ఇంధన ధరలకు రెక్కలు..పరిశ్రమలకు చిక్కులు
న్యూస్‌టుడే, జిన్నారం
ఐడీఏ బొల్లారంలోని పరిశ్రమ
* గత ఏడాది నవంబరులో పెట్రోలు లీటరు రూ.84.35 ఉండగా.. ప్రస్తుతం రూ.109కు చేరింది. అదే సమయంలో డీజిల్ రూ.76.92 ఉండగా ఇప్పుడు రూ.95కు చేరింది.
* ఐడీఏ బొల్లారంలోని ఓ ఇంజినీరింగ్ పరిశ్రమ ఎప్పుడూ భారీగా ఆర్డర్లు... ఉత్పత్తులతో కళకళలాడేది. పెట్రో ధరలు భారంగా మారాయనే కారణంతో ఉత్పత్తులను తగ్గించింది. వారం వారం నిర్వహణపరమైన మరమ్మతుల కోసం విద్యుత్ కోతలు అమలు చేసినా.. జనరేటర్‌ను వినియోగించి పరిశ్రమను నడిపేవారు. ఆరు నెలలుగా జనరేటర్ల జోలికి వెళ్లడం లేదు. డీజిల్ ధర పెరగడమే ఇందుకు కారణం.
* ఖాజీపల్లిలోని ఓ పరిశ్రమ కార్మికులు, ఇతర ఉద్యోగులను తరలించేందుకు 25 వాహనాలు నడిపేది. ఇప్పుడా సంఖ్య పదికి చేరింది. ఎలాగోలా సర్దుకుపోండని కార్మికులకు సర్దిచెప్పింది.
* ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడ నుంచి ఉదయం 6 గంటల షిఫ్టునకు సుమారు 75 ఆటోలు వివిధ పరిశ్రమలకు వెళ్లేవి. ఇందుకు నెలకు ఇంతని కిరాయి ఇచ్చేవారు. ఇప్పుడు ఆ ఆటోలు చాలా వరకు తగ్గాయి.
పరిశ్రమల యాజమాన్యాలు సాధారణంగా ఆదాయ వ్యయాలను బేరీజు వేసుకొని నిర్వహణను కొనసాగిస్తుంటారు. దీనిని బట్టే వస్తు ఉత్పత్తుల ధరలు నిర్ణయిస్తారు. పరిశ్రమ ఒక్కసారి ధర నిర్ణయిస్తే రెండు మూడేళ్ల వరకు అదే కొనసాగించాల్సి ఉంటుంది. ఏడాదిగా రోజు రోజుకు చమురు ధరలు పెరుగుతుండటంతో ఆదాయానికి, ఖర్చుకు వ్యత్యాసం చాలా పెరుగుతోంది. ఈ పరిస్థితితో లాభాలు తగ్గిపోతాయని..కొన్నిసార్లు నష్టాలు భరించాల్సి ఉంటోందని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి రసాయన పరిశ్రమలతో పాటు ఇంజినీరింగ్, ప్లాస్టిక్, కాగితం, వాహనాల విడిపరికరాలు, ఇనుము, వాహనాల తయారీ, రియాక్టర్ల తయారీ, క్యాస్టింగ్ తదితర పరిశ్రమల్లో నెలకొంది.
పెరుగుతున్న ముడి సరకు వ్యయం
ఇంధన ధరల ప్రభావం ముడి సరుకుపైనా పడుతోంది. గత ఏడాదితో పోలిస్తే దాదాపు 45 శాతం పెరిగినట్టు యాజమానులు అంటున్నారు. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చే సరకుల ధరలు గణనీయంగా పెరగడంతో కొన్ని చిన్న పరిశ్రమలు మూసివేసే దిశగా ఆలోచన చేస్తున్నాయని పేర్కొంటున్నారు. ముఖ్యంగా పెద్ద పరిశ్రమలకు అనుబంధంగా కొనసాగే యూనిట్ల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. బ్యాంకులకు రుణాలు చెల్లించలేకపోతున్నాయి. జిల్లాలోని ఐడీఏ బొల్లారం, ఖాజీపల్లి, గడ్డపోతారం, బొంతపల్లి, పటాన్చెరు, పాశమైలారం, ఇస్నాపూర్, చిట్కుల్, ముత్తంగి, రుద్రారం, అమీన్పూర్, బండ్లగూడ, హత్నూర, సదాశివపేట, సంగారెడ్డి, జహీరాబాద్ తదితర ప్రాంతాల్లోని పరిశ్రమలన్నీ ఇవేతరహా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి
- ఆనంద్‌రావు, పారిశ్రామిక సంఘం కార్యదర్శి, బొల్లారం
పరిశ్రమలపై ఇంధన ధరల ప్రభావం చాలా ఉంది. నెలవారీ ఖర్చును భరించలేక పోతున్నాం. కొన్ని ఉత్పత్తులను తగ్గించాయి. ఈ ప్రభావం కార్మికులపై పడే ప్రమాదం ఉంది. సమస్యను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలి. అధ్యయనం చేసి.. పరిష్కారానికి చొరవ చూపాలి.
జిల్లా పరిధిలో ఇలా..
భారీ పరిశ్రమలు 35
మధ్యతరహా.. 1860
సూక్ష్మ, చిన్నతరహా 5040
కార్మికులు 2.75లక్షలు