logo

పదోన్నతులకు కసరత్తు

ప్రధానోపాధ్యాయుల బదిలీల్లో అన్నీ లెక్క ప్రకారం జరిగినా.. పదోన్నతుల ప్రక్రియలో కొందరు అక్రమాలకు తెరలేపినట్లు తెలుస్తోంది.

Published : 21 Sep 2023 04:10 IST

నాడు వద్దని.. నేడు కావాలంటున్న ఉపాధ్యాయులు
నిబంధనలు ఉలంఘిస్తూ దరఖాస్తుల నమోదు

డైట్‌ కళాశాల కంప్యూటర్‌ ల్యాబ్‌లో ఆన్‌లైన్‌లో వివరాలు క్రోడీకరిస్తున్న అధికారులు

న్యూస్‌టుడే, మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం: ప్రధానోపాధ్యాయుల బదిలీల్లో అన్నీ లెక్క ప్రకారం జరిగినా.. పదోన్నతుల ప్రక్రియలో కొందరు అక్రమాలకు తెరలేపినట్లు తెలుస్తోంది. జిల్లా విద్యాశాఖ విడుదల చేసిన తాత్కాలిక సీనియారిటీ జాబితాలో లోపాలు చోటుచేసుకున్నాయని పలువురు ఉపాధ్యాయులు వాపోతున్నారు. ప్రధానోపాధ్యాయ పదోన్నతులను గతంలో రెండు సార్లు తిరస్కరించిన కొందరు స్కూల్‌ అసిస్టెంట్లు, ఎస్జీటీలకు మళ్లీ సీనియారిటీ జాబితాలో చోటు కల్పించినట్లు ఉపాధ్యాయుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి.

దస్త్రాల నిర్వహణలో నిర్లక్ష్యం : 2009లో విడుదలైన ఉత్తర్వు నం.11, 12 ప్రకారం పదోన్నతుల కోసం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేశారు. ఉత్తర్వు నం.145 ప్రకారం పదోన్నతి సమయంలో రెండుసార్లు ‘నాట్‌ విల్లింగ్‌’ ఇస్తే మళ్లీ సీనియారిటీ జాబితాలో చోటు కల్పించొద్దు. ఈ మార్గదర్శకాల ప్రకారం జాగ్రత్తగా సీనియారిటీ జాబితాను విద్యాశాఖ రూపొందించాలి. పదోన్నతి తిరస్కరించిన ఉపాధ్యాయుల సర్వీసు పుస్తకాల్లో నమోదు చేయాలి. 2009, 2013లో నాట్‌ విల్లింగ్‌ ఇచ్చిన వారు శాశ్వతంగా ఆయా సబ్జెక్టుల్లో పదోన్నతులకు దూరమవుతారు. జిల్లాలో మాత్రం నిబంధనలను తుంగలో తొక్కుతూ ఇష్టానుసారంగా సీనియారిటీ జాబితాలు తయారు చేస్తున్నారనే చర్చ సాగుతోంది.

అభ్యంతరాలకు అవకాశం : స్కూల్‌ అసిస్టెంట్లను 1:3 నిష్పతిలో పదోన్నతికి ఎంపిక చేస్తూ తాత్కాలిక జాబితాను విడుదల చేశారు. వీటిలో లోపాలుంటే అభ్యంతరాలు తెలిపేందుకు గురువారం వరకు అవకాశం ఉంది. ఆన్‌లైన్‌ ద్వారా వస్తున్న అభ్యంతరాలను పరిష్కరించే పనిలో విద్యాశాఖ నిమగ్నమైంది. పదోన్నతులపై రేపో, మాపో స్పష్టత రానుందనే ప్రచార నేపథ్యంలో పదోన్నతి జాబితాలో ఉన్నవారంతా జిల్లాలో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి.. ఉండే చోటు నుంచి దూరమెంత.. విద్యార్థుల సంఖ్య.. తదితరాలపై ఆరాతీస్తున్నారు.

మండల కేంద్రాల్లో పునఃపరిశీలన : రిజర్వేషన్‌ కోటాకు అనుగుణంగా జిల్లా కమిటీ సభ్యులు మండలాల వారీగా నివేదికలు సిద్ధం చేస్తున్నారు. మండల కేంద్రాల్లో ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌ వారికి కేటాయించిన కోటాకు అనుగుణంగా ఉన్నారా.. లేరా అనేది పరిశీలిస్తున్నారు. సర్వీస్‌ రిజిస్టర్లు(ఎస్‌ఆర్‌లు) పరిశీలిస్తున్నారు. రిజర్వేషన్లలో వచ్చారా.. పీహెచ్‌ కోటాలో వచ్చారా.. నేరుగా జరిగిన నియామకమా.. పదోన్నతితో వచ్చారా.. అనే నిష్పత్తి మేరకు (అడిక్వసీ) లెక్క తీస్తున్నారు. స్వీయ ధ్రువీకరణ తీసుకుంటున్నారు. ఖాళీలను బట్టి పదోన్నతి కల్పించనున్నారు.


నిబంధనల ప్రకారం చర్యలు : కొందరు ఉపాధ్యాయులు గతంలో రెండు పర్యాయాలు నాట్‌ విల్లింగ్‌ ఇచ్చిన వారు కూడా ఈసారి దరఖాస్తు చేసుకున్నట్లు అభ్యంతరాలు వచ్చాయి. వాటిని పరిశీలిస్తాం. నకిలీ ధ్రువపత్రాలతో పదోన్నతి, బదిలీ పొందేందుకు ప్రయత్నించే వారిపై సీసీఎల్‌ఏ రూల్స్‌ ప్రకారం శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.

ఎ.రవీందర్‌, జిల్లా విద్యాశాఖ అధికారి, మహబూబ్‌నగర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు