logo
Updated : 02 Dec 2021 05:55 IST

పరిశ్రమ కాలుష్యం చర్యలు ఆలస్యం..

 ప్రజల ఆరోగ్యాలకు ముప్పు

ఫిర్యాదులు వచ్చినపుడు పీసీబీ స్పందన

- న్యూస్‌టుడే, జిన్నారం, మనోహరాబాద్‌, హత్నూర, వికారాబాద్‌

గుండ్లమాచనూర్‌ శివారులో కలుషిత జలాలు

ఉత్పత్తి రంగానికి, ఉపాధి అవకాశాలకు అండాదండగా ఉండాల్సిన పరిశ్రమల్లో కొన్నిటి కారణంగా కాలుష్యం వెదజల్లి అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడుతోంది. దాని నివారణకు కాలుష్య నియంత్రణ మండలి ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఫిర్యాదులు వచ్చినపుడు మాత్రమే స్పందిస్తుండటంతో పరిశ్రమల యజమానులు నియంత్రణ చర్యలకు గండి కొడుతున్నారు. ఉన్నతస్థాయి నుంచి అధికారులపై ఒత్తిడి వచ్చినపుడు మాత్రం చిన్నపాటి పరిశ్రమలపై చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలను, పర్యావరణాన్ని అతలాకుతలం చేసే కాలుష్యాన్ని నియంత్రించే దిశగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేడు జాతీయ కాలుష్య నివారణ దినం సందర్భంగా ‘న్యూస్‌టుడే’ కథనం.

ఘాటు వాసన
పరిశ్రమల యాజమాన్యాలు, కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులు ఉదాసీనత వల్ల చుట్టుపక్కల నీటి వనరులు, నివాస ప్రాంతాలు విషమయం అవుతున్నాయి. సెలవు రోజుల్లో, రాత్రి సమయాల్లో వ్యర్థాలను ఇష్టారాజ్యంగా పారబోయడం, రసాయనాలను నీటి వనరుల్లోకి వదలడం చేస్తున్నారు. ఒక్కోసారి స్థానికులు గమనించి ఫిర్యాదు చేసినా స్పందన నామమాత్రంగా ఉంటుంది. చెరువుల్లో చేపలు వదిలేందుకు మత్స్యశాఖ అనుమతి లేదంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. పంట పొలాల్లో ఏ పంటలూ వేయలేక పడావు పెట్టాల్సి వస్తోంది. నీళ్లన్నీ రంగుగా మారుతున్నాయి. పారిశ్రామిక వాడల్లో ఎప్పుడూ ఘాటు వాసనలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాత్రిళ్లు సమస్య ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ప్రజారోగ్యం క్షీణిస్తుంది. శ్వాసోకోశ, ఆస్తమా, గుండె సంబంధ వ్యాధుల బారిన పడుతున్నారు. స్థానిక స్వచ్ఛంద సంస్థలతోపాటు గతంలో గ్రీన్‌పీస్‌ వంటి అంతర్జాతీయ సంస్థలు సైతం ఆందోళన వ్యక్తం చేశాయి. కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం, పీసీబీ, సంస్థలు సూచనలు చేసినా పరిశ్రమ యాజమాన్యాలు పక్కా చర్యలు తీసుకోవటం లేదు.

ఖాజీపల్లి కల్వర్టు వద్ద పారుతున్న కాలుష్య జలం

విస్తరణ, కొత్తవి ఏర్పాటుతో సమస్య
పాత పరిశ్రమల విస్తరణ, కొత్త పరిశ్రమల ఏర్పాటు వడివడిగా సాగుతున్నాయి. స్థానికులు బాధితులుగా మారుతున్నారు. జీవన విధానం, వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నీటి వనరుల్లో చేపలు మృత్యువాత పడి మత్స్యకారులకు నష్టం కలుగుతోంది. భూములు ఎందుకూ పనికి రాకుండా పోతున్నాయి. అమ్ముకుందామన్న ఎవరూ కొనడం లేదు. ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చినప్పుడు నామమాత్రపు తనిఖీలు చేయడం కాలుష్య జలాల నమూనాలను సేకరించడం పరిపాటిగా మారింది.

ఇవీ చర్యలు
మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలంలోని కాళ్లకల్‌ టీఎస్‌ఐఐసీ పారిశ్రామికవాడతో కలిపి గ్రామాల్లో సుమారు 150 భారీ, మద్య తరహ పరిశమ్రలు నెలకొని ఉన్నాయి. చెట్లగౌరారం, కాళ్లకల్‌లోని రెండు స్టీల్‌ పరిశ్రమల వల్ల భూగర్భ నీటితో పాటు, వాయు కాలుష్యం అవుతుంది. దీనిపై ఆయా గ్రామాల ప్రజల పోరాటాల మేరకు పరిశ్రమలు ప్రత్యేకంగా లక్షలు ఖర్చు చేసి కలుషిత నీటిని శుద్ది చేసి భూగర్భ జలాలు పాడవకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వాయు కాలుష్యం కాకుండా పొగగొట్టాలకు ప్రత్యేక జాలీలు ఏర్పాటు చేసి ఎత్తులో గొట్టాలు ఏర్పాటు చేస్తున్నారు. ముప్పిరెడ్డిపల్లిలో ఓ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమ వారు వ్యర్థాలను సమీపంలోని కుంటలో నీటిని పూర్తిగా కాలుష్యకారకంగా తయారు చేశారు. గ్రామస్థులు ఆందోళనలు చేసి ఫిర్యాదు చేయడంతో నమూనాలు తీసుకున్నారు.
వికారాబాద్‌ జిల్లాలో పరిశ్రమల రసాయనాల తాకిడితో మూసీ నది నీరు రంగు మారి ప్రవహిస్తోంది. పశుపక్ష్యాదులు నీటిని తాగలేక పోతున్నాయి. కొన్ని మృత్యువాత పడిన ఘటనలున్నాయి.

జిల్లాల్లో పరిస్థితి
* పరిశ్రమలు: సంగారెడి జిల్లా - 2500, మెదక్‌ - 300, వికారాబాద్‌ - 400, సిద్దిపేట - 770
*ప్రధాన ఉత్పత్తులు: ఫార్మా, డ్రగ్స్‌, స్టీల్‌, ప్లాస్టిక్‌, విత్తనాలు, రెడీమిక్స్‌, కెమికల్స్‌, దుస్తులు, ఆహారం, నాపరాయి, సిమెంటు
*రసాయనాల గుప్పిట్లో నీటివనరులు: ఐడీఏ బొల్లారం ఆసానికుంట, గడ్డపోతారం, అయ్యమ్మ, జిన్నారం రాయుని, గండిగూడెం, ఇస్నాపూర్‌, సుల్తాన్‌పూర్‌ చెరువులు, నక్కవాగు, ముప్పిరెడ్డిపల్లి కొడుకుంట, మూసీ నది, గొల్ల చెరువు.
* తీవ్ర కాలుష్య ప్రాంతాలు: ఉమ్మడి జిల్లాలో ఐడీఏ బొల్లారం, గడ్డపోతారం, ఖాజీపల్లి, బొంతపల్లి, పటాన్‌చెరు, ఇస్నాపూర్‌, చిట్కుల్‌, పాశమైలారం, హత్నూర మండలం బోర్పట్ల, గుండ్లమాచనూర్‌, సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్‌, చందాపూర్‌, తుర్కలఖానాపూర్‌, కాసాల, నస్తీపూర్‌, మల్కాపూర్‌, కాళ్లకల్‌, ముప్పిరెడ్డిపల్లి, రంగాయపల్లి, చెట్లగౌరారం, తాండూరు, కరణ్‌కోట్‌, వికారాబాద్‌ శివారెడ్డిపేట.
*నివారణకు మార్గాలు: నీటి కాలుష్యానికి పీఈటీఎల్‌ (ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు), విష వాయువుకు స్క్రబ్బర్లు, ఘన వ్యర్థాలకు వేస్ట్‌ మెనేజ్‌మెంట్‌ ప్రాజెక్టులు.
*వాతావరణంలో ఉండాల్సిన, ఉంటున్న ఉద్గారాలు: 50 పీపీఎం బదులుగా 100-200 పీపీఎం
* ఫిర్యాదులు చేయాల్సిన టోల్‌ఫ్రీ సంఖ్య: 10741


నమూనాల సేకరణ, తాఖీదులు ఇస్తున్నాం: రవికుమార్‌, పీసీబీ ఈఈ
కాలుష్య కారక పరిశ్రమలపై చర్యలు తీసుకుంటూనే ఉన్నాం. నమూనాల సేకరణ, తాఖీదులు ఇవ్వటంతో పాటు నిబంధనలు ఉల్లంఘించే పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. గతంతో పోలిస్తే ఇప్పుడు కాలుష్యం తగ్గింది. ప్రజల ఫిర్యాదు మేరకు ఎప్పటికప్పుడు స్పందించి చర్యలు తీసుకుంటున్నాం. ప్రత్యేకంగా అధ్యయనం చేసేలా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాం.

Read latest Medak News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని