logo
Updated : 26 Dec 2021 15:43 IST

ఎనిమిది గంటల ఉత్కంఠ

పర్యవేక్షణ లోపంతో పోయిన మరో ప్రాణం
న్యూస్‌టుడే, దుబ్బాక, సిద్దిపేట టౌన్‌, రామాయంపేట

వ్యవసాయ బావి వద్ద సహాయక చర్యల్లో ఎమ్మెల్యే రఘునందన్‌రావు, అధికారులు, గజ ఈతగాళ్లు, స్థానికులు

బావిలో పడిపోయిన కారులో ఎందరున్నారు.. వారెవరనే ఉత్కంఠ.. సహాయ కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్న, చూస్తున్న వారిలో అనూహ్య పరిణామంగా గజ ఈతగాడు కూడా నీట మునిగి చనిపోయాడనే విషయం ఆలస్యంగా తెలిసి.. ఒక్కసారిగా అంతా హతాశులయ్యారు. ప్రమాద ఘటనలో చోటు చేసుకున్న ఈ దుర్ఘటన స్థానికుల ఆందోళనకు దారి తీసింది. మధ్యాహ్నం నుంచి రాత్రి 11 గంటల వరకు దుబ్బాక మండలం చిట్టాపూర్‌ శివారు ఉత్కంఠకు వేదికైంది. సర్వత్రా చర్చనీయాంశమైంది. మరోవైపు రెండు కుటుంబాల్లో పెను విషాదం అలుముకుంది. కారు బావిలో పడిపోయిందనే విషయం గ్రహించిన గ్రామస్థులు, పోలీసులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు సహాయ చర్యలను ముమ్మరం చేశారు. ఈ మార్గంలో నిత్యం వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ ఘటనతో వేల సంఖ్యలో జనం గుమికూడారు. సహాయక చర్యలకు విఘాతం కలగడంతో ఒకానొక దశలో పోలీసులు వారిని చెదరగొట్టారు. క్షణక్షణం.. ఏం జరుగుతుందా అని ఎదురుచూశారు. క్రేన్ల సాయంతో గజ ఈతగాళ్లు కారును వెలికి తీసే క్రమంలో పలుమార్లు పట్టు తప్పింది. బావిలో దాదాపు 10 అడుగుల మేర నీటిని తోడివేసిన తరువాత రెండు మృతదేహాలతో కూడిన కారును వెలికితీశారు. ఎనిమిది గంటల తరువాత వెలికతీత ప్రక్రియ ముగిసింది. సహాయక చర్యలో పాల్గొన్న గజ ఈతగాడు నర్సింలు శవంగా తేలడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. ఆయన తరఫు వారు రాత్రి పొద్దుపోయే వరకు రహదారిపై బైఠాయించి నిరసన కొనసాగించారు. స్థానిక ఎమ్మెల్యే, ఏసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇరువురు ఘటనా స్థలికి రావాలని, రూ.50 లక్షల పరిహారం చెల్లించి రెండు పడక గదుల ఇంటిని కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఎనగుర్తి సర్పంచి శంకరయ్య బాధిత కుటుంబానికి మద్దతు పలికారు. అదనపు డీసీపీ శ్రీనివాసులు పలు దశల్లో చర్చలు చేపట్టారు. ఈ దుర్ఘటనపరంగా చూస్తే.. అధికార యంత్రాంగం చివరి వరకు నీట మునిగిన కారును తీయాలనే సంకల్పం తప్ప గజ ఈతగాళ్లు ఎవరు, ఎంతమంది వచ్చారు..? పర్యవేక్షించే వారు లేకపోవడం గమనార్హం. ఓ గజ ఈతగాడు చనిపోయిన విషయం కారు వెలికితీసే వరకు తెలియక పోవడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి.

కారులో లక్ష్మి, ప్రశాంత్‌ల మృతదేహాలు

కళ్ల ముందే బావిలోకి..: మల్లేశం, రైతు, ఎనగుర్తి
నేను వ్యవసాయం చేస్తుంటా. వ్యక్తిగత పని నిమిత్తం చిట్టాపూర్‌ వైపు వచ్చా. తిరిగి మా గ్రామానికి వెళ్తుండగా.. కళ్ల ముందే ఓ కారు బావిలో పడిపోవడం చూశా. ఆ దారి వెంట వెళ్తున్న ఇతర వాహన చోదకులకు నిలువరించి విషయం చెప్పా. అందరం కలిసి ఆలస్యం చేయకుండా పోలీసులకు సమాచారం చేరవేశాం. వారు త్వరగానే చేరుకున్నారు. కానీ కారులో ఇద్దరు, సాయం చేసిన మరొకరు చనిపోవడం బాధగా ఉంది.

రోదిస్తున్న నర్సింలు కుటుంబీకులు

దురదృష్టకరం: రఘునందన్‌రావు, ఎమ్మెల్యే, దుబ్బాక
ఈ సంఘటన దురదృష్టకరం. చివరి వరకు తీవ్రంగా ప్రయత్నం చేశాం. ఫలితం లేకపోయింది. తల్లీకొడుకుతో పాటు సహాయక చర్యల్లో పాల్గొన్న గజ ఈతగాడు చనిపోవడం కలచివేసింది. పోలీసులు, అగ్నిమాపక శాఖ, ఇతర శాఖల అధికారులు సహా ప్రజలు సహాయక చర్యల్లో భాగస్వాములయ్యారు. అన్ని రకాలుగా శ్రమించాం. బాధిత కుటుంబాల బాధ వర్ణించలేనిది.


విలపిస్తున్న లక్ష్మి కుటుంబ సభ్యులు

సిబ్బందికి సూచనలు చేస్తున్న ఏసీపీ దేవారెడ్డి
Read latest Medak News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని