logo
Published : 27/11/2021 01:12 IST

స్థాయి పెరిగినా.. వసతులు అథమం

ఇంటర్మీడియట్‌ అమలవుతున్న కస్తూర్బా విద్యాలయాల్లో తీరిదీ..

న్యూస్‌టుడే, సంగారెడ్డి అర్బన్‌, ఝరాసంగం

ఝరాసంగంలో పూర్తికాని పనులు

బడి మానేసిన విద్యార్థులు, అనాథ పిల్లలను అక్కున చేర్చుకొని అండగా నిలవాలని సర్కారు సంకల్పించింది. ఇందుకు అనుగుణంగా కస్తూర్బా గాంధీ విద్యాలయాలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ఉద్దేశం మంచిదే అయినా.. క్షేత్ర స్థాయిలో సమస్యల కారణంతో నిర్దేశించిన లక్ష్యం నెరవేరని పరిస్థితి నెలకొంది. చాలా బడుల్లో కనీస సదుపాయాలు కరవయ్యాయి. సరిపడా నిధుల కేటాయింపు లేకపోవడంతో ఇక్కట్ల మధ్యే విదార్థినులు విద్యాభ్యాసం కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలోని కస్తూర్బాల్లో ఆరు నుంచి పదో తరగతి వరకు విద్యాభ్యాసం అమలవుతోంది. ఏడు చోట్ల ఇంటర్మీడియెట్‌ వరకు ఆప్‌గ్రేడ్‌ చేశారు. స్థాయి పెంచినా.. సౌకర్యాలు కల్పించకపోవడంతో విద్యార్థినుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. ఈ నేపథ్యంలో కథనం.

ఆరు చోట్ల అసంపూర్తి భవనాలు

జిల్లాలో కస్తూర్బాగాంధీ పాఠశాలలు 17 ఉన్నాయి. వీటిలో 3,342 మంది విద్యార్థినులు చదువుతున్నారు. ఏడు చోట్ల ఇంటర్మీడియట్‌ వరకు తరగతుల నిర్వహణ కొనసాగుతోంది. ఆ ఏడు చోట్ల కళాశాల నిర్వహణకు వీలుగా కొత్త భవనాలు మంజూరయ్యాయి. ఒక్కో భవన నిర్మాణానికి రూ.2 కోట్ల వరకు నిధులు మంజూరు చేశారు. వాటిలో జిన్నారం మినహా మిగిలిన అందోలు, నారాయణఖేడ్‌, సదాశివపేట, జహీరాబాద్‌ మండలం హోతి-కే, సిర్గాపూర్‌, ఝరాసంగంలో భవనాల నిర్మాణ పనులు పూర్తి కాలేదు. తొలుత పనులు వేగంగా జరిగినా.. ఆ తర్వాత గుత్తేదారులు ఆసక్తి చూపడం లేదు. ఏళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాఠశాలలు, కళాశాలల నిర్వహణ ఒకేచోట కొనసాగుతున్న చోట సరిపడా వసతులు లేక విద్యార్థినులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. తరగతి గదులు, వసతి గృహాలు కిటకిటలాడుతున్నాయి. శౌచాలయాలు లేవు. ఉదాహరణకు.. ఝరాసంగంలో ఆరు నుంచి ఇంటర్‌ వరకు ఒకే భవనంలో నిర్వహిస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం 360 మంది విద్యార్థినులు ఉన్నారు. నూతన భవనాల పనులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొస్తేనే విద్యార్థినుల ఇబ్బందులు తీరనున్నాయి.

అందని ఆరోగ్య కిట్లు

కస్తూర్బాల్లో అమలు కావాల్సిన నిబంధనలు, వసతులను అధికారులు పట్టించుకోవడం లేదు. శౌచాలయం, స్నానాపు గదుల శుభ్రతకు నెలనెలా విడుదల కావాల్సిన నిధుల ఊసేలేదు. కరోనా వ్యాప్తి చెందకుండా విద్యార్థులకు శానిటైజర్‌, చేతిశుభ్రతకు రసాయనాలు, పరికరాలను అందుబాటులో ఉంచడం లేదు. ఒక్కో కేజీబీవీలో 20-30 వరకు శౌచాలయాలు, స్నానపు గదులున్నాయి. విద్యార్థులు 200-350పైగా ఉంటున్నారు. ఉదయం, సాయంత్రం గదులు శుభ్రత పూర్తి స్థాయిలో ఉండటం లేదు. వాటిని నిత్యం విద్యార్థులే శుభ్రం చేసుకోవాల్సి వస్తోంది. బాలికలకు ఆరోగ్య కిట్లు ఇప్పటికీ పంపిణీ చేయలేదు. శానిటరీ న్యాప్‌కిన్స్‌, సబ్బులు, నూనె, శాంపూలు, పౌడర్‌ తదితరాలకు సంబంధించిన బిల్లులు కరవయ్యాయి. ఏకరూప దుస్తులు పంపిణీ చేయలేదు.

ఇబ్బందులను అధిగమిస్తాం..

- సుప్రియ, కస్తూర్బా విద్యాలయాల జిల్లా సమన్వయకర్త

జిల్లాలోని కస్తూర్బా విద్యాలయాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తాం. ఆరోగ్య కిట్లు, ఇతరత్రా సామగ్రి పంపిణీ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. మంజూరు చేయగానే విద్యార్థులకు అందజేస్తాం. జిన్నారం మినహా మిగిలిన ఆరు చోట్ల భవనాలు అసంపూర్తిగా ఉన్నాయి. వాటిలో అందోలులో పనులు తుది దశకు చేరాయి. వాటిని పూర్తి చేసేలా గుత్తేదారులకు సూచిస్తాం.

 

Read latest Medak News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని