logo
Updated : 02/12/2021 05:56 IST

సాగు భిన్నం.. లాభాలు ఘనం.!

ఆదర్శంగా నిలుస్తున్న రైతులు

ఈనాడు డిజిటల్‌, సిద్దిపేట - న్యూస్‌టుడే, ములుగు, దౌల్తాబాద్‌

వంగ తోటలో స్టీవెన్‌రెడ్డి దంపతులు

సంప్రదాయ పంటలతో పోలిస్తే.. ఉద్యానపంటలతో అధికలాభాలు వస్తుండటంతో అన్నదాతలు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం వరికి ప్రత్యామ్నాయంగా పంటలు వేసుకోవాలని సూచిస్తుండంతో మరింత మంది ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో కూరగాయలతో పాటు కొత్తరకం పంటల వైపు మళ్లుతున్నారు. జిల్లాలో మొత్తంగా 27,271 హెక్టార్లలో వివిధ ఉద్యానపంటలు సాగవుతున్నాయి. ఈక్రమంలో రూ.లక్షల్లో ఆదాయం గడిస్తున్న కొందరు ఆదర్శరైతుల గురించి తెలుసుకుందాం.
 


జామ.. బీర.. కాకర..

బీర తోటలో రాజిరెడ్డి

దుబ్బాక మండలం చెల్లాపూర్‌ గ్రామానికి చెందిన అమ్మన రాజిరెడ్డి.. కొండపాక మండలం బంధారం- అంకిరెడ్డిపల్లి గ్రామాల మధ్యన పంటలు పండిస్తున్నారు. 12 ఎకరాల్లో జామతోట, 8 ఎకరాల విస్తీర్ణంలో మొక్కజొన్న, బూడిద, ఎర్రగుమ్మడి సాగుచేస్తున్నారు. ఇవికాకుండా ఆరున్నర ఎకరాల్లో ఒక్కో పందిరి చొప్పున మొత్తం 20 ఎకరాల్లో మూడు పందిర్లు వేశారు. అందులో ఐదెకరాల్లో బీర, కాకర వంటి తీగజాతి కూరగాయలు పండిస్తున్నారు. ఈ రెండు పంటలు కలిపి ఎకరాకి 15 టన్నుల వరకు దిగుబడి సాధిస్తున్నారు. మార్కెట్‌లో ఈ కూరగాయలు కిలో రూ.15 నుంచి రూ.20 వరకు ధర పలుకుతుండగా.. మొత్తంగా ఐదెకరాలకు ఖర్చులు పోను రూ.8 లక్షల వరకు ఆదాయం వస్తోంది. జామతోట నుంచి ఏటా ఎకరానికి 5 టన్నుల వరకు దిగుబడి తీస్తున్నారు. దీనిద్వారా దాదాపు ఎకరానికి రూ.2లక్షల చొప్పున సాగుఖర్చులు పోను ఏడాదికి రూ.20 లక్షలు సంపాదిస్తున్నారు. వీటిని 75 శాతం సేంద్రియ విధానంలోనే పండిస్తుండటం విశేషం. 2017లో జిల్లాస్థాయి ఉత్తమ రైతుగా ఎంపికయ్యారు.  


కుప్పం నుంచి తీసుకొచ్చి..

దౌల్తాబాద్‌ మండలం శౌరీపూర్‌ గ్రామానికి చెందిన దంపతులు స్టీవెన్‌రెడ్డి, అన్నామేరీ.. ఐదెకరాల్లో కూరగాయల సాగుచేస్తున్నారు. ప్రతి ఏటా పంటమార్పిడి పద్ధతిలో విభిన్న రకాల కూరగాయలు పండిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది కొత్తగా చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతం నుంచి హైబ్రిడ్‌ వంకాయ మొక్కలను తీసుకొచ్చి.. ఈ ఏడాది జూన్‌లో నాటారు. నాటిన మూడు నెలల నుంచి దిగుబడులు వస్తున్నాయి. సాధారణ రకం వంకాయ పంటకాలం ఆరునెలలు. హైబ్రిడ్‌ వంకాయ మొక్క ఒకసారి నాటితే రెండేళ్ల వరకు దిగుబడులు వస్తూనే ఉంటాయని రైతుదంపతులు చెబుతున్నారు. దాదాపు వారానికి ఐదురోజుల పాటు కాతలు ఉంటాయి. ప్రస్తుతం మూడు నెలల నుంచి వారానికి 4 టన్నుల వరకు దిగుబడి వస్తోంది.  బోయిన్‌పల్లి మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. కిలో రూ.20 చొప్పున ధర పలుకుతుండటంతో.. మూడునెలల కాలంలో.. రూ.12 లక్షలు వచ్చాయి. సాగుఖర్చు రూ.5 లక్షల పోను రూ.7 లక్షల మేర ఆదాయం సమకూరిందని వారు చెబుతున్నారు.


అరెకరం కౌలుకు తీసుకుని..

బాలనర్సయ్య సాగుచేస్తున్న డ్రాగన్‌ ఫ్రూట్‌ పంట

డ్రాగన్‌ఫ్రూట్‌ సాగు చేస్తూ.. రూ.వేలల్లో ఆదాయం సంపాదిస్తున్నారు ములుగు మండలం మామిడ్యాలకు చెందిన యువరైతు దాచారం బాలనర్సయ్య. కొండపోచమ్మసాగర్‌ జలాశయ నిర్మాణంలో భాగంగా తన మూడెకరాల వ్యవసాయ భూమిని కోల్పోయారు. జలాశయం పక్కనే అరెకరం భూమిని కౌలుకు తీసుకున్నారు. ఏడాదిన్నర క్రితం రూ.2.5లక్షల పెట్టుబడితో డ్రాగన్‌ఫ్రూట్‌ సాగు ప్రారంభించారు. రెండు నెలల వ్యవధిలో దాదాపు ఐదుసార్లు 5 క్వింటాళ్ల వరకు దిగుబడి సాధించారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ పండ్ల ధర కిలో రూ.100 నుంచి 200 వరకు పలుకుతుండగా.. రెండు నెలల వ్యవధిలో రూ.60 నుంచి రూ.70 వేల ఆదాయం సమకూర్చుకున్నారు. కొందరు నేరుగా రైతు వద్దకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు.  ఐదేళ్ల వరకు పంట ఉంటుందని.. రానున్న రోజుల్లో దిగుబడి మరింత పెరుగుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 12 ఎకరాల్లో ఈ పంట సాగవుతుందని ఉద్యాన అధికారులు చెబుతున్నారు. 

Read latest Medak News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని