logo
Published : 02 Dec 2021 04:10 IST

కుంటలపై కన్ను

నర్సాపూర్‌లో రెచ్చిపోతున్న అక్రమార్కులు  

కనుమరుగవుతున్న కోరేటికుంట

న్యూస్‌టుడే, నర్సాపూర్‌: నర్సాపూర్‌ పట్టణంలో భూముల విలువ పెరుగుతోంది. దీనిని ఆసరా చేసుకుని కొందరు అక్రమార్కులు నీటి వనరులపైనా కన్నేశారు. ఒకప్పుడు పట్టణానికి దూరంగా ఉన్న కుంటలు.. పట్టణీకరణ నేపథ్యంలో ప్రస్తుతం వాటి చుట్టూ జనావాసాలు వచ్చేశాయి. సాగు యోగ్యమైన భూములూ ప్లాట్లుగా రూపాంతరం చెందాయి. దీంతో అన్ని వైపులా ఆక్రమిస్తూ వస్తున్నారు. అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్థిరాస్తి వ్యాపారం క్రమంగా పుంజుకోవడంతో ఆయకట్టు భూములు వెంచర్‌లుగా మారుస్తున్నారు. కట్టలపైకి వెళ్లే దారినే వెంచర్‌లోకి చూపుతుండటం గమనార్హం. కోమటికుంట వద్ద ఈ పరిస్థితి ఉంది. ఇక పంట కాల్వలూ మాయమవుతున్నాయి. ఈ పరిస్థితి సంగారెడ్డి మార్గంలో నెలకొంది.

* ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం సమీపాన కొత్తకుంట అన్యాక్రాంతం అవుతోంది. కుంట పూడ్చివేత చేపట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం నిర్మాణంకు ఐదు ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో కొత్తకుంట ఉంది. ప్రస్తుతం ఇక్కడ గజం జాగా రూ.లక్షకు పైగానే పలుకుతుండటం గమనార్హం. కుంట ప్రాంతాన్ని కబ్జా చేయడానికి కొందరు యత్నిస్తున్నారు. ఈకుంట పట్టణంలో పారిశుద్ధ్య సమస్యలకు కారణమవుతుందని ఏడాది కిందట పురపాలిక రూ.20 లక్షలు వ్యయం చేసి పూడ్చివేసింది. ఇక్కడే కోటి రూపాయలతో ఉద్యానం ఏర్పాటుకు ప్రతిపాదించింది. ఏడాది గడిచిపోతున్నా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు.
* తూప్రాన్‌ మార్గంలోని కోమటికుంట కట్టను కొల్లగొడుతున్నారు. గతంలో కొందరు మట్టి తవ్వి ఆక్రమణలకు యత్నించారు.
* మెదక్‌ రహదారిలోని అల్లమోని కుంటను కొంతమేర కబ్జాచేశారు. మట్టిని రాత్రిపూట దొంగచాటుగా తరలించేస్తూ ఆక్రమణలకు తెరలేపుతున్నారు.
* సంగారెడ్డి రోడ్డులోని కోరేటికుంట నలువైపులా కబ్జాపర్వం సాగుతంది. దీంతో కుంట రూపమే మారిపోయింది. సర్వే చేపట్టి హద్దులు ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రస్తుతం మురుగుతో నిండి దర్శనమిస్తోంది. ఇక ఏదులకుంట, సీతారాంపూర్‌ సమీపంలోని ఎర్రకుంటదీ ఇదే పరిస్థితి.

కోమటికుంట దుస్థితి

సంరక్షణ కమిటీలేవి.?
నీటి వనరుల సంరక్షణకు కమిటీలను ఏర్పాటు చేయాల్సిన నీటి పారుదల శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. ఎలాంటి ఆక్రమణలు ఉన్నా యుద్ధ ప్రాతిపదికన తొలగించాల్సిందేనని, ఆక్రమణలను ప్రాథమిక దశలోనే గుర్తించి చర్యలు తీసుకునేందుకు ఎక్కడికక్కడ సంరక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలని 2015లో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించినా నేటికీ ఒక్క అడుగూ ముందుకు పడలేదు.


హెచ్‌ఎండీఏ సర్వే పూర్తి..: మణిభూషణ్‌, ఏఈ, నీటిపారుదల శాఖ
హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో కుంటల సర్వే  పూర్తయ్యింది. నీటి నిల్వ ప్రాంతం, శిఖం, బఫర్‌ జోన్‌ల గుర్తింపు వంటివి చేశారు. ఆక్రమణలను గుర్తించి వాటికి పరిష్కారం చూపాక హద్దులు ఏర్పాటు చేస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటున్నాం.


కుంట విస్తీర్ణం
కోమటికుంట 15 ఎకరాలు
అల్లమోనికుంట 10 ఎకరాలు
ఏదులకుంట మూడెకరాలు
ఎర్రకుంట రెండెకరాలు
కొత్తకుంట 38 గుంటలు
కోరేటి కుంట 28 గుంటలు


 

Read latest Medak News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని