logo
Published : 29/11/2021 01:31 IST

ప్రగతి చూపితే.. ప్రోత్సాహం వెన్నంటే

జాతీయ స్థాయిలో ఎంపికకు పంచాయతీల నుంచి దరఖాస్తుల స్వీకరణ
న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌, మనూరు

గౌసాబాద్‌లో ఇటీవల నిర్వహించిన గ్రామ సభ

పల్లెలు ప్రగతి బాటలో పయనిస్తేనే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. అత్యధిక మంది జనం గ్రామాల్లో నివాసం ఉంటుండటమే దీనికి కారణం. దీనిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పల్లెల పురోగతిపై దృష్టి సారిస్తున్నాయి. నెలనెలా నిధుల్ని విడుదల చేస్తున్నారు. వీటితోపాటు వివిధ పథకాలు, కార్యక్రమాల అమలులో ఆదర్శంగా నిలిచే పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అవార్డులను అందజేస్తోంది. పురస్కారాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతున్న నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ కథనం.

జిల్లాలో 647 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆయా గ్రామ పంచాయతీలకు ప్రతి నెలా జనాభాను బట్టి  ప్రభుత్వం పల్లె ప్రగతి కింద నిధులు మంజూరు చేస్తోంది. పన్నుల రూపంలోనూ ఆదాయం సమకూరుతోంది. కేంద్ర ప్రభుత్వం అందించే పురస్కారాలకు ఎంపికైతే మరిన్ని నిధులు దక్కించుకునేందుకు అవకాశం ఉంటుంది.

నాలుగు విభాగాల్లో పురస్కారాలు
పంచాయతీరాజ్‌ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పురస్కారాలు అందజేస్తోంది. ఎంపికైన పంచాయతీలకు రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు నిధులు అందుతాయి. నాలుగు కేటగిరీల్లో అవార్డులు అందజేస్తారు. దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ పంచాయత్‌ రాజ్‌ సశక్తి కరణ్‌ పురస్కార్‌, నానాజీ దేశ్‌ముఖ్‌ రాష్ట్రీయ గౌరవ్‌, చైల్డ్‌ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీ అవార్డులకు పంచాయతీలను ఎంపిక చేస్తోంది. అవార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు గ్రామ పంచాయతీలకే అవకాశం కల్పించారు. ఆన్‌లైన్‌లో డిసెంబరు 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

ఎలా నమోదు చేసుకోవాలంటే..
పురస్కారాల కోసం గ్రామ పంచాయతీలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. htttp:///panchayataward.gov.in  వెబ్‌సైట్‌లో సంప్రదించాల్సి ఉంటుంది. వెబ్‌సైట్‌లోకి వెళ్లి పురస్కార కేటగిరీని ఎంచుకోవాలి. ఇందులో ఉండే ప్రశ్నలకు సమాధానాలు పొందుపరచాల్సి ఉంటుంది. ముందుగా ఈ దరఖాస్తులు మండల స్థాయి అధికారుల లాగిన్‌లోకి, అక్కడి నుంచి జిల్లా పంచాయతీ అధికారి లాగిన్‌లోకి వెళతాయి. జిల్లా పంచాయతీ అధికారులు పరిశీలించి రాష్ట్ర పంచాయతీరాజ్‌ కమిషనర్‌ లాగిన్‌కు పంపుతారు.

అర్హతలు ఇలా..
గ్రామ సభల నిర్వహణ పక్కాగా ఉండాలి. సమస్యల పరిష్కారంపై చర్చ జరగాలి
పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుకు ప్రాధాన్యం ఇవ్వాలి
తడి, పొడి చెత్తను వేరుచేయడంతోపాటు డంపింగ్‌ యార్డులను ఎరువు తయారీ కేంద్రాలుగా తయారు చేయాలి
అట్టడుగు వర్గాలు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, వయోవృద్ధులకు సంబంధించి సామాజిక రంగంలో పనితీరు మెరుగ్గా ఉండాలి
ప్రకృతి వైపరీత్యాల సమయంలో విపత్తు నిర్వహణకు ప్రణాళిక తప్పనిసరి.
గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఆదాయం కనీసం 5శాతానికి పైగా పెరగాలి.
చిన్న పిల్లలకు వివిధ వ్యాధి నిరోధక టీకాలు వేయించే లక్ష్యాలు సాధించి ఉండాలి.


గడువులోపు స్పందిస్తే ప్రయోజనం: సురేష్‌ మోహన్‌, జిల్లా పంచాయతీ అధికారి
పురస్కారాల కోసం అర్హత గల గ్రామ పంచాయతీలు గడువులోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆదర్శంగా నిలిచే పంచాయతీలను పురస్కారాలకు ఎంపిక చేస్తారు. ప్రతి మండలం నుంచి అవార్డులకు దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహిస్తున్నాం. ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా అభివృద్ధికి బాటలు పడతాయి.

Read latest Medak News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని