logo
Published : 27/11/2021 01:12 IST

పాపం పసివాళ్లు!

అంగన్‌వాడీ కేంద్రాల్లో భద్రతా చర్యలు అవశ్యం

 న్యూస్‌టుడే, గజ్వేల్‌, మెదక్‌, సిద్దిపేట టౌన్‌, టేక్మాల్‌, మనోహరాబాద్‌, కొండపాక

మనోహరాబాద్‌ మండలం రంగాయపల్లిలో..

గజ్వేల్‌ మండలం బయ్యారం గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో నాలుగేళ్ల చిన్నారి నిత్యశ్రీ గురువారం పాము కాటుకు గురై మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. కేంద్రం ఆవరణలోని పిచ్చిమొక్కలు ఉన్న చోటకు మూత్రవిసర్జనకు వెళ్లగా పాము కాటేసింది. ఈ ఘటన బాధిత కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించి పోషకాహారం అందించేందుకు అంగన్‌వాడీ కేంద్రాలను ప్రభుత్వం నెలకొల్పింది చాలా చోట్ల వాటి నిర్వహణ కొరవడటంతో అధ్వాన పరిస్థితులు నెలకొన్నాయి. పరిసరాలలో పిచ్చిమొక్కలు, పుట్టలతో కనిపిస్తున్నాయి. దీనికితోడు సరైన శుభ్రత చర్యలు చేపట్టడం లేదు. ఈ మేరకు సిద్దిపేట, మెదక్‌ జిల్లాల్లోని పలు కేంద్రాలను ‘న్యూస్‌టుడే’ బృందం పరిశీలించింది. బయ్యారం ఘటన దరిమిలా నిర్వాహకులు కొన్ని చోట్ల పరిసరాలను శుభ్రం చేయించడం గమనార్హం.

రెండు జిల్లాల్లో 2226 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 538 కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలున్నాయి. మిగతావన్నీ అద్దె, పాఠశాలల ఆవరణలో, దాతలు సమకూర్చిన భవనాల్లో నిర్వహిస్తున్నారు. ఇక శౌచాలయాలదీ అదే పరిస్థితి. అత్యవసరమైతే ఆరుబయటకు పరుగులు తీయాల్సిందే. చాలా చోట్ల భవనాలు శిథిలావస్థకు చేరుకోగా వాటిని పట్టించుకునే వారు లేరు. అంగన్‌వాడీ ఉపాధ్యాయులు, ఆయాలకు వేతనాలు మినహా నిర్వహణకు సంబంధించి నిధులు కేటాయించడం లేదు. ఇటీవల కురిసిన వర్షాలకు పలు కేంద్రాల చుట్టూ మొక్కలు పెరిగిపోయాయి. దీనికితోడు కలుగు రంధ్రాలు, పుట్టల కారణంగా ముప్పు పొంచి ఉందని చిన్నారుల తల్లిదండ్రులు వాపోతున్నారు. చిన్నారుల ఆలనాపాలన చూడటంతో పాటు పోషకాహారం అందిస్తూ వారిని సంరక్షించాల్సిన బాధ్యత నిర్వాహకులకు ఉంటుంది.

కొన్ని చోట్ల ఇలా..

* గజ్వేల్‌ మండలం ప్రజ్ఞాపూర్‌లోని అంగన్‌వాడీ కేంద్రం - 2 చుట్టూ ముళ్లపొదలు ఉన్నాయి. నిత్యం చిన్నారులు వాటిమధ్య వెళ్లాల్సిన పరిస్థితి. బయ్యారం ప్రభుత్వ పాఠశాల ఆవరణలో కేంద్రం పక్కన మట్టి గడ్డలున్నాయి.

* అక్కన్నపేట మండలం మల్లుపల్లి పరిధిలోని కేంద్రాన్ని రేకుల షెడ్డులో నిర్వహిస్తున్నారు. శౌచాలయాలు సరిగా లేవు. ఇక్కడ పరిసరాలలో చెత్తాచెదారం పడి ఉంది. * మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ రంగాయపల్లిలో కేంద్రం అపరిశుభ్రతకు నిలయంగా మారింది. * టేక్మాల్‌ మండల కేంద్రంలోని అంగన్‌వాడీలోకి పలుమార్లు పాములు వచ్చాయని స్థానికులు పేర్కొన్నారు. * కొండపాకలోని 1, 2, 4 కేంద్రాలు ఎమ్మార్సీ, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఆవరణలో కొనసాగుతున్నాయి. ఆయా చోట్ల స్థానికులు మద్యం తాగి సీసాలను ఇక్కడే వదిలేస్తున్నారు. పరిసరాలు చెత్తాచెదారంతో దర్శనమిస్తున్నాయి.

సంరక్షణ చర్యలు తీసుకుంటున్నాం..

అంగన్‌వాడీ కేంద్రాల వద్ద చిన్నారుల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నాం. శాశ్వత, అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నాం. ఎక్కడైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తాం. అంగన్‌వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగితే సమీప ప్రభుత్వ పాఠశాలలకు తరలించాల్సిందిగా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఇందుకు అనుగుణంగా నివేదికలు సిద్ధం చేస్తున్నాం.

- జయరాంనాయక్‌, రాంగోపాల్‌రెడ్డి, మెదక్‌, సిద్దిపేట జిల్లాల సంక్షేమ అధికారులు

 

Read latest Medak News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని