రెండేళ్ల విరామానికి తెర
మెదక్ మండలం పాతూర్ వద్ద కొనసాగుతున్న పనులు
న్యూస్‌టుడే, మెదక్, మెదక్ రూరల్: రెండేళ్ల తర్వాత అక్కన్నపేట-మెదక్ రైల్వే లైన్ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. 2019 నవంబర్‌లో పనులు నిలిచిపోగా కొద్దినెలల క్రితం మంత్రి హరీశ్‌రావు రైల్వే అధికారులతో సమీక్షించగా పనులు మొదలుపెట్టారు. మెదక్ పట్టణానికి రైలుకూతకు ఇక్కడి ప్రజలు ఏళ్లుగా ఎదురుచూస్తుండగా ప్రస్తుతం జరుగుతున్న పనులతో కొన్ని నెలల్లో కూత వినిపించే అవకాశం కనిపిస్తోంది. రామాయంపేట మండలం అక్కన్నపేట నుంచి మెదక్ పట్టణం వరకు 17.2 కి.మీల దూరం రైల్వే లైన్ పనులను 2015లో ప్రారంభించారు. నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తున్నాయి. ఇప్పటి వరకు కేంద్రం వాటా పూర్తిగా మంజూరు చేయగా, రాష్ట్ర ప్రభుత్వ వాటా మాత్రం మిగిలి ఉంది. ఇంకా రూ.40 కోట్లు విడుదల చేయాల్సి ఉండగా ఆలస్యం జరిగింది. దీంతో గుత్తేదారు పనులు నిలిపివేశారు. స్థానిక రైల్వేస్టేషన్లో నిర్మించిన గదుల్లో సామగ్రిని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడమే కాకుండా ఎత్తుకెళ్లారు. మెదక్ మండలం పాతూరు వద్ద మెదక్-రామాయంపేట ప్రధాన రహదారిపై నిర్మించిన వంతెన వరకు ట్రాక్ పనులు చేపట్టి వదిలివేయగా ప్రస్తుతం పాతూరు వద్ద ట్రాక్‌కు ఇరువైపులా రాతి కట్టడాన్ని నిర్మిస్తున్నారు. పట్టణ పరిధి అవుసులపల్లి వద్ద రెండు వంతెనలను ఇది వరకే నిర్మించగా వాటి మధ్య ట్రాక్ ఏర్పాటుకు ఎత్తు పెంచుతున్నారు.పాతూరు వంతెన నుంచి అవుసులపల్లి శివారు వరకు ట్రాక్ ఏర్పాటుకు సిమెంట్ దిమ్మెలు తెచ్చారు. 2.2 కి.మీల మేర ట్రాక్ పనులు పూర్తి చేస్తే రైలు నడిచేందుకు మార్గం సుగమం కానుంది. పనులు మధ్యలో నిలిపివేయకుండా నిరంతరాయంగా కొనసాగిస్తే మెతుకుసీమ వాసులకు రైలు కూత వినపడనుంది.
ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు/ సేవల గురించి ఈనాడు సంస్థకి ఎటువంటి అవగాహనా ఉండదు. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి, జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు/ సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు.