నచ్చేలా.. మెచ్చేలా.. విగ్రహాల తయారీ
న్యూస్టుడే, ఝరాసంగం
తాను చెక్కిన దత్తగిరి మహారాజ్ విగ్రహంతో నరసింహులు
శిలను శిల్పంగా మార్చాలంటే ఆ కళ తెలిసి ఉండాలి. ప్రత్యేకంగా శిక్షణ పొందాలి. లెక్క ప్రకారం కొలతలు వేసి ఎంత పరిమాణం ఉండాలి, ఎలాంటి రాయి కావాలో చూసుకుని శిలపై ముందుగా చిత్రాన్ని గీసి శిల్పంగా మారుస్తారు. కానీ ఝరాసంగం గ్రామానికి చెందిన వడ్ల నరసింహులు ఐదో తరగతి చదివినప్పటికీ అద్భుతంగా శిల్పాలు చెక్కుతున్నారు, విగ్రహాలు తయారు చేస్తున్నారు. పూర్వీకులు కర్రతో ఇంటి తలుపులు, కిటికీలు, గుమ్మాలు, వ్యవసాయ పరికరాలు చేసేవారు. కొన్నాళ్లపాటు ఆయన అదే వృత్తిలో కొనసాగారు. కాగా నాలుగేళ్లుగా రాతి శిల్పాలను చెక్కడం ప్రారంభించి తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు.
వందకు పైగా..: ఏక శిల, నల్ల, పాలరాళ్లను ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి నాలుగేళ్లలో వందకు పైగా వివిధ రకాల రాతి విగ్రహాలను తయారు చేశారు. ఇప్పటి వరకు శివలింగం, నంది, దత్తాత్రేయుడు, తదితర విగ్రహాలను తయారు చేశాడు. చుట్టుపక్కల పలు ఆలయాలకు కొన్ని దేవతామూర్తుల విగ్రహాలను తయారు చేసినట్లు అందజేసినట్లు నరసింహులు తెలిపారు.