పాండురంగడి క్షేత్రం.. కనులారా వీక్షణం
29 నుంచి మహోత్సవాలు
న్యూస్టుడే, మునిపల్లి
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ జీవన్ముక్త పాండురంగ ఆలయం ఈ ఏడాది ఉత్సవాలకు ముస్తాబైంది. మునిపల్లి మండలం అంతారం గ్రామంలో 365 ఏళ్లక్రితం వెలసిన ఈ క్షేత్రంలో ఏటా కార్తిక బహుళ దశమి నుంచి చతుర్దశి వరకు మహోత్సవాలు నిర్వహిస్తారు. ఈ నెల 29నుంచి వారం రోజులపాటు జరగనున్న వేడుకల కోసం ఆలయాన్ని సర్వాంగసుందరంగా అలంకరించారు. 18వ శతాబ్దంలో పాండురంగ ఆలయం నిర్మితమైనట్లు చరిత్ర చెబుతోంది. దీనిని హైదరాబాద్ నవాబు నిజాముల్ ముల్క్-1 పరిపాలనలో ప్రధాని చందులాల్ బహదూర్ నిర్మించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. ఏటా వారంరోజుల పాటు ఘనంగా నిర్వహించే జాతరకు రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల్లోని పలు జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు. భక్తుల కోసం నిత్య అన్నదానంతోపాటు రాత్రి బస చేసేందుకు సత్రాలు, మౌలిక సౌకర్యాలను సంస్థానం పీఠాధిపతి జ్ఞానేశ్వర్ బాల్రాజ్ మహారాజ్ కల్పిస్తున్నారు.
కార్యక్రమాలు ఇలా...
ఈనెల 29న మధ్యాహ్నం శిఖర స్థాపనతో ఉత్సవం మొదలవుతుంది. 30న గరుడవాహనం, డిసెంబరు 1న మహాపూజ, పుష్పార్చన, భజనకీర్తనలు ఉంటాయి. 2న ప్రత్యేక పూజలు, అన్నదానం నిర్వహించిన అనంతరం రాత్రి 7.30గంటలకు రథోత్సవం ఊరేగింపు, హరికథా కాలక్షేపం తదితర కార్యక్రమాలు ఉంటాయని సంస్థానం పీఠాధిపతి బాల్రాజ్ మహారాజ్ పేర్కొన్నారు.
చంద్రభాగ గుండంలో ..
ఆలయానికి ఎడమ పక్కనున్న చంద్రభాగ గుండంలో స్నానమాచరిస్తే చర్మవ్యాధులు నయమవుతాయని భక్తుల నమ్మకం. ఆరాధనోత్సవాలకు మహారాష్ట్రలోని భాల్కి జిల్లా నుంచి నెయ్యి వచ్చేదని చరిత్రలో రాసి ఉంది. ఓ ఏడాది వార్షికోత్సవానికి సమయానికి నెయ్యి రాకపోవడంతో అక్కడి పురోహితుడి ఆజ్ఞ మేరకు ఆలయ ఆవరణలోని చంద్రభాగం నుంచి నీళ్లను తీసుకువచ్చి యజ్ఞం జరిపించినట్లు పూర్వీకులు చెబుతుంటారు. నాటి నుంచి పాండురంగడిని దర్శించుకునే ముందు చంద్రభాగం గుండంలో స్నానమాచరించి మొక్కులు చెల్లించుకుంటారు.