logo
Published : 29/11/2021 01:32 IST

నిర్లక్ష్యం వీడాలి.. స్ఫూర్తి చాటాలి..

మొదటి డోసు వ్యాక్సినేషన్‌ 92 శాతం పూర్తి

రెండో డోసు 51 శాతమే..
ఆసక్తి చూపని వారు వేలల్లో..

న్యూస్‌టుడే, సిద్దిపేట టౌన్‌

‘డిసెంబరు నెలాఖరుకు శతశాతం కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ పూర్తి చేయండి. అందుకు ప్రతి ఒక్కరు దీక్షతో పని చేయాలి. ప్రజలకు అవగాహన పెంచి టీకా తీసుకునేలా ప్రేరణ కల్పించాలి..’
 

- ఇటీవల వైద్యాధికారులతో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు.

జిల్లాలో గణాంకాల ప్రకారం.. మొదటి డోసు తీసుకోని వారి సంఖ్య 52,262గా ఉంది. రెండో డోసుకు అర్హత సాధించిన వారు సుమారు 30 వేల మంది ఉండగా.. ఆసక్తి చూపకపోవడం గమనార్హం. అనారోగ్య సమస్యలు మినహాయిస్తే.. వివిధ అపోహలు, వేడుకల పేరిట పలువురు వాయిదా వేస్తున్నారు. ఇతర దేశాల్లో కొత్తరకాల వేరియంట్లు ప్రభావం చూపుతున్న తరుణంలో ప్రతి ఒక్కరు అప్రమత్తమై వ్యాక్సిన్‌ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మూడో దశ వైరస్‌ ఉద్ధృతిపై భిన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో అప్రమత్తత అనివార్యం.

కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలంటే.. స్వీయ జాగ్రత్తలు అవశ్యం. ఇదే క్రమంలో వైరస్‌ను అడ్డుకొని పోరాడాలంటే టీకా అనివార్యం. ఈ నేపథ్యంలో జిల్లాలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిరంతరం సాగుతున్నా.. కొందరు ఆసక్తి చూపడం లేదు. జిల్లాలో మొదటి డోసు వ్యాక్సినేషన్‌ 92 శాతం పూర్తయింది. రెండో దశ.. 51 శాతానికి చేరింది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి టీకా తీసుకోవడం ద్వారా శతశాతం లక్ష్యాన్ని చేరే అవకాశం ఉంటుంది. మొత్తంగా ఇప్పటి వరకు జిల్లాలో 9,58,725 డోసులను వైద్యారోగ్య సిబ్బంది ప్రజలకు పంపిణీ చేశారు.  

గత ఏడాది మార్చి నుంచి మహమ్మారి వ్యాప్తి మొదలైన విషయం తెలిసిందే. జిల్లాలో కరోనా వైరస్‌ బారినపడిన అనేక కుటుంబాలు కకావికలమయ్యాయి. పలువురు తిరిగిరాని లోకాలకు చేరారు. ఈ తరుణంలో ప్రభుత్వం టీకా పంపిణీ చేపట్టింది. మొదటి డోసు పంపిణీలో జిల్లా అగ్ర భాగాన నిలిచింది. టీకా తీసుకునేందుకు అర్హులుగా.. మొత్తంగా 6,87,312 మంది ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ అంచనా వేసింది. ఈ లెక్కన మొదటి డోసును 6,35,050 మందికి పంపిణీ చేశారు. కొవాగ్జిన్‌ 28 రోజులు, కొవిషీల్డ్‌ 84 రోజుల తరువాత రెండో డోసు ఇవ్వాల్సిందిగా వైద్యారోగ్య శాఖ సూచించడంతో ఆ మేరకు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు రెండో డోసును 3,23,675 మంది పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం జిల్లాలో మొదటి డోసుగా కొవిషీల్డ్‌ టీకాను పంపిణీ చేస్తున్నారు.

అలక్ష్యంతో నష్టం తప్పదు..
జిల్లాలో గతంతో పోల్చితే కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. సగటున రోజుకు 1500 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. నిత్యం నలుగురు పాజిటివ్‌ బారినపడుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి 25వ తేదీ వరకు.. 30268 మంది వైరస్‌ వలలో చిక్కుకున్నారు. అందులో 30,050 (99.3 శాతం) మంది కోలుకున్నారు. ప్రస్తుతం 58 పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారు స్వీయ గృహ నిర్బంధంలో ఉన్నారు. వైరస్‌ ప్రభావంతో ఈ ఏడాది జనవరి నుంచి మొత్తం 160 మంది చనిపోయారు. ప్రస్తుతం జిల్లాలో 40 కేంద్రాల్లో నిర్ధారణ పరీక్షలు కొనసాగుతున్నా పలువురు కనీస నిబంధనలు పాటించడం లేదు. మాస్కుధారణ విస్మరిస్తున్నారు. టీకాను తీసుకోకపోగా.. వేడుకల్లో యథేచ్ఛగా పాల్గొంటున్నారు. భౌతిక దూరం విస్మరిస్తుండటం గమనార్హం. నిర్లక్ష్యం కారణంగా మనతో పాటు చుట్టుపక్కల వారికి నష్టం తప్పదని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు.  

200లకు పైగా కేంద్రాల్లో..
జిల్లాలో పట్టణాలు, గ్రామాల్లో శతశాతం లక్ష్యం చేరేందుకు పలు దఫాలుగా అధికార యంత్రాంగం సర్వే చేపట్టిన విషయం తెలిసిందే. తద్వారా ఇళ్లిళ్లూ తిరిగిన వివిధ విభాగాల సిబ్బంది మొదటి, రెండో డోసు తీసుకోవాల్సిన వారి వివరాలను సేకరించారు. పలు దశల్లో అవగాహన కల్పించారు. అయినా వేల సంఖ్యలో టీకా తీసుకోకపోవడం చర్చకు దారితీస్తోంది. జిల్లా వ్యాప్తంగా 200కి పైగా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ కొనసాగుతోంది.

Read latest Medak News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని