యువ భవితకు పునాది
ఎస్సీ స్టడీ సర్కిల్లో ఐదు నెలల ఫౌండేషన్ కోర్సు
ఉమ్మడి మెదక్ జిల్లా యువతకు అవకాశం
న్యూస్‌టుడే, సిద్దిపేట టౌన్
కేంద్రంలో శిక్షణ ఇస్తూ..
ఎస్సీ స్టడీ సర్కిల్.. నిరుద్యోగ యువతకు వరంగా మారింది. ఏకకాలంలో వివిధ అంశాల్లో శిక్షణలు.. ఉమ్మడి మెదక్ జిల్లాలోని యువతీ, యువకుల ప్రగతికి దోహదం చేస్తోంది. ఉద్యోగ సాధన దిశగా అందించే తర్ఫీదుతో సత్ఫలితాలు సాధ్యమవుతున్నాయి. కరోనా తదనంతర పరిస్థితుల్లో సిద్దిపేటలోని ఎస్సీ స్టడీ సర్కిల్.. ఐదు నెలల ఉచిత ఫౌండేషన్ కోర్సు అందించేందుకు సన్నద్ధమైంది. ఇందులో భాగంగా గ్రూప్-1, 2, 3, 4, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ, బ్యాంకింగ్, తదితర విభాగాల్లో పోటీ పరీక్షలకు సిద్ధం చేయనున్న నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.
ఉమ్మడి మెదక్ జిల్లాలో సిద్దిపేట కేంద్రంగా ఎస్సీ స్టడీ సర్కిల్ కొనసాగుతోంది. 2017లో దీన్ని ఇక్కడ నెలకొల్పారు. ఇక్కడ ప్రధానంగా ఫౌండేషన్ కోర్సు అందిస్తున్నారు. ఇప్పటివరకు నాలుగు బ్యాచ్‌ల్లో 400 మంది వరకు శిక్షణ పొందారు. వీరిలో 100 మందికి పైగా ఉద్యోగాలు సాధించారు. పోలీసు, రెవెన్యూ, అటవీ, తపాలా శాఖ తదితర శాఖల్లో కొలువులు దక్కించుకోవడం గమనార్హం. కొంతమంది ఏకకాలంలో నాలుగు ఉద్యోగాలు సాధించి సగర్వంగా నిలిచారు. ఈ క్రమంలో మరోసారి ఐదు నెలల పాటు ఫౌండేషన్ కోర్సు నిర్వహణకు తెర తీసింది. డిగ్రీ పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువత నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నెల 30వ తేదీలోపు www.tsstudycircle.co.in వెబ్సైట్లో ఈ ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంటుంది. సీట్ల కేటాయింపులో భాగంగా.. 75 శాతం ఎస్సీ, 15 శాతం బీసీ, మైనార్టీ, 10 శాతం ఎస్టీ సామాజికవర్గాలకు రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. అందులో మొత్తంగా 33.33 శాతం మహిళలకు, ఐదు శాతం దివ్యాంగులకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది.
సిద్దిపేటలోని ఎస్సీ స్టడీ సర్కిల్ భవనం
100 మందికి..
డిసెంబరు 5న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 100 మార్కులు ఉంటాయి. అందులో జనరల్ స్టడీస్ - 55, జనరల్ ఎబిలిటీ (ఆర్థమేటిక్, రీజనింగ్, ఆంగ్లం) అంశాలకు - 45 మార్కులు నిర్దేశించారు. సిద్దిపేటలోని ప్రతిభ డిగ్రీ కళాశాలలో వచ్చే నెల 5వ తేదీన ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రవేశ పరీక్ష జరుగుతుంది. ఫలితాల మేరకు ప్రతిభ ఆధారంగా 100 మందిని ఎంపిక చేయనున్నారు. ఎంపికైన శిక్షణార్థులకు ఉచితంగా తర్ఫీదుతో పాటు భోజనం, వసతి కూడా కల్పించనున్నారు.
వివిధ అంశాల్లో..
శిక్షణలో భాగంగా నిర్దేశిత పోటీ పరీక్షలన్నింటికీ సిద్ధం చేస్తారు. డిసెంబరు 15 నుంచి తరగతులు ఆరంభం కానున్నాయి. వచ్చే ఏడాది మే 15వ తేదీ వరకు కొనసాగుతాయి. అందుకు అనుగుణంగా 16 అంశాలపై బోధించనున్నారు. అనుభవం కలిగిన, వివిధ సబ్జెక్టుల్లో నిష్ణాతులైన అధ్యాపకులు, శిక్షకులతో బోధన నిర్వహిస్తారు. మహిళలు, పురుషులకు వేర్వేరుగా వసతి సదుపాయం ఉంటుంది. ఉదయాన్నే అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందిస్తారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు కొనసాగుతాయి. రూ.2500 విలువైన అధ్యయన సామగ్రి (స్టడీ మెటీరియల్)ని పంపిణీ చేస్తారు. ప్రతి నెలా పురుషులకు రూ.100, మహిళలకు - రూ.150 స్టైఫండ్‌గా అందిస్తారు. తరగతుల బోధనతో పాటు నమూనా పరీక్షలు నిర్వహిస్తారు. వ్యక్తిత్వ వికాస తరగతులు సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించి ప్రేరణ కల్పిస్తారు. ఆంగ్లంలోనూ తర్ఫీదు ఉంటుంది.
సద్వినియోగం చేసుకోండి..: శ్రీకాంత్, డైరెక్టర్, ఎస్సీ స్టడీ సర్కిల్ (సిద్దిపేట)
మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో ఈ కేంద్రం ఏర్పాటై కొనసాగుతోంది. నిరుద్యోగ యువత, డిగ్రీ పూర్తి చేసిన వారు దరఖాస్తులు సమర్పించాలి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మరిన్ని వివరాలకు 91822-20112 నెంబరులో సంప్రదించాలి.