logo
Published : 27/11/2021 01:12 IST

ఓటీపీతో తంటాలు!

సకాలంలో అందని ధాన్యం డబ్బులు

మిరుదొడ్డి మండలం లింగుపల్లిలో ట్రక్‌షీట్‌లో వివరాలు నమోదుచేస్తున్న నిర్వాహకులు

ఈనాడు డిజిటల్‌, సిద్దిపేట -న్యూస్‌టుడే, మిరుదొడ్డి: జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగంగా సాగుతున్నప్పటికీ అన్నదాతలు కొత్త సమస్యతో సతమతమవుతున్నారు. ఓటీపీ విధానం ప్రవేశ పెట్టడంతో సకాలంలో డబ్బులు చేతికి అందక ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 412 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటివరకు 25,593 మంది నుంచి 1,16,816 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొన్నారు. అందులో 15167 రైతులకు సంబంధించి 73,068 మెట్రిక్‌ టన్నుల ధాన్యం వివరాలను ట్యాబ్‌లో పొందుపరిచారు. ఈమేరకు 7100 మంది అన్నదాతలకు రూ.72.06 కోట్లు చెల్లించారు. మిగతా వారికి చెల్లించాల్సి ఉంది. మిల్లు నుంచి వచ్చిన ట్రక్‌షీట్‌ ఆధారంగా.. ధాన్యం వివరాలను కొనుగోలు కేంద్ర నిర్వాహకులు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ట్రక్‌షీట్‌లో ఒకరి కంటే ఎక్కువ రైతులు ఉన్న సందర్భంలో ఆధార్‌కార్డుకు చరవాణి నంబరును అనుసంధానం చేసుకున్న వారి వివరాలు మాత్రమే నమోదవుతున్నాయి. ట్రక్‌షీట్‌లోని అందరి వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచినప్పుడే చెల్లింపులు సజావుగా సాగుతాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు ఈ సాంకేతిక సమస్యతో జిల్లా వ్యాప్తంగా 3000 మందిపైగా రైతులకు చెల్లింపులు ఆగిపోయాయి. ఇదిలా ఉండగా నమోదు చేసే సమయంలో నిర్వాహకులు.. సదరు రైతు చరవాణికి ఓటీపీ నంబరు పంపిస్తున్నారు. ఈ నంబరును చాలా మంది తిరిగి నిర్వాహకులకు చెప్పలేకపోతున్నారు. ఈ కారణంగా వివరాలు ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేసే ప్రక్రియ ఆలస్యమవుతోంది. మళ్లీ రైతు ఓటీపీ నంబరు చెప్పేందుకు కేంద్రానికి రావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు అన్నదాతలకు మరింత అవగాహన కల్పించి.. చరవాణి నంబరు అనుసంధానం చేసుకొనేలా చొరవ చూపాల్సిన అవసరం ఉంది.


ఈ రైతు పేరు స్వామి. మిరుదొడ్డి మండలం లింగుపల్లి. పది రోజుల క్రితం 40 క్వింటాళ్ల ధాన్యాన్ని అదే గ్రామంలోని ఐకేపీ కేంద్రంలో విక్రయించారు. అక్కడి నిర్వాహకులు ట్రక్‌షీట్‌లో మొత్తం పది మంది రైతుల వివరాలు నమోదు చేయగా.. ఇద్దరికి సంబంధించి ఆధార్‌కు చరవాణి నంబరు అనుసంధానం చేసుకోకపోవడంతో ఆన్‌లైన్‌లో నమోదు కాలేదు. ఈయనతో పాటు మిగతా వారికీ నగదు చెల్లింపులు ఆగిపోయాయి. వారంతా ధాన్యం డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు.


అనుసంధానం చేసుకోవాలి..

ప్రతి ఒక్క రైతు తమ ఆధార్‌కార్డుకు చరవాణి నంబరును అనుసంధానం చేసుకున్న తర్వాతే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించుకోవాలి. అలా చేస్తేనే సకాలంలో డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి. సమస్యను అధిగమించేందుకు చరవాణి నంబరు అనుసంధానం చేసుకున్న రైతుల ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. ఈవిషయంగా రైతులకు అవగాహన కల్పిస్తాం.

- హరీశ్‌, జిల్లా పౌరసరఫరాల అధికారి


Read latest Medak News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని