logo
Published : 29/11/2021 01:31 IST

క్రీడామైదానం... సదూరం

స్థలాలున్నా నిర్మాణాలు శూన్యం

న్యూస్‌టుడే, నర్సాపూర్‌, తూప్రాన్‌, రామాయంపేట

రామాయంపేటలో కేటాయించిన ప్రదేశం

జీవితంలో గెలుపోటములను ఒకే రీతిలో తీసుకునే లక్షణం.. శారీరక, మానసికోల్లాసం ఒక్క క్రీడలతోనే సాధ్యం. విద్యార్థి సర్వతోముఖాభివృద్ధిలో కీలక భూమిక పోషించే ఆటలు.. పాలకులు, అధికారుల నిర్లక్ష్యంతో దూరం అవుతున్నాయి. వారి భవితకు నిచ్చెనలా ఉపయోగపడాల్సిన క్రీడారంగం నిర్వీర్యమవుతోంది. స్ఫూర్తిని పెంచాల్సింది పోయి నిరుత్సాహపరుస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా నర్సాపూర్‌, తూప్రాన్‌, రామాయంపేట పురపాలికల్లో లఘు క్రీడామైదానాల ఏర్పాటు కలగా మారింది. ఆటగాళ్ల అవసరాలకు తగ్గట్లుగా సదుపాయాలు మచ్చుకైనా కనిపించడం లేదు. ప్రతిభావంతులైన ఎంతోమంది క్రీడాకారులకు ప్రోత్సాహమే కరవవుతోంది. వేరే చోట్ల శిక్షణ తీసుకొని జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో తమ సత్తా చాటుతున్నా ఇక్కడ సరైన సౌకర్యాలు లేక ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో పట్టణాల్లోని క్రీడా వ్యవస్థ దుస్థితిపై ‘న్యూస్‌టుడే’ పరిశీలన కథనం.

పొదల్లో స్టేడియం నిర్మాణానికి వేసిన శిలా ఫలకం

శిలాఫలకం దాటని పనులు...
నర్సాపూర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడా మైదానంలో 2013 డిసెంబరు 30న లఘు క్రీడా మైదానం, ఇండోర్‌ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తొమ్మిదేళ్లుగా పనులు శిలా ఫలకానికే పరిమితం చేశారు. ఇండోర్‌ స్టేడియం నిర్మాణానికి రూ.60 లక్షలు నియోజకవర్గ అబివృద్ధి నిధులు, లఘు క్రీడా మైదానం నిర్మాణానికి రూ.2.10 కోట్లు యువజన సర్వీసులు క్రీడల శాఖ నుంచి కేటాయించారు. అయినా ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడం గమనార్హం. రెవెన్యూ అధికారులు స్థలాలు చూపకపోవడమూ దీనికి ఓ కారణమనే చెప్పాలి. వచ్చిన నిధులు ఏమయ్యాయో ఎవరికీ తెలియడం లేదు. పట్టణ ప్రగతిలో భాగంగా లఘు క్రీడా మైదానం నిర్మాణానికి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానాన్ని పరిశీలించారు. స్థలం అనుకూలంగా ఉందని, ఇక్కడే నిర్మాణం చేపడతామని అప్పట్లో అధికారులు ప్రకటించారు. 2020 జూన్‌ 20న నర్సాపూర్‌లో హరితహారం ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, పుర అధ్యక్షుడు మురళీయాదవ్‌ విన్నపం మేరకు నర్సాపూర్‌లో అభివృద్ధి పనులకు రూ.25 కోట్లు కేటాయించారు. అందులో నుంచి రూ.2 కోట్లు క్రీడా మైదానాలకు కేటాయించగా ఏడాది అవుతున్నా అతీగతి లేదు. లఘు క్రీడా మైదానంతో పాటు ఇండోర్‌ స్టేడియం, ప్రజా వ్యాయామశాల, 500 మీటర్ల మేర వాకింగ్‌ ట్రాక్‌ నిర్మాణం చేపట్టాల్సి ఉంది.

నర్సాపూర్‌లోని క్రీడా మైదానం

కనీస వసతులు లేక
రామాయంపేట పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్‌ కళాశాలను అనుకుని ఉన్న మైదానమే ప్రస్తుతం ఆటలు ఆడేందుకు ఉపయోగ పడుతోంది. ఇక్కడ కనీస వసతులు లేక ఇబ్బందులు తప్పడం లేదు. మినీ స్టేడియం ఏర్పాటుకు పట్టణవాసుల విన్నపం మేరకు జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిని కొన్నేళ్ల కిందట పరిశీలించారు. దాన్ని చదును చేశారు. ఇక ఆ తర్వాత అంతే సంగతులు. అధికారులను అడిగినా వృథా ప్రయాసే అవుతోంది. స్థానికంగా ప్రతిభావంతులు ఎంతో మంది ఉన్నా వారికి ఎదురుచూపులు తప్పడం లేదు. ఇక్కడి నుంచి జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపుతున్న వారెంతో మంది ఉన్నారు. వారంతా దూర ప్రాంతాలకు వెళ్లి శిక్షణ తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

అల్లాపూర్‌లో ప్రతిపాదిత స్థలం

హామీలకే పరిమితం..
తూప్రాన్‌లోనూ క్రీడా మైదానం హామీలకే పరిమితమైంది. సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చి మూడేళ్లు గడుస్తున్నా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. అప్పట్లో తూప్రాన్‌ పట్టణంలో ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చిన సమయంలో సీఎం లఘు క్రీడా మైదానాన్ని ప్రకటించారు. ఇందుకు అవసరమైన మేర నిధులు కూడా కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో అధికారులు అల్లాపూర్‌ శివారులో ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. ఆ తర్వాత ఎవరూ పట్టించుకోకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. స్థానికంగా ఎంతో మంది ప్రతిభ ఉన్న ఆటగాళ్లు ఉన్నారు. వారికి సరైన ప్రోత్సాహం, వసతులు లేక నీరుగారిపోతున్నారు. కొందరు ప్రైవేటు భవనాలను అద్దెకు తీసుకుని ఆటల్లో శిక్షణ తీసుకుంటున్నారు. మరికొందరు మైదానాలు లేక ఇళ్లకే పరిమితం అవుతున్నారు.


నిధుల సమస్య లేదు..
నాగరాజు, జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి

స్టేడియాల నిర్మాణానికి అనువైన స్థలాలు ఉంటే ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. నర్సాపూర్‌లో మినీ స్టేడియానికి రూ.2.05 కోట్ల నిధులున్నా స్థలం సమస్యతో ముందుకు సాగడం లేదు. పాలనా అనుమతులు కూడా వచ్చాయి. స్థలం కేటాయించాలని పాలనాధికారి ద్వారా సంబంధిత ఆర్డీవోకు లేఖ పంపించాం. అయినా ఎలాంటి చర్యలు లేవు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలోని స్థలం సరిపోదు. రామాయంపేటలోనూ నిర్మాణానికి ప్రతిపాదన ఉంది. తూప్రాన్‌ది సైతం పరిశీలనలో ఉంది.

Read latest Medak News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని