రాష్ట్రానికి కేంద్రం చేసిందేమీ లేదు: మంత్రి హరీశ్
ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ప్రసంగిస్తున్న మంత్రి..
పటాన్చెరు అర్బన్, న్యూస్‌టుడే: రాష్ట్రానికి కేంద్రం ఇచ్చే బడ్జెట్లో కోతలు, ధరలు పెంచి ప్రజలకు వాతలు పెట్టడం తప్ప భాజపా చేసింది ఏమీలేదని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో శుక్రవారం నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా, మండలాలకు బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించిందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు బాగా పెంచి.. కొద్దిగా తగ్గించి ఎంతో తగ్గించామని ప్రచారం చేసుకుంటోందని ఇది అక్బర్, బీర్బల్ కథను తలపిస్తోందని ఎద్దేవా చేశారు. యూపీ ఎన్నికల తర్వాత గ్యాస్ సిలిండర్ ధర రూ.1200కు చేరుతుందన్నారు. కేంద్రం బోగస్ ప్రచారం చేస్తోందని ఆరోపించారు. కేంద్రానికే ఆదాయం చేకూరేలా సర్‌ఛార్జి, పన్నుల్లో మార్పులు చేశారని దుయ్యబట్టారు. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా తెలంగాణకు వడ్లు వస్తున్నాయని.. అలాగే కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నాయని తెలిపారు. మీరు సక్రమంగా కొనుగోలు చేస్తే తెలంగాణకు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. మెదక్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం రెండు జాతీయపార్టీలు ఒక్కటయ్యాయని ఆరోపించారు. తెరాసకు 776 మంది బలం ఉందని ఓట్లు ఎలా వేయాలనే అంశంపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పిస్తామన్నారు. తెరాస ఒక్కటే ప్రాధాన్యత ఓటు వేయాలని పేర్కొన్నారు. భూపాల్‌రెడ్డికి భవిష్యత్‌లో మంచి స్థానం దక్కుతుందన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి యాదవ్రెడ్డి 2014, 2018 ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం శ్రమించారన్నారు. ఈ ఎన్నికల్లో క్రమశిక్షణతో పనిచేసి పార్టీ ఆదేశాల మేరకు తెరాస అభ్యర్థి యాదవరెడ్డిని గెలిపించుకోవాలన్నారు. ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, అభ్యర్థి యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.