Family Suicide: సంగారెడ్డి జిల్లాలో దారుణం.. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కుటుంబం బలవన్మరణం

సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కలహాలతో ఓ కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. మునిపల్లి

Updated : 03 Dec 2021 13:12 IST

సంగారెడ్డి పట్టణం: సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కలహాలతో ఓ కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. మునిపల్లి మండలం గార్లపల్లికి చెందిన చంద్రకాంత్‌ (38), లావణ్య (32) భార్యాభర్తలు. వీరికి ప్రథమ్‌(6), సర్వజ్ఞ (3) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. చంద్రకాంత్‌ టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. వీరు ప్రస్తుతం హైదరాబాద్‌ శివారు బీహెచ్‌ఈఎల్‌లో నివాసముంటున్నారు. అక్కడికి సమీపంలోని బాంబే కాలనీలో నూతనంగా ఇంటి నిర్మాణం చేపట్టారు. దీనికోసం లావణ్య తల్లిదండ్రులు రూ.40లక్షలు సహాయం చేశారు. చంద్రకాంత్‌కు వచ్చే జీతం మొత్తం ఇంటి నిర్మాణ పనులకే ఖర్చువుతుండటంతో ఇల్లు గడిచేందుకు ఇబ్బందులు తలెత్తాయి. ఎంతో కొంత సహాయం చేయాలని తన తల్లిదండ్రులను చంద్రకాంత్‌ కోరగా.. అందుకు వారు నిరాకరించారు. 

కాగా.. గురువారం సాయంత్రం కుటుంబసభ్యుల గృహప్రవేశానికి చంద్రకాంత్‌ దంపతులు వెళ్లొచ్చారు. అనంతరం చంద్రకాంత్‌ తన తల్లిదండ్రులతో ఇంటి నిర్మాణానికి అవసరమైన డబ్బుల విషయంలో గొడవపడ్డాడు. రోజూ దీనిపై ఇంట్లో గొడవలు జరుగుతుండటంతో తీవ్ర మనస్తాపం చెందిన లావణ్య.. పిల్లలతో సహా ఇంటి నుంచి వెళ్లిపోయింది. భార్య ఇంటి నుంచి వెళ్లిపోవడం, గొడవల నేపథ్యంలో చంద్రకాంత్‌ ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. బయటకు వెళ్లిపోయిన లావణ్య.. కాసేపటికి అనుమానం వచ్చి పక్కింటికి ఫోన్‌ చేయగా భర్త చంద్రకాంత్‌ ఆత్మహత్య చేసుకున్నారన్న విషయం తెలిసింది. దీంతో తీవ్రంగా కలత చెందిన ఆమె.. ఇద్దరి పిల్లలతో సహా అందోల్‌ పెద్ద చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఉదయం చెరువులో మృతదేహాలు తేలియాడుతుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.  అనంతరం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని లావణ్యతో పాటు పిల్లల మృతదేహాలకు బయటకు తీశారు. దీనిపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని