్యాయులు తప్ప ఇతర సబ్జెక్టులకు ఉపాధ్యాయులు లేరు. ఎస్‌జీటీ ఉపాధ్యాయులతో నెట్టుకొస్తున్నారు. అయితే ప్రభుత్వం వీటిని భర్తీ చేసే ప్రక్రియ కూడా కనుచూపు మేరలో కనిపించటం లేదు. భర్తీ చేయాలంటే ప్రభుత్వం మరోసారి రేషనలైజేషన్‌ ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. సబ్జెక్టుల వారీగా బోధన చేసే సామర్థ్యమున్న విద్యావలంటీర్ల తక్షణ నియామకంతోనే విద్యార్థులు చదువులు గాడిన పడుతాయని తల్లిదండ్రులు అంటున్నారు.


పరీక్షలు గట్టెక్కేదెలా..
- ఆశ్విని, పదో తరగతి, ఇర్కిచేడు ఉన్నత పాఠశాల

జడ్పీహెచ్‌ఎస్‌ ఇర్కిచేడు ఉన్నత పాఠశాలలో చదువుతున్నాను. మాకు గణితం, భౌతికశాస్త్ర ఉపాధ్యాయులు లేరు. కొన్ని రోజుల కిందటి వరకు ఓ ఉపాధ్యాయుడు స్వచ్ఛందగా వచ్చి బోధించేవారు. ఆయన మానేయడంతో రెండు సబ్జెక్టుల్లో పది పరీక్షల్లో ఎలా గట్టెక్కాల్లో అర్థం కావటం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని