logo
Published : 29/11/2021 01:31 IST

ఇరుకు గదులు.. అధ్వానంగా పరిసరాలు

మూత్రశాలలు లేక.. తాగునీరు రాక అవస్థలు
అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ తీరిదీ..
ఈనాడు, సంగారెడ్డి,  న్యూస్‌టుడే, కంది, న్యాల్‌కల్‌, జోగిపేట టౌన్‌

సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం బయ్యారంలోని అంగన్వాడీ కేంద్రంలో నాలుగేళ్ల చిన్నారి నిత్యశ్రీ గురువారం పాముకాటుకు గురైంది. మూత్రవిసర్జన కోసం పక్కనే ఉన్న పిచ్చిమొక్కలున్న ప్రాంతానికి వెళ్లడంతో పాము కాటేసింది. దెబ్బతగిలిందని భావించిన ఆయా కట్టుకట్టి చిన్నారిని నిద్రపుచ్చింది. టీచర్‌, ఆయా ఇద్దరూ కనీసం పాము కాటేసిన విషయాన్ని గుర్తించలేకపోయారు. దీంతో ఆ పసిపాప మృత్యువాతపడింది. ఈ క్రమంలో జిల్లాలోని కొన్ని కేంద్రాలను పరిశీలించగా.. అధ్వాన పరిస్థితులు కనిపించాయి. అద్దెగదుల్లో కొనసాగుతున్న చోట కనీస సౌకర్యాలు లేవు. మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక చిన్నారులు ఆరు బయటకు వెళ్లాల్సిన పరిస్థితి. ఇది ప్రమాదానికి కారణమవుతోంది. పిల్లలపై పూర్తిస్థాయిలో పర్యవేక్షణ కొరవడుతుండటంతోనూ ఇబ్బందుల ఎదురవుతున్నాయి. జిల్లాలో 1,504 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో సొంత భవనాలున్న వాటి సంఖ్య కేవలం 548 మాత్రమే. మిగతావి అద్దె లేదా ప్రభుత్వానికి చెందిన ఇతర భవనాల్లో నిర్వహిస్తున్నారు.


జోగిపేటలోని అంగన్వాడీ కేంద్రం ఇది. పక్కనే ముళ్లపొదలతో పాటు చెత్తాచెదారం ఉంది. విషసర్పాలు తరచూ అంగన్వాడీలోకి వస్తున్నాయి. ఇటీవలే నాలుగు పాములు ఇక్కడ కనిపించాయని స్థానిక టీచర్‌ వివరించారు. ఒసారి పెద్దపాము వస్తే.. ఒక వ్యక్తికి రూ.600 ఇచ్చి చంపించామన్నారు. కేంద్రానికి సమీపంలో పొదలు ఉండటం, వాటిని ఎవరూ తొలగించకపోవడంతో ఎప్పుడు ఏ విషసర్పం వస్తుందోనన్న భయంతో ఇక్కడి పిల్లలు గడుపుతున్నారు. సమస్య తీవ్రం కావడంతో పాత భవనంలో నుంచి ప్రస్తుతం పక్కనే ఉన ప్రాథమిక పాఠశాలలోకి కేంద్రాన్ని మార్చారు. అయినా సమస్య తీరలేదు.


కంది మండలం చిమ్నాపూర్‌లోని అంగన్వాడీ కేంద్రం. సొంత భవనం లేకపోవడంతో పెంకుటిల్లును అద్దెకు తీసుకున్నారు. వర్షాలకు కురుస్తుండటంతో పైన తాటిపత్రి కప్పారు. తలుపులు సరిగా లేవు. దీంతో పాములు, ఎలుకలు, ఇతరత్రా విషపు పురుగులు రాత్రి వేళల్లోనూ లోనికి వచ్చే అవకాశం ఉంది.


కనీస సౌకర్యాలు కరవు..
చాలా వరకు అద్దె గదులు, ఇతర ప్రభుత్వ భవనాల్లో నడుస్తుండటంతో సదుపాయాల లేమి స్పష్టంగా కనిపిస్తోంది. అద్దెకు తీసుకున్న వాటిలో దాదాపు ఎక్కడా మూత్రశాలలు, మరుగుదొడ్లు లేవు. దీంతో కాలకృత్యాలు తీర్చుకునేందుకు పిల్లలను బయటకు పంపిస్తున్నారు. సమీపంలో ఉన్న పొదల వద్దకు వీరు వెళుతున్న క్రమంలో ప్రమాదాల బారిన పడే అవకాశాలు పెరుగుతున్నాయి. బయ్యారంలోని అంగన్వాడీ కేంద్రంలో దుర్ఘటన ఇలాగే జరిగింది. సొంత భవనాలున్న చోట మూత్రశాలలున్న చోట... నీటి సరఫరా ఉండటం లేదు. నాగాపూర్‌లోని అంగన్వాడీని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోనే నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఈ రెండింటికీ కలిపి మూత్రశాలు, మరుగుదొడ్లున్నాయి. నీటి సరఫరా సరిగా లేకపోవడంతో పాటు ఇవి పాడైపోవడంతో ఉపయోగించడం లేదని స్థానిక టీచరు వివరించారు. కొండాపూర్‌ మండలంలోని తొగర్‌పల్లిలో అద్దె భవనంలో నిర్వహించిన కేంద్రాన్ని ఇటీవలే గ్రంథాలయ సంస్థకు చెందిన భవనంలోకి తరలించారు. ఇక్కడా మూత్రశాలలు లేవు. నీళ్లు దూరం నుంచి తెచ్చుకోవాల్సిందే. న్యాల్‌కల్‌ మండల కేంద్రంలో నాలుగు అంగన్వాడీలున్నాయి. వీటిలో మూడు అద్దె ఇళ్లలో కొనసాగుతుండగా.. ఒకటి గ్రంథాలయానికి చెందిన గదిలో నడుస్తోంది. ఇక్కడా కనీస సదుపాయాలు లేవు. దీంతో చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా 75 చోట్ల కొత్త భవనాలు నిర్మించాలని ప్రతిపాదించారు. స్థలాలూ గుర్తించారు. నిధుల కొరతతో ఇప్పటి వరకు వాటికి నిధులు మంజూరు కాలేదు. దీంతో అవస్థలు తప్పడం లేదు.


ది సదాశివపేట మండలం పెద్దాపూర్‌లోని అంగన్వాడీ కేంద్రం. జిల్లా పరిషత్తు పాఠశాల ప్రాంగణంలో ఉంది. పిల్లలు, గర్భిణులు, బాలింతలు కలిపి 39 మంది ఇక్కడ సేవలు పొందుతుంటారు. చిన్న పాటి గదిలోనే దీనిని కొనసాగిస్తుండటంతో ఇక్కట్లు తప్పడం లేదు. వంటకు, పాఠాలకు, చిన్నారుల బరువు తూచేందుకు.. ఇలా అన్నీ ఒకేచోట చేయాల్సి వస్తోంది. గది చాలా ఇరుకుగా ఉండటంతో ఇబ్బందులు పడుతున్నారు. మూత్రశాలలు అందుబాటులో లేవు.

Read latest Medak News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని