logo
Published : 29/11/2021 01:31 IST

ఈ-సైకిల్‌.. పర్యావరణ హితం

ఇంధనం ఆదాకు తోడ్పాటు
రూపొందించిన ఇంజినీరింగ్‌ విద్యార్థులు
న్యూస్‌టుడే, నర్సాపూర్‌

ఇంజినీరింగ్‌ విద్యార్థులు తయారు చేసిన ఈ-సైకిల్‌

దేశంలో వాహన కాలుష్యాన్ని తగ్గించి వాతావరణాన్ని కాపాడేందుకు ఇప్పటికే ప్రభుత్వాలు ఎన్నో చర్యలు చేపట్టాయి. ప్రస్తుతం నిత్యం ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులు ఎలక్ట్రిక్‌ కారు, ఆటో, ద్విచక్ర వాహనాలపై దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో సామాన్యుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని తక్కువ ధరకు ఈ-సైకిల్‌ రూపొందించాలన్న సంకల్పంతో మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లోని బీవీఆర్‌ఐటీ కళాశాలకు చెందిన పలువురు విద్యార్థులు అడుగేసి విజయం సాధించారు.
కళాశాలకు చెందిన పలు విభాగాల విద్యార్థులు.. అధ్యాపకులు, పూర్వ విద్యార్థుల సహకారంతో ఈ-సైకిల్‌ను తయారు చేశారు. చందన్‌, లలిత, తివిక్రమ్‌ (మెకానికల్‌), వినీత, నవిత, పవన్‌, అఖిల్‌ (ఈఈఈ), పూర్వ విద్యార్థులు దీపేశ్‌కుమార్‌, సందీప్‌కుమార్‌, విభాగ అధిపతి రాయుడు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ రాంచందర్‌ ఇందులో భాగస్వాములయ్యారు. కళాశాలలోని ప్రత్యేక ప్రయోగశాల దీనికి వేదికగా మారింది. రెండేళ్ల పాటు శ్రమించి దీన్ని ఆవిష్కరించారు. ప్రస్తుతం దాన్ని మార్కెట్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు.

తక్కువ బరువుతో..
ఈ-సైకిల్‌ బరువు 22 నుంచి 25 కిలోలే. బయట మార్కెట్లో ఆరు వేలకు సైకిల్‌ను కొనుగోలు చేసి దాన్ని మార్చేశారు. భవిష్యత్తులో మరింత బరువు తక్కువతో ఉండే వాటిని రూపొందించే ఆలోచనలో ఉన్నారు. 36 హోల్టుల, 7.5 ఏహెచ్‌ బ్యాటరీలను అమర్చారు. 36 వోల్టుల, 250 వోల్టుల మోటార్లు, 36 వోల్టుల, 17 యాంప్స్‌ కంటోల్రర్‌ బిగించారు.

రూ.8... 60 కి.మీ.
రెండున్నర గంటల ఛార్జి చేస్తే 60 కి.మీ. ప్రయాణం సాగించవచ్చు. ఒక్కసారి ఛార్జి చేయడానికి రెండు యూనిట్ల విద్యుత్తు అవసరం ఉంటుంది. యూనిట్‌కు రూ.4 చొప్పున, రెండు యూనిట్లకు రూ.8 ఖర్చవుతుంది. మధ్యలో ఎక్కడైనా ఆగినా దానికుండే పైడిల్‌ సాయంతో తొక్కుకుంటూ గమ్యస్థానానికి చేరుకోవచ్చు. మొత్తంగా దీన్ని రూ.22 వేలకే తయారు చేశారు. స్పీడో మీటరునూ అమర్చారు.

కళాశాలలో వినియోగం..
విద్యార్థులు రూపొందించిన మూడు ఈ-సైకిళ్లను బీవీఆర్‌ఐటీలో ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నారు. ఇటీవల వాటిని ప్రదర్శించారు. కళాశాల ఛైర్మన్‌ కె.వి.విష్ణురాజు, కార్యదర్శి ఆదిత్యావిస్సం, వైస్‌ఛైర్మన్‌ రవిచంద్రన్‌రాజగోపాల్‌, ప్రిన్సిపల్‌ డాక్టర్‌ లక్ష్మీప్రసాద్‌, హెచ్‌వోడీ రాయుడు దానిపై ప్రయాణించి సంతోషం వ్యక్తం చేశారు. ప్రత్యేక స్టేషన్‌ ఏర్పాటుచేసి ఛార్జింగ్‌ సదుపాయం కల్పించారు. కళాశాలలో చదివే విద్యార్థులు గుర్తింపు కార్డు చూపినా, మొబైల్‌ ఆప్లికేషన్‌ ద్వారా ఈ-సైకిల్‌ను ఇస్తున్నారు. ఇప్పటివరకు 10 సైకిళ్ల వరకు రూపొందించి విక్రయించారు. మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు ఏఆర్‌ఏఐ (ఆటోమోటీవ్‌ రీసెర్చ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా) అనుమతికి ఎదురు చూస్తున్నారు.


అందరికీ సౌకర్యంగా..: రాంచందర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌
రద్దీగా ఉండేే పట్టణాల్లో తిరగడానికి, ఈ-సైకిల్‌ ఎంతో సౌకర్యంగా ఉంటుంది. మహిళలు, పురుషులు, యువకులు, విద్యార్థులు వారి అవసరాలు తీర్చుకునేందుకు వీలుంటుంది. బరువు తక్కువగా ఉండటం వల్ల నడపడం చాలా సులువుగా ఉంటుంది. వ్యాయామానికి ఉపయోగించుకోవచ్చు.


వినియోగం సులభం: దీపేశ్‌కుమార్‌
కరెంటుతో నడుస్తుంది. నెమ్మదిగా వెళ్తుంది. తక్కువ ఖర్చు. అందులోనూ పర్యావరణ హితం కావడంతో యువత, విద్యార్థులు వీటిని ఎక్కువగా ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. దీన్ని నడిపే వారికి ఎలాంటి లైసెన్సుల అవసరం ఉండదు. రిజిస్ట్రేషన్‌, బీమా, కాలుష్య ధ్రువీకరణ పత్రాలు లేకుండానే ప్రయాణం సాగించవచ్చు. చలానాలా సమస్యలు ఉండవు.


కాలుష్యం సమస్య ఉండదు: సందీప్‌కుమార్‌
పర్యావరణ రక్షణే కాకుండా పెట్రోలు వినియోగం తగ్గించడానికి దోహదపడుతుంది. ధ్వని, వాయు కాలుష్యం ఉండదు. వేగంగా వెళ్లే వీలుండదు. ప్రమాదాలు జరిగే ఆస్కారం తక్కువే. వేల రూపాయలు ఆదా అవుతాయి. మరమ్మతులు, సర్వీసింగ్‌ జోలికి వెళ్లాల్సిన అవసరం ఉండదు.

Read latest Medak News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని