ధాన్యం కొనకపోతే మంత్రి, ఎంపీ ఇళ్ల ముట్టడి
మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్
మాట్లాడుతున్న పొన్నం ప్రభాకర్, రాజయ్య, బొమ్మ శ్రీరాం చక్రవర్తి తదితరులు
హుస్నాబాద్, న్యూస్‌టుడే: డిసెంబరు 15వ తేదీలోపు రైతులందరి ధాన్యం కొనుగోలు చేయకపోతే రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, భాజపా అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఇళ్లను ముట్టడిస్తామని మాజీ ఎంపీ, టీపీసీసీ కార్యనిర్వాహక మాజీ అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం హుస్నాబాద్‌లో కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా జరిగిన నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, టీపీసీసీ కార్యదర్శి బొమ్మ శ్రీరాం చక్రవర్తితో కలసి పాల్గొన్నారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖరీఫ్‌లో పండించిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కొనుగోలు చేస్తామని, కొనలేమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అస్పష్టతను వ్యక్తం చేస్తున్నాయన్నారు. సభ్యత్వ నమోదు ఇన్‌ఛార్జి వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ కరీంనగర్ నియోజకవర్గాన్ని సభ్యత్వ నమోదులో రాష్ట్రంలో నంబర్ వన్‌గా నిలపాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్ కీలక పాత్రను పోషించిందని ప్రభాకర్ నాయకత్వంలో పార్టీ సభ్యత్వ నమోదులో ముందుండాలన్నారు. టీపీసీసీ కార్యదర్శి బొమ్మ శ్రీరాంచక్రవర్తి మాట్లాడుతూ పార్టీ నిర్ణయించిన సభ్యత్వ నమోదును బాధ్యతగా పూర్తి చేయాలన్నారు. హుస్నాబాద్ సహకార సంఘం అధ్యక్షుడు బొలిశెట్టి శివయ్య, డీసీసీ కార్యదర్శులు చిత్తారి రవి, బస్వరాజు శంకర్, కోమటి సత్యనారాయణ, వంగర మల్లేశం, హసన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అక్కు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.