logo
Published : 27/11/2021 01:12 IST

మెతుకుసీమలో.. త్రిముఖ పోరు

ఎమ్మెల్సీ ఎన్నిక బరిలో తెరాస, కాంగ్రెస్‌తో పాటు స్వతంత్ర అభ్యర్థి

మెదక్‌, న్యూస్‌టుడే

1. ఒంటరి యాదవరెడ్డి (తెరాస) 2. తూర్పు నిర్మల (కాంగ్రెస్‌) 3. మట్ట మల్లారెడ్డి (స్వతంత్ర)

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో త్రిముఖ పోరు జరగనుంది. శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరనేది తేలింది. మెదక్‌ నియోజకవర్గ స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో ప్రధానపార్టీలు తెరాస, కాంగ్రెస్‌తో పాటు స్వతంత్ర అభ్యర్థి పోటీ పడనున్నారు. ఈ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న భూపాల్‌రెడ్డి (తెరాస) పదవీకాలం వచ్చే ఏడాది జనవరి 4తో ముగియనుండటంతో ఎన్నిక నిర్వహణకు ఈనెల 16న నోటిఫికేషన్‌ జారీ అయింది. అదే రోజు నుంచి ఈనెల 23 వరకు నామపత్రాలను స్వీకరించారు. మొత్తం ఏడుగురు అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేయగా ఇద్దరు స్వతంత్రుల నామపత్రాలను అధికారులు తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గురువారం సిద్దిపేట జిల్లా కొండపాక మండలం జప్తినాచారానికి చెందిన సాయిబాబ నామినేషన్‌ ఉపసంహరించుకోగా.. శుక్రవారం తెరాసకు చెందిన సంగారెడ్డి మున్సిపల్‌ కౌన్సిలర్‌ బోయిని విజయలక్ష్మి పోటీ నుంచి తప్పుకున్నారు. సంగారెడ్డి పురపాలిక అధ్యక్షురాలు ఎం.విజయలక్ష్మితో కలిసి మెదక్‌ కలెక్టరేట్‌కు వచ్చారు. ఉపసంహరణ పత్రాన్ని రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ హరీష్‌కు అందజేశారు. దీంతో బరిలో ముగ్గురు అభ్యర్థులు మిగిలారు. తెరాస అభ్యర్థిగా ఒంటరి యాదవరెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థిగా తూర్పు నిర్మల, స్వతంత్ర అభ్యర్థిగా మట్ట మల్లారెడ్డి పోటీ చేస్తున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు హమీ మేరకు నామినేషన్‌ ఉపసంహరించుకున్నట్లు బోయిని విజయలక్ష్మి పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ సంగారెడ్డి పురపాలిక అభివృద్ధికి రూ.30 కోట్లు మంజూరు చేయిస్తానని మంత్రి హమీ ఇచ్చారన్నారు.

వెయ్యి మందికి పైగా ఓటర్లు

అధికార తెరాస, ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీలు తమ కార్యాచరణను షురూ చేశాయి. ఈ ఎన్నికల్లో పాత ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులతో పాటు మున్సిపల్‌ కౌన్సిలర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తంగా 1,026 మంది ఓటర్లు ఉన్నారు. తెరాస సిట్టింగ్‌ స్థానం కావడంతో మరోసారి విజయకేతనం ఎగురవేస్తామని నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

తెరాసకు 777 ఓట్లు ఉన్నాయని వారు పేర్కొంటున్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులకు మంత్రి తన్నీరు హరీశ్‌రావు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇదిలా ఉండగా తెరాసకు మద్దతు ఇస్తున్న ఓటర్లను ఇతర రాష్ట్రాల్లోని పర్యాటక ప్రాంతాలకు తరలించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శనివారం మెదక్‌లో ఎంపీటీసీలతో కాంగ్రెస్‌ నేతలు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఓటర్లలో తమ పార్టీకి చెందిన 230 మంది ఉన్నారని ఇటీవల సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. బ్యాలెట్‌ విధానంలో ఎన్నిక జరగనుండటంతో ప్రతి ఓటుపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. ఇక మట్ట మల్లారెడ్డి దుబ్బాక పురపాలికలోని మూడో వార్డు కౌన్సిలర్‌. ఈయన అప్పట్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కౌన్సిలర్‌గా గెలుపొందారు. తరువాత తెరాసలో చేరారు. ఇటీవల భాజపా తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేస్తూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

రెవెన్యూ డివిజన్ల వారీగా పోలింగ్‌ కేంద్రాలు

వచ్చే నెల 10న పోలింగ్‌ జరగనుంది. ఇది వరకు సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట జిల్లాల్లో మూడు పోలింగ్‌ కేంద్రాలు ఉండగా.. ప్రస్తుతం రెవెన్యూ డివిజన్ల వారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని టీఎన్జీవో భవనం, జహీరాబాద్‌, నారాయణ్‌ఖేడ్‌, అందోల్‌-జోగిపేట ఆర్డీవో కార్యాలయాలు, మెదక్‌లో ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల, నర్సాపూర్‌, తూప్రాన్‌ ఆర్డీవో కార్యాలయాలు, సిద్దిపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గజ్వేల్‌ ఆర్డీవో కార్యాలయంలో కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకోవచ్ఛు

Read latest Medak News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని