logo

టిక్కెట్లు ఆశిస్తూ.. పార్టీలో చేరిక

పాలమూరు కాంగ్రెస్‌లో టిక్కెట్ల ఉత్కంఠ నెలకొంది. దిల్లీలో బుధవారం ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) సమావేశం జరిగింది.

Updated : 21 Sep 2023 05:45 IST

పాలమూరులో పెరుగుతున్న పోటీ
ఇప్పటికే దిల్లీలో మకాం వేసిన ఆశావహులు
కాంగ్రెస్‌ గ్యారెంటీ కార్డు ప్రచారంతో క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా

రేవంత్‌రెడ్డి సమక్షంలో ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే సీతాదయాకర్‌రెడ్డి

ఈనాడు, మహబూబ్‌నగర్‌: పాలమూరు కాంగ్రెస్‌లో టిక్కెట్ల ఉత్కంఠ నెలకొంది. దిల్లీలో బుధవారం ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) సమావేశం జరిగింది. ఈ నెలాఖరున కొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉండటంతో పాలమూరు జిల్లాల్లో పలువురు దిల్లీ బాట పట్టారు. ఉమ్మడి జిల్లా నుంచి 25 మంది ఆశావహులు దిల్లీలో మకాం వేసి ఎలాగైనా టిక్కెట్టు దక్కించుకోవాలని ముఖ్య నేతల ద్వారా తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ నెల 17న రాత్రి పాలమూరు జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పరిశీలకులు వచ్చి 18న కాంగ్రెస్‌ గ్యారెంటీ కార్డుపై ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఆ పార్టీ అమలు చేసే ఆరు పథకాలను ప్రజలకు వివరించారు. హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన సీడబ్ల్యూసీ సమావేశాలు, తుక్కుగూడలో జరిగిన పార్టీ విజయభేరి విజయవంతం కావడంతో పార్టీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. పాలమూరు జిల్లాల నుంచి టిక్కెట్టు ఆశించే పలువురు ఆశావహులు విజయభేరికి పెద్ద ఎత్తున జనసమీకరణ చేసి తరలించారు. పాలమూరు జిల్లాలపై పక్కన ఉన్న కర్ణాటక ప్రభావం కొంతమేర ఉంటుంది. ఇటీవల జరిగిన ఆ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయభేరి మోగించింది. అక్కడ హామీలు ఇచ్చిన పలు పథకాలను కాంగ్రెస్‌ గ్యారెంటీ కార్డులో చేర్చడంతో పాలమూరుపైన పార్టీ విజయ ప్రభావం ఉంటుందని శ్రేణులు భావిస్తున్నాయి.  

సహకరిస్తారా?

పాలమూరులో వివిధ నియోజకవర్గాల్లో ఇతర పార్టీలకు చెందిన నేతలు కాంగ్రెస్‌ గూటికి చేరారు. వీరిలో పలువురు టిక్కెట్లను ఆశిస్తున్నారు. ఇప్పటికే పాలమూరు జిల్లాలోని 13 నియోజకవర్గాల నుంచి 73 దరఖాస్తులొచ్చాయి. టిక్కెట్ల కోసం దరఖాస్తుల గడవు ముగిసిన తర్వాత కూడా పలువురు కాంగ్రెస్‌లో చేరడం విశేషం. దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే కొత్తకోట సీతాదయాకర్‌రెడ్డి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఆమె ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. మహబూబ్‌నగర్‌ మాజీ ఎమ్మెల్యే యన్నెం శ్రీనివాస్‌రెడ్డి సీడబ్లూసీ సమావేశాల్లో పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయన మహబూబ్‌నగర్‌ నుంచి టిక్కెట్టు ఆశిస్తున్నారు. ఇప్పటికే ఇక్కడి నుంచి పోటీ తీవ్రంగా ఉంది. గద్వాలలోనూ ఇటీవల పార్టీలో చేరిన జడ్పీ ఛైర్‌పర్సన్‌ సరితతోపాటు మరికొందరు టిక్కెట్టు ఆశిస్తున్నారు. కొల్లాపూర్‌లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు టిక్కెట్టును ఆశించే పార్టీలో చేరారు. వనపర్తిలో పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి కూడా టిక్కెట్టు ఆశిస్తున్నారు. కల్వకుర్తిలోనూ ఓ ఎన్‌ఆర్‌ఐ టిక్కెట్టు కోసం దిల్లీ స్థాయిలో పైరవీలు చేస్తున్నారు.  గత కొద్ది రోజులుగా కాంగ్రెస్‌లో చేరికలు పెరగడంతో టిక్కెట్ల కోసం కూడా పోటీ త్రీవంగా ఉంది. చివరికి పార్టీ టిక్కెట్లు ఎవరికి దక్కుతుందో? దక్కిన అభ్యర్థికి మిగిలిన నాయకులు సహకరిస్తారో? వేచి చూడాల్సి ఉంది.


పార్టీ అభ్యర్థులపై దృష్టి..

పార్టీ పరిశీలకులు నియోజకవర్గాల్లో పర్యటించి గ్యారెంటీ కార్డుపై ప్రచారం నిర్వహిస్తూనే టిక్కెట్టు కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులపై కూడా ఆరా తీసినట్లు సమాచారం. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఎలా ఉంది? కాంగ్రెస్‌ పట్ల ప్రజల్లో సానుకూలత ఉందా? గ్యారెంటీ కార్డుపై ప్రజల్లో స్పందన ఏమిటీ? ఇతర పార్టీల పరిస్థితి? ఏ నేతలు పార్టీ టిక్కెట్టుకు దరఖాస్తు చేసుకున్నారు? వారికి ప్రజల్లో ఎలాంటి ఆదరణ ఉంది? తదితర వివరాలు ఆరా తీసినట్లు తెలిసింది. ఈ క్షేత్రస్థాయి పరిశీలనతో నివేదికలు తయారు చేసి పార్టీ అధిష్ఠానానికి సమర్పించనున్నట్లు సమాచారం. టిక్కెట్ల కేటాయింపులో ఈ నివేదికలు కీలకపాత్ర పోషించే అవకాశాలున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు